Earthquake: తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను భూకంపం వణించింది. పొద్దున 7.30 గంటల సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పలు సెకెన్ల పాటు భూమి కంపించింది. తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు భూకంప పరిశోధన కేంద్రం వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉపరితలం నుంచి 40 కి.మీ దిగువన భూ ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల కారణంగా భూకంపం వచ్చినట్లు తెలిపారు. అటు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే తొలిసారి అని భూకంప పరిశోధన నిపుణులు వెల్లడించారు. వచ్చే రెండు మూడు రోజుల్లోనూ భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు.
తెలంగాణ, ఏపీ ఏ జోన్ లో ఉన్నాయంటే?
దేశంలో భూకంపాలు వచ్చే ప్రాంతాలను నేషనల్ జాగ్రఫికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నాలుగు జోన్లుగా విభజించింది. వాటిలో జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5గా కేటగిరీ చేసింది. జోన్ 5లో సంభవించే భూకంపాల తీవ్రత అత్యంత ఎక్కువగా ఉంటుంది. ప్రాణ, ఆస్తినష్టం తీవ్రంగా ఉంటుంది. తెలంగాణ జోన్ 2లో ఉంది. అంటే, ఈ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా 5.3 తీవ్రతతో భూకంపం రావడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. ఏపీజోన్ 3 పరిధిలో ఉంది. అంటే, ఇక్కడ ఓ మాదిరి భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ మీద 7 వరకు ఉంటుంది.
భూకంపం వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
⦿భూకంపం వచ్చిన సమయంలో ఇంట్లో ఉన్నట్లైతే టేబుల్, డెస్క్ లాంటి వస్తువులు మీద పడకుండా చూసుకోవాలి. మీ మెడ, తలకు దెబ్బలు తగలకుండా కాపాడుకోవాలి.
⦿ఇంట్లో మంచం మీద పడుకొని ఉంటే.. తల, మెడను దిండుతో కవర్ చేసుకోవాలి. బలమైన వస్తువులు మీద పడినా దెబ్బలు తగలకుండా కాపాడుతుంది.
⦿భూకంప సమయంలో ప్రమాదకరమైన ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ మీరు ఆరుబయట ఉంటే భవనాలు, విద్యుత్ లైన్లు, చెట్లకు దూరంగా జరగాలి.
⦿భూకంప సమయంలో భవనం కదులుతున్నప్పుడు కిందికి, మీదికి పరిగెత్తకూడదు. వీలైనంత వరకు గదిలో నుంచి బయటకు రాకూడదు.
⦿ఒకవేళ మీరు కారులో జర్నీ చేస్తున్నట్లు అయితే, వెంటనే కారును రోడ్డు పక్కకు తీసి ఆపివేయండి. భవనాలు, చెట్లు, ఓవర్ పాస్‌లు, యుటిలిటీ వైర్ల దగ్గర ఆగకుండా చూసుకోవాలి.
⦿ఒకవేళ మీరు శిథిలాల కింద చిక్కుకున్నట్లయితే.. మీ నోటిని రుమాలు, లేదంటే ఇతర దుస్తులతో కప్పుకోవాలి. శ్వాస తగిలేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
⦿భూకంపం సంభవించిన సమయంలో ఎమర్జెన్సీ కిట్ ను రెడీ చేసుకోవాలి. ఈ కిట్ లో ముఖ్యంగా వాటర్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, దృఢమైన షూ, పోర్టబుల్ రేడియో, స్నాక్స్, కాస్త డబ్బును దగ్గర పెట్టుకోవాలి.
ఈ పద్దతులు కూడా పాటించండి!
భూకంపం సమయంలో ప్రజలు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
⦿భూకంపం సమయంలో గాయాలు కాకుండా కాపాడుకునే ప్రయత్నం చేయాలి.
⦿ మీ ఇంటి గోడలు ఎంత బలంగా ఉన్నాయో పరీక్షించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
⦿ఒకవేళ మంటలు సంభవిస్తే ఆర్పేందుకు రెడీగా ఉండాలి.
⦿అగ్నిప్రమాదాలను ముందుగా గుర్తించడంతో పాటు నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి.
Read Also: ములుగులో భూకంప కేంద్రం.. మళ్లీ మళ్లీ ప్రకంపనలు తప్పవా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?