Hyderabad City Crime: సమయం అర్ధరాత్రి 12 గంటలు. అందరూ నిద్రావస్థలో ఉండే సమయం అది. కానీ ఇక్కడ మాత్రం అందుకు అంతా భిన్నం. అర్ధరాత్రే హడావుడి వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఈ సెంటర్స్ కి ఒక్కసారి వస్తే, ఆ సమయంలో 100 మందిని చూసేస్తాం. అంటే లెక్క అంతకంటే ఎక్కువ కూడా ఉండవచ్చు. ఇంతకు ఇక్కడేమి జరుగుతుంది? మార్కెట్ సెంటర్ కూడా కాకపోయే.. మరేంటీ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇటీవల పోలీసులు చెప్పారు. పూర్తి విషయంలోకి వెళితే..
హైదరాబాద్ ఒక మహానగరం. ఈ నగరం ఎందరికో ఉపాధి మార్గం చూపించే మార్గదర్శకం. ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి కూడా ఎందరో వలస వచ్చి మహానగరంలో ఉపాధి పొందుతున్నారు. అంతేకాదు ఉన్నత విద్యను అభ్యసించేందుకు కూడా ఎందరో విద్యార్థులు కూడా ఇక్కడికి రావాల్సిందే. కానీ అటువంటి మహా నగరంలో పగటి పూట మాత్రం బిజిబిజీ బ్రతుకులే మనకు కనిపిస్తాయి. రాత్రయితే మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని అనుకుంటే పొరపాటే. అర్ధరాత్రి కూడా బిజీబిజీగానే ఉంటున్నాయి పలు ప్రధాన సెంటర్స్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్యపై పూర్తి దృష్టి సారించింది. అసాంఘిక కార్యకలాపాలు, బైక్ రేసింగ్స్ కి అడ్డాగా మారిన కూడళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు సిటీ పోలీసులు. ఈ తరుణంలో నగరం అర్దరాత్రి కథ ఒక్కొక్కటిగా బయటపడుతోంది. వాటిని ఒక్కొక్కటిగా అడ్డుకొనేందుకు పోలీసులు పడుతున్న శ్రమకు హ్యాట్సాఫ్ చెప్పవచ్చు. కానీ అక్కడక్కడా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్న వేళ, మఫ్టీలో పోలీసులు పహారా కాస్తూ.. ఇది మీకు తగునా అంటూ చైతన్యపరిచే కార్యక్రమాలను కూడా సాగిస్తున్నారు. ఇటీవల కూకట్ పల్లి వద్ద పోలీస్ రైడింగ్ సాగితే, ఎందరో యువతీ యువకులు రన్నింగ్ చేసిన పరిస్థితి. ఇంతలా పోలీసులను చూసి వారెందుకు పారిపోయారో తెలుసా.. అందుకు పెద్ద కారణమే ఉంది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లి మెట్రో సమీపంలో అర్ధరాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్న విషయం పోలీసులకు చేరింది. రాత్రయితే చాలు.. అమ్మాయిలు, అబ్బాయిలు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఉంటున్న పరిస్థితి. ఈ విషయంపై పోలీసులు ఆరా తీసి, పక్కా స్కెచ్ వేసి దాడులు నిర్వహించారు. యువతీ యువకులను టార్గెట్ చేసిన ఓ ముఠా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుందని పోలీసులు గుర్తించారు. డబ్బులు అవసరమైన వారే వీరి టార్గెట్ నట.
కోటి ఆశలతో నగరానికి వచ్చి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న యువతులకు మాయమాటలు చెప్పడం, వారిని అసాంఘిక ఊబిలోకి పంపించడం ఈ ముఠా పని. రోజుకు లక్షల్లో డబ్బులు సంపాదించడం, కమిషన్ పొందడం ఇక్కడి బ్యాచ్ వంతు. ఈ ముఠాలో కీలక పాత్ర పోషించేది పురుషుల కంటే మహిళలేనట. అంతేకాదు ఇక్కడ ఘర్షణలు కూడా జోరుగా సాగుతుంటాయట. మద్యం మత్తులో ఉన్న యువకులు, బైక్ రైడింగ్స్ చేస్తూ పలుమార్లు ఘర్షణకు పాల్పడిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ జరుగుతున్న తతంగమంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, యువకులు కూకట్ పల్లి బాట పడుతున్నారు.
దీనితో ఈ ముఠా ఆటకట్టించే పనిలో సైబరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు. మఫ్టీలో పోలీసులను ఏర్పాటు చేసి, 10 మంది వ్యభిచార మహిళల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కూకట్ పల్లి ఎమ్మార్వో సమక్షంలో బైండోవర్ చేశారు. ఉపాధి, చదువు కోసం వచ్చిన యువతీ యువకులను అసాంఘిక ఊబిలోకి దింపుతున్న ముఠాను ఆటకట్టించాల్సిన భాద్యత పోలీసులపై ఉంది. అయినప్పటికీ ఈ ముఠా గుప్పిట్లో చిక్కుకున్న వారిని గుర్తించి, కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో పరివర్తన తీసుకురావాలని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు.