వేసవి వచ్చేసింది. వసంత రుతువు మొదలైపోయింది. మామిడి మొక్కలకు చిగుళ్ళు వచ్చేసాయి, పూత కనిపిస్తుంది. అంటే మరొక్క నెలలో మామిడికాయలు మార్కెట్లోకి వచ్చేస్తాయి. పుల్లని మామిడితో పులిహోర చేస్తే రుచిగా ఉంటుంది. మామిడి పండ్లు రావడానికి కాస్త సమయం పడుతుంది. కానీ పుల్లని మామిడి పండ్లు మాత్రం ముందే మార్కెట్లో సందడి చేస్తాయి. ఈ మామిడికాయలతో ఆవకాయలు, ఊరగాయలు వంటి నిల్వ పచ్చళ్ళు పెట్టేవారు. ఎంతోమంది ఒక్కసారి పెట్టుకుంటే ఏడాదంతా ఇవి వస్తాయి. అలాగే మామిడికాయతో ఒకసారి పులిహార చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో మామిడి పులిహోర ఒకటి. దీన్ని చేయడం కూడా చాలా సులువు.
మామిడికాయ పులిహోరకు కావలసిన పదార్థాలు
పుల్లని మామిడికాయలు – రెండు
వండిన అన్నం – నాలుగు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ఒక స్పూను
ఆవాలు – ఒక స్పూను
మినపప్పు – ఒక స్పూను
శనగపప్పు – ఒక స్పూను
పచ్చిమిర్చి – ఐదు
ఎండుమిర్చి – రెండు
కరివేపాకులు – గుప్పెడు
మామిడికాయ పులిహోర రెసిపీ
⦿ పులిహోర కోసం పుల్లని మామిడిని ఎంపిక చేసుకోవాలి.
⦿ ఇప్పుడు మామిడి కాయ పైన పొట్టును తీసేసి సన్నగా మామిడిని తరిగి పక్కన పెట్టుకోవాలి.
⦿ వీలైతే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్టులా కూడా చేసుకోవచ్చు.
⦿ ఇప్పుడు ముందుగా అన్నాన్ని వండి ఒక ప్లేట్లో వేసి పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోవాలి.
⦿ ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
⦿ ఆ నూనెలో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించాలి.
⦿ తర్వాత కరివేపాకులు ఎండుమిర్చి, పసుపు కూడా వేసి కలుపుకోవాలి.
⦿ అందులోనే మామిడి తురుమును కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి.
⦿ ఇప్పుడు ఉప్పును అందులో వేసి బాగా కలుపుకోవాలి.
⦿ అది వేడిగా ఉన్నప్పుడే ఉప్పును వేస్తే ఉప్పు త్వరగా కరిగిపోతుంది.
⦿ ఇప్పుడు ముందుగా వండి పెట్టుకున్నా అన్నంలో ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి.
⦿ ఇది పుల్లపుల్లని రుచితో చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ మామిడికాయ పులిహోరను తిని చూడండి. మీకు ఎంతో నచ్చుతుంది.
⦿ వేసవిలోనే మామిడికాయలు లభిస్తాయి. కాబట్టి సీజనల్ గా దొరికే ఈ ఆహారాన్ని కచ్చితంగా తినాల్సిందే.
పచ్చి మామిడికాయ తో చేసే ఆహారాలు ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో పుల్లని మామిడికాయ ముందుంటుంది. పచ్చిమామిడి కాయలు తింటే రక్తహీనత సమస్య కూడా తగ్గిపోతుంది. కాబట్టి మహిళలు పిల్లలు మామిడికాయ తినేందుకు ప్రయత్నించాలి. అలాగే చర్మాన్ని మెరిసేలా చేయడంలో కూడా పచ్చి మామిడికాయ ముందుంటుంది.
Also Read: అన్నం మిగిలిపోతే ఇలా క్రంచీ గారెలు చేసేయండి, బ్రేక్ ఫాస్ట్ లో అదిరిపోతాయి
కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకోవడంలో ఇది సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకుంటున్న వారు వేసవిలో పచ్చి మామిడికాయని తినేందుకు ప్రయత్నించండి. గుండె ఆరోగ్యానికి కూడా మామిడికాయలో ఉండే ఎన్నో పోషకాలు సహకరిస్తాయి. జీర్ణక్రియ కూడా సులువుగా జరుగుతుంది. డయాబెటిస్ తో బాధపడుతున్న వారు పచ్చి మామిడికాయలు తినేందుకు ప్రయత్నించండి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి డయాబెటిస్ ను తగ్గిస్తుంది.