భార్యాభర్తలు తిట్టుకోవడం సాధారణమే. కుటుంబంలో కొట్లాటలు, కలిసి పోవడాలు చూస్తూనే ఉంటాము. అయితే భార్యాభర్తల మధ్య గొడవలకు ప్రధాన కారణం మాత్రం ఒకటుంది. ప్రతి ఇంట్లోనూ దీని గురించే ఎక్కువగా గొడవలు అయ్యే అవకాశం ఉంది. అదే డబ్బు.
డబ్బు సరిపోకపోవడం అనేది భార్యాభర్తల మధ్య ఎక్కువ గొడవలు వచ్చేలా చేస్తుంది. భార్య అంచనాలు ఒకలా ఉంటే… భర్త సంపాదన మరోలా ఉంటుంది. ఇదే ప్రేమికులనైనా భార్యాభర్తలనైనా విడదీసేది. నిజానికి అన్ని సమస్యలకు డబ్బే కారణం అనుకుంటారు… కానీ డబ్బు కారణం కాదు. మనం సంతృప్తిగా బతకలేకపోవడమే అసలైన కారణం. ఎంత డబ్బులు వచ్చినా కూడా సంతృప్తిగా బతికేవారు ఎంతోమంది ఉన్నారు. కేవలం కోట్లు సంపాదించే వాళ్ళే కాదు, నెలకి పదివేలు సంపాదించే వాళ్లు కూడా సంతోషంగా జీవిస్తున్న వారు ఉన్నారు. అంటే మారాల్సింది మన సంపాదన కాదు, మన ఆలోచన. ఈ విషయం చాలామందికి తెలియక నిత్యం గొడవలు పడుతూ ఉంటారు.
లెక్కలు వేసుకోండి ముందే
ఏ గొడవైనా అరుచుకుంటే… పెద్దదవుతుంది. అదే కూర్చుని మాట్లాడుకుంటే చాలా చిన్నగా కనిపిస్తుంది. డబ్బు గురించి మీ భార్యాభర్తల మధ్య సమస్య వస్తే ఇద్దరూ కలిసి కూర్చొని ఖర్చులు ఎలా తగ్గించుకోవాలో ఆలోచించండి. అలాగే భార్య ఇంట్లోనే కూర్చుని తినాలని లేదు. భర్త సంపాదన తక్కువ అయినప్పుడు భార్య కూడా కష్టపడవచ్చు. ఇంటికి అయ్యే ఖర్చుకు సహాయ పడవచ్చు. నిత్యం భర్తను వేధించే కన్నా ఆమె కూడా ఏదో ఒక పనిచేసే సంపాదిస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది.
ఆదాయ వ్యయాలు చూసుకోండి
నెలకు మీరు సంపాదించే డబ్బును బట్టి మీ ఖర్చు కూడా ఉండాలి. ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం మీరు సంపాదించే దాంట్లో కేవలం 70 శాతం మాత్రమే ఖర్చయ్యేలా చూసుకోండి. మిగతా 30 శాతాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం మీ ఖర్చులు ఒకచోట రాసి పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ కింద కొంత డబ్బును పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా ఆసుపత్రి ఖర్చులకు ఇది అవసరం పడొచ్చు. ప్రతి నెలా దాచిపెట్టిన డబ్బును వేరే బ్యాంకు ఖాతాలో ఉంచండి. ఇలా ఉంచడం వల్ల మీరు ప్రశాంతంగా ఉండగలరు. అత్యవసర సమయాల్లో ఆ డబ్బు ఉందనే ధైర్యం మీలో ఉంటుంది. పొదుపు చేసేవారు ఎప్పటికీ ప్రశాంతంగానే జీవిస్తారు.
Also Read: భార్యతో వెళ్లాల్సిన హనీమూన్‌కు నా ఫ్రెండ్‌తో వెళ్లాల్సి వచ్చింది, దానికి కారణం?
డబ్బు దగ్గర భార్యాభర్తలకి గొడవలు వస్తున్నప్పుడు ముందుగానే ఆర్థిక ప్రణాళిక వేసుకోండి. కొంత మొత్తాన్ని పక్కన పెట్టి మీ భార్య చేతికి అందించండి. వాటిని జాగ్రత్తగా దాచమని చెప్పండి. తన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆమె అంత త్వరగా చికాకు పడదు. అత్యవసరమైన సమయంలో వాటిని వాడవచ్చనే ధీమాతో ఉంటుంది. అలాగే మగవారు కూడా తమ ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. తాగుడుకు, ధూమపానానికి పెట్టే ఖర్చును ఆదా చేస్తే నెల నెల అప్పు అనేది చేయక్కర్లేదు. అలాగే ఆడవారు అనవసరమైన ఖర్చును తగ్గించుకుంటే ఈ గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుంది. గొప్పలకి పోతే ఎంత డబ్బైనా సరిపోదు, కాబట్టి మనకు వచ్చే ఆదాయంలోనే సంతృప్తిగా బతకడం నేర్చుకుంటే భార్యాభర్తలిద్దరూ సీతారాముల్లా కనిపించడం ఖాయం.