Mughlai Egg Curry: ఎగ్ లవర్స్‌కు ఎప్పుడూ కొత్త రుచులు ట్రై చేయడమంటే భలే ఇష్టం. రెగ్యులర్‌గా చేసే మసాలా ఎగ్ కర్రీ కాకుండా, కాస్త రాయల్ టచ్‌తో, చిక్కటి గ్రేవీతో మొగలాయ్ ఎగ్ కర్రీ చేస్తే ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. జీడిపప్పు, గసగసాలు, కమ్మని మసాలాలతో తయారయ్యే ఈ కర్రీ వేడివేడి బగారా రైస్, నాన్, చపాతీ లేదా బిర్యానీలోకి సూపర్ కాంబినేషన్‌గా నిలుస్తుంది. రెస్టారెంట్ స్థాయి రుచిని మన ఇంట్లోనే ఈజీగా ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం.
మన ఇండియన్ కుకింగ్‌లో మొగలాయ్ వంటకాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. రిచ్ టెక్స్చర్, బ్యాలెన్స్‌డ్ మసాలాలు, ఘుమఘుమలాడే.. అరోమా వీటి మెయిన్ అట్రాక్షన్. సాధారణ ఎగ్ కర్రీలో టమాటో, ఉల్లిపాయలు ఎక్కువగా వాడతాం కానీ.. మొగలాయ్ స్టైల్‌లో ఉల్లిపాయ పేస్ట్, జీడిపప్పు, పెరుగు, మసాలాలు కలిపి గ్రేవీని క్రీమీగా, రిచ్‌గా చేస్తారు. వీకెండ్స్‌లో స్పెషల్ లంచ్ లేదా డిన్నర్ ప్లాన్ చేసినప్పుడు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయెచ్చు. అతిథులు వచ్చినప్పుడు కూడా ఇది మంచి ఆప్షన్‌గా ఉంటుంది.
కోడిగుడ్లు: 6
ఉల్లిపాయలు: 3
జీడిపప్పు పలుకులు: 15 నుంచి 18
గసగసాలు: 1 టీస్పూన్
తాజా పెరుగు: అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1.5 టీస్పూన్లు
పచ్చిమిర్చి: 2
కొత్తిమీర తరుగు: కొద్దిగా
పుదీనా ఆకులు: కొద్దిగా
నూనె లేదా నెయ్యి: 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
మసాలాలు,పోపు దినుసులు:
షాజీరా: అర టీస్పూన్
బిర్యానీ ఆకు: 1
దాల్చిన చెక్క: చిన్న ముక్క
యాలకులు: 3
లవంగాలు: 4
కారం: 1 నుంచి 1.5 టీస్పూన్లు
ధనియాల పొడి: 1.5 టీస్పూన్లు
జీలకర్ర పొడి: అర టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
కసూరీ మేతి: 1 టీస్పూన్
పసుపు: పావు టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
1. ముందుగా జీడిపప్పు, నానబెట్టిన గసగసాలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఉల్లిపాయలను కూడా విడిగా మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. పెరుగును గిన్నెలో వేసి ఉండలు లేకుండా బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉడికించిన గుడ్లకు చాకుతో చిన్న చిన్న గాట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల మసాలా, ఉప్పు, కారం గుడ్ల లోపలికి బాగా పడతాయి. పాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, చిటికెడు పసుపు, కారం వేసి గుడ్లను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే పాన్‌లో మరికొంచెం నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. షాజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు, రంగు మారే వరకు మీడియం ఫ్లేమ్‌లో వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి చీలికలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి.
3. ఇప్పుడు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసి కలపాలి. వెంటనే జీడిపప్పు, గసగసాల పేస్ట్ వేసి మసాలాలు మాడి పోకుండా నిదానంగా వేయించాలి. నూనె పైకి తేలే.. వరకు వేయించిన తర్వాత, స్టవ్ సిమ్‌లో ఉంచి గిలకొట్టిన పెరుగును కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. పెరుగు విరిగి పోకుండా కలుపుతూ ఉండటం చాలా ముఖ్యం.
Also Read: సాధారణ బాయిల్డ్ ఎగ్స్ తిని బోర్ కొట్టిందా? రుచి మార్చే సింపుల్ రెసిపీస్!
4. గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలిన తర్వాత అవసరమైనంత.. వేడి నీళ్లు పోయాలి. గ్రేవీ మరుగు తున్నప్పుడు వేయించిన గుడ్లను అందులో వేయాలి. మూత పెట్టి 5 నుంచి 7 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. చివరగా గరం మసాలా, చేతితో నలిపిన కసూరీ మేతి, కొత్తిమీర, పుదీనా వేసి మరో రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
పెరుగు వేసే ముందు స్టవ్ పూర్తిగా తగ్గించడం .. లేదా ఒక్క నిమిషం ఆపి వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుంది. కొంచెం ఫ్రెష్ క్రీమ్ లేదా వెన్న చివర్లో.. వేస్తే మరింత రాయల్ ఫీల్ వస్తుంది. ఈ మొగలాయ్ ఎగ్ కర్రీని వేడివేడిగా సర్వ్ చేస్తే గ్రేవీ చిక్కగా, రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో వారందరికీ కూడా ఇది తప్పకుండా నచ్చుతుంది.