ప్రపంచంలో మగవాళ్లను, ఆడవాళ్లను కామన్ గా ఇబ్బంది పెట్టే సమస్యల్లో అతి ముఖ్యమైనది, అత్యంత ఆందోళన కలిగించేది జుట్టు రాలడం. ఎంత విగ్గులతో కవర్ చేసుకున్నా, హెయిర్ ఎక్ట్ టెన్షనర్స్ తో మెయింటెన్ చేసినా సహజంగా మన తలపై ఉండే ఆ నాలుగు వెంట్రుకలే మన ఆస్తి. అందుకే అవి ఉన్నప్పుడే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. పోయిన తర్వాత చేసేదేంలేదు. అంటే ఇక్కడ జుట్టు విషయంలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అన్నమాట. పోనీ ఒకవేళ జుట్టు పల్చబడుతుందే అనుకుందాం. అలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన సహజసిద్ధ ఔషధాలను జపాన్ శాస్త్రవేత్తలు తాజాగా ప్రచురించారు. ఇప్పటి వరకూ చాలామంది నిపుణులు ఈ విషయంలో తమ పరిశోధనలను బయటపెట్టినా.. జపాన్ శాస్త్రవేత్తలు కనిపెట్టిన కొత్త రెమెడీ మాత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది.
ఆ రెండూ ఉంటే చాలు..
జపాన్ లోని రోహ్టో ఫార్మాస్యూటికల్ కంపెనీ.. జుట్టురాలడంపై, పోయిన జుట్టుని తిరిగి తీసుకురావడంపై కొన్ని ప్రయోగాలు చేస్తోంది. ప్రకృతి సిద్ధంగా వెలికి తీసిన పదార్థాలతో కొత్త మందులు కూడా కనిపెడుతోంది. అయితే ఆమందులకోసం ఉపయోగించే పదార్థాలను ఆ కంపెనీ బయటపెట్టడం విశేషం. ఆ రెండు పదార్థాలు జుట్టు రాలడాన్ని అరికడతాయని, రాలిపోయిన చోట కొత్తగా జుట్టు మొలిచేందుకు చర్మాన్ని ప్రేరేపిస్తాయని చెబుతున్నారు. ఫిలోడెండ్రాన్ అనే చెట్టు బెరడు, ఎండబెట్టిన నారింజ పండ్ల తొక్కతో పోయిన జుట్టు తిరిగొస్తుందని నమ్మకంగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
ఆ చెట్టు బెరడు..
ఫిలోడెండ్రాన్ అనేది ఆసియాలోని ఉష్ణమండల ప్రాంతాల్లో విరివిగా కనిపించే ఒక చెట్టు. దీని ఆకులు వేప చెట్టు ఆకుల్లా ఉంటాయి. కాయలు నేరేడు పండ్లలా కనపడతాయి. దీని బెరడు వైద్యానికి మంచిదని అంటారు. ఇప్పటికే వివిధ ఆయుర్వేద ఔషధాల్లో ఈ బెరడుని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు దీన్ని జుట్టు పెరగడానికి కూడా ఉపయోగిస్తారని తెలుస్తోంది.
నారింజ తొక్క..
తొక్కే కదా అని తేలిగ్గా చూడకూడదు. నిజానికి నారింజ కుటుంబానికి చెందిన సిట్రస్ పండ్ల తొక్కల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. చైనాలో నారింజ్ల పండ్లను తినడానికంటే ఎక్కువగా, దాని తొక్కను తీసి ఉపయోగిస్తుంటారు. ఆ తొక్కను ఎండబెట్టి పొడి చేసి ఆహార పదార్థాల్లో వాడుతుంటారు. ఆ పొడితో టీ తయారు చేస్తారు. అయితే ఎండబెట్టిన ఆ తొక్క ఇప్పుడు పోయిన జుట్టుని తిరిగి తీసుకొస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎండిపోయిన ఈ తొక్కను వారు జిన్పిగా పిలుస్తారు. వాస్తవానికి జీర్ణ క్రియలో ఉపయోగపడే ఈ రెండు పదార్థాలు, రాలిన జుట్టుని తిరిగి తీసుకొస్తాయనేది కొత్త పాయింట్.
ప్రొటీన్..
ఫిలోడెండ్రాన్ చెట్టు బెరడు, జిన్పిలో కొన్ని ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయి. అవి మన వెంట్రుకల కుదుళ్లలో ఉన్న ప్రొటీన్ లోని ప్లాసెంటల్ గ్రోత్ ఫ్యాక్టర్ ని రెండున్నర రెట్ల వరకు పెంచగలవు. అంటే మనం కోల్పోయిన వెంట్రుకలు మనకు తిరిగి పూర్తి స్థాయిలో వస్తాయనమాట. జుట్టు సహజ నిర్మాణం, దాని పెరుగుదల ప్రోటీన్ పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రొటీన్ కి ఇవి రెండు ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయన్నమాట. ఈ రెండు పదార్థాలతో జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఔషధాలను కూడా జపాన్ కంపెనీ తయారు చేస్తోంది.