Nellore Malai Khaja: సాధారణంగా నెల్లూరు అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది కారప్పొడి దోశ, చేపల పులుసు. కానీ, ఆ ఊరి ఫేమస్ వంటకాల్లో మలైకాజాకి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పెళ్లిళ్లు, పేరంటాలు లేదా ఏ చిన్న వేడుక జరిగినా ఈ తియ్యటి వంటకం ఉండాల్సిందే. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే ఈ మలైకాజా రుచి చూస్తే ఎవరైనా సరే మరో ముక్క అడగకుండా ఉండలేరు. బయట స్వీట్ షాపుల్లో కొనేదానికంటే.. మన చేతులతో స్వయంగా చేసి కుటుంబ సభ్యులతో కలిసి తింటే ఆ సంతోషమే వేరు.
కోవా – ఒక కప్పు
మైదా పిండి – అర కప్పు
పాలు – రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి – రెండు టీస్పూన్లు
బేకింగ్ సోడా – చిటికెడు
పంచదార – ఒకటిన్నర కప్పులు
నీళ్లు – ఒక కప్పు
యాలకుల పొడి – అర టీస్పూన్
నూనె – వేయించడానికి సరిపడా
Also Read: సీక్రెట్ మసాలాలతో తందూరీ మోమోస్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!
మలైకాజా తయారీ కోసం ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కోవా, మైదా పిండి వేసుకోవాలి. దీనికి చిటికెడు బేకింగ్ సోడా, నెయ్యి జోడించి చేతితో బాగా కలపాలి. పిండి, కోవా మిశ్రమం బాగా కలిశాక, కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం మృదువుగా కలుపుకోవాలి. పిండిని గట్టిగా కాకుండా చాలా మెత్తగా కలుపుకోవడం వల్ల కాజాలు లోపలి వరకు సాఫ్ట్‌గా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి.
ఈలోగా పంచదార పాకం సిద్ధం చేసుకోవాలి. ఒక గిన్నెలో పంచదార, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. పంచదార పూర్తిగా కరిగి పాకం కొద్దిగా జిగురుగా మారే వరకు మరిగించాలి. తీగ పాకం రానవసరం లేదు, కేవలం జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఆ తర్వాత దించే ముందు యాలకుల పొడి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇప్పుడు పక్కన పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఉండలను పగుళ్లు లేకుండా గుండ్రంగా లేదా కాజా ఆకారంలో చేసుకోవాలి. ఒక కడాయిలో వేయించడానికి సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువగా కాగిపోకుండా చూసుకోవాలి, లేదంటే కాజాలు పైకి మాడిపోయి లోపల ఉడకవు.
ముందుగా చేసి పెట్టుకున్న కాజాలను నూనెలో వేసి మంటను తక్కువగా ఉంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. గరిటెతో నెమ్మదిగా తిప్పుకుంటూ రెండు వైపులా సమానంగా వేగేలా చూసుకోవాలి. నూనెలో నుంచి తీసిన వెంటనే వేడివేడిగా ఉన్న కాజాలను తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేయాలి. పాకంలో కనీసం అరగంట పాటు నానితేనే రసం లోపలికి వెళ్లి జ్యూసీగా తయారవుతాయి. పాకం బాగా పీల్చుకున్నాక వీటిని బయటకు తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిపైన కొన్ని బాదం లేదా పిస్తా ముక్కలతో అలంకరించి సర్వ్ చేసుకుంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.
Also Read: పిల్లలు స్నాక్స్ అడిగితే.. 15 నిమిషాల్లో, క్రిస్పీగా ఇలా అటుకుల పకోడి చేసిపెట్టండి!