Adilabad: కలలు కనే వయసు ఈ కుర్రాడిది. చదువుకొని.. కొలువు సాధించి.. తల్లిదండ్రుల ఆశలకు రెక్కలు తొడిగాడు. కానీ విధి రాసిన కథలో.. 25ఏళ్లకే నూరేల్లు నిండాయి. అతను పేరు రాహుల్. ఆదిలాబాద్ జిల్లా హ్యాండిక్యాప్ కాలనీ కుర్రాడు. 25 ఏళ్లకే పుణెలో పెద్ద ఐటీ కంపెనీలో హెచ్ఆర్‌గా జాబ్ సంపాదించాడు. ఇంట్లో వాళ్లను చూడాలని ఊరొచ్చాడు. ఊరికి వస్తే ఊపిరి ఆగిపోతుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ రాహుల్ విషయంలో అదే జరిగింది.
ట్రీట్‌మెంట్ టైంలో వీడియో..
బుధవారం రాత్రి.. రాహుల్‌కి తేలు కుట్టింది. భయంతో రిమ్స్‌కి వెళ్లాడు. మందు కోసం వెళ్తే అక్కడ మాటల యుద్ధం మొదలైంది. ట్రీట్‌మెంట్ టైమ్‌లో వీడియో తీస్తున్నాడని డాక్టర్లు సీరియస్ అయ్యారు. గొడవ చిన్నదే. కానీ క్లైమాక్స్ మాత్రం భయంకరంగా మారింది. ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫోన్ కొట్టగానే.. వాళ్లు రావడం.. టూ టౌన్ పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లడం క్షణాల్లో జరిగిపోయింది.
ఇక్కడే మొదలైంది అసలు కథ..
ఇక్కడే మొదలైంది అసలు కథ.. కుటుంబ సభ్యుల ఆరోపణ ఏంటో తెలుసా? రాహుల్‌పై పోలీసుల లాఠీలు ప్రతాపం చూపించాయట. గుండె పగిలేంత బాధను, ఆ అవమానాన్ని భరించలేకపోయాడు రాహుల్. ఆ రాత్రే ఎస్పీకి అడ్రస్ చేస్తూ ఓ అట్టముక్కపై ఏవో అక్షరాలు రాశాడు. అవి వట్టి అక్షరాలు కాదు. ఆ కుర్రాడి ఆక్రంధనలు. నా చావుకు డాక్టర్, కానిస్టేబుళ్లే కారణమంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. విషయం బయటకు వచ్చిందో లేదో.. రిమ్స్ దద్దరిల్లింది. బంధువులు, దళిత సంఘాలు, డైరెక్టర్ ఛాంబర్ ముందే బైఠాయించి.. గళమెత్తారు. పోలీసులు కొట్టడమేంటి? అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎంట్రీ ఇచ్చారు. ఎస్పీతో మాట్లాడారు.. ఏం జరిగిందో విచారణ జరిపించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
స్టేషన్‌లో నిజంగా ఏం జరిగింది?
డాక్టర్, స్టాఫ్ నర్స్, హెడ్ కానిస్టేబుల్, బ్లూకోల్ట్ కానిస్టేబుల్, హోంగార్డ్.. ఈ ఐదుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రిమ్స్‌లో గొడవ నుంచి స్టేషన్‌లో ఏం జరిగిందో డీప్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఆస్పత్రిలో వీడియో తీయడం నేరమా? స్టేషన్‌లో నిజంగా ఏం జరిగింది? రాహుల్ చనిపోతూ అట్టముక్కపై అడిగిన న్యాయం.. దక్కుతుందా? ఈ కేసు ఎక్కడికి వెళ్తుందో చూడాలి.
Also Read:ఎమ్మెల్యే రేంజ్ ఆస్తులు.. జెడ్పీటీసీగా పోటీ! ఎవరీ మమతశ్రీ?