భార్యాభర్తల బంధం ఎంతో పవిత్రమైనది. అది ఒకరిపై ఒకరికి నమ్మకంతో, ప్రేమతో బలంగా మారుతుంది. ఇద్దరూ ఒకరితో ఒకరు కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించగలిగితేనే వారి బంధం అందంగా కనిపిస్తుంది. కానీ కొంతమంది ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. ఇది జీవిత భాగస్వామిని మానసికంగా వేధిస్తుంది. వారి మానసిక ఆరోగ్యం తీవ్రంగా నష్టపోయేలా చేస్తుంది. వారిని వ్యక్తిగా ఎదగకుండా అడ్డుకుంటుంది. జీవిత భాగస్వామిని ప్రేమించడం మంచిదే, కానీ మీ సంతోషానికి, ఆత్మ గౌరవానికి ఆటంకం కలిగినప్పుడు వారు చేసే పనులను సహించాల్సిన అవసరం లేదు.
గౌరవం ఇవ్వకపోతే
మీ భావాలు, అభిప్రాయాలు పట్ల మీ జీవిత భాగస్వామికి గౌరవం లేనప్పుడు మీరు వారిని అధికంగా భరించాల్సిన అవసరం లేదు. గౌరవం అనేది ఆరోగ్యకరమైన సంబంధానికి ముఖ్యమైనది. మీ భాగస్వామి మీ భావాలను చులకనగా చూడడం, హద్దులు దాటి మాట్లాడడం, మీ అభిప్రాయాలను తోసిపచ్చడం వంటిది పదేపదే చేస్తూ ఉంటే మీరు ఎక్కువ కాలం సహించాల్సిన అవసరం లేదు. ఇలా మీ జీవిత భాగస్వామి ప్రవర్తిస్తున్నారంటే వారు మీ పట్ల ప్రేమగా లేరని, వారి గుండెల్లో మీరు లేరని అర్థం చేసుకోవాలి. ప్రేమంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం, ఒకరి కష్టాలను ఒకరు తీర్చుకోవడం. అది లేనప్పుడు ఆ బంధానికి ఎక్కువ విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు.
మిమ్మల్ని అనుమానిస్తే
నమ్మకం అనేది ఒక సంబంధాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మీకు మీ జీవితంలో ప్రతిదీ అస్థిరంగా, అనుచితంగా అనిపిస్తూ ఉంటే మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మీ భాగస్వామికి మీపై నమ్మకం లేకపోయినా, విశ్వాసం లేనట్టు ప్రవర్తిస్తున్నా మీరు ఆ విషయాన్ని నేరుగా మాట్లాడాలి. మీతో వారు నిజాయితీగా లేనట్టు అనిపించినా కూడా దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి బంధాన్ని బీటలు పడేలా చేస్తాయి. బలమైన సంబంధం నిజాయితీ, విశ్వసనీయత పై నిర్మిస్తారు. అబద్దాలు, రహస్యాల మధ్య ఈ బంధం నిలబడలేదు.
ఇద్దరు కలిసే సాధించాలి
రిలేషన్ షిప్స్ అనేవి సోలో మిషన్ కాదు, ఇద్దరూ కలిపి సాధించాల్సిన టీమ్ ఎఫెక్ట్. వివాహ బంధంలో భార్యాభర్తలిద్దరూ ప్రతి విషయాన్ని కలిపి సమస్యలను పరిష్కరించుకోవడం వంటివి చేయాలి. వన్ సైడ్ నుంచి మాత్రమే ప్రయత్నం ఉంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. మీరు మాత్రమే బరువును మోస్తున్నారనే భావన మీకు రాకూడదు. అలా వచ్చిందంటే మీ బంధం అంత ఆరోగ్యకరంగా లేదని అర్థం. ఎదుటివారు మీకు తగినంత విలువ ఇవ్వడం లేదని అర్థం చేసుకోవాలి.
ఇలా చేస్తే ప్రేమ లేదని అర్థం
భాగస్వామి మిమ్మల్ని నిరంతరం నిరుత్సాహపరచడం, మిమ్మల్ని చులకనగా చేయడం, మీ విలువను తీసిపారేయడం వంటివి చేస్తూ ఉంటే మీరు సహించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మీపై అనుమానం వ్యక్తం చేస్తున్నా, మిమ్మల్ని చాలా చులకనగా చూస్తున్నా వారికి మీపై ప్రేమ లేదని అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పటికీ ఇలాంటి బంధంలో ఎక్కువ కాలం నిలవలేరు. మంచి భాగస్వామి ఎప్పుడు ఎదుటివారికి ఎదగడంలో సహాయపడతారు.
Also Read: హైదరాబాద్ వాసులూ బీ అలర్ట్.. చైనా వైరస్ వచ్చేసింది, అక్కడికి వెళ్తే జాగ్రత్త!
ఇలా చేస్తే.. ప్రేమ పెరుగుతుంది
ప్రేమంటే ప్రతిరోజూ ఒకరికొకరు చిన్నచిన్న మార్గాలలోనే ప్రదర్శించుకుంటారు. బయట నుంచి వచ్చినప్పుడు మీకు ప్రేమగా నీరు అందించడం, అన్నం వడ్డించడం ఇవన్నీ కూడా ప్రేమపూరితమైన చర్యలే. ఇలాంటివేవీ మీ జీవిత భాగస్వామి మీకు చేయకపోతే వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆ ఫీలింగ్ ఎదుటివారిలో లేకపోతే మీరు వారికి నచ్చజెప్పేందుకు ట్రై చేయండి. ఎదుటివారికి మీపై ప్రేమ లేకపోతే మీతో వారు ఎక్కువ కాలం కలిసి జీవించడం కష్టమే.