Fatty Liver Foods: ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేయడం, వేళాపాలా లేని తిండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువుగా తినడం వల్ల ఈ సమస్య చిన్న వయసులోనే వస్తోంది. మొదట్లో ఎలాంటి లక్షణాలు బయటపడవు కాబట్టి.. మన ఆహార అలవాట్లే లివర్ ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన ఆహారంలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని న్యూట్రీషియనిస్ట్ దీప్షికా జైన్ చెబుతున్నారు. ఆమె సూచించిన ఆ ఐదు పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
రోజూ ఉదయం తాగే బ్లాక్ కాఫీ లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది. కాఫీలో ఉండే కేఫిన్ కాలేయంలో కొవ్వు చేరుకోకుండా, మంట తగ్గేలా సహాయపడుతుంది. అయితే ఇందులో పంచదార, పాలు కలపకుండా తాగడం ముఖ్యం. అలాగే బ్లూబెర్రీస్ కూడా కాలేయానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ కణాల వాపును తగ్గించడంలో బాగా పనిచేస్తాయి.
మనకు సులువుగా లభించే ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజూ రెండు ఉసిరికాయలు తినడం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గి కాలేయం సక్రమంగా పనిచేస్తుంది. ఇక అవకాడోలో గ్లుటాథయోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది లివర్ కణాలు దెబ్బతినకుండా కాపాడి, అవి త్వరగా కోలుకోవడానికి దోహదపడుతుంది.
మన వంటగదిలో ఉండే పసుపు, మిరియాల కాంబినేషన్ కాలేయానికి ఎంతో రక్షణ ఇస్తుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ శరీరానికి సరిగ్గా అబ్బాలంటే మిరియాల పొడి కలపాల్సిందే. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల కాలేయంలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ప్రతిరోజూ వీటన్నింటినీ మన డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల లివర్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.
కేవలం మంచి ఆహారం తినడమే కాకుండా దానికి తగ్గట్టుగా శారీరక శ్రమ కూడా చాలా అవసరం. ప్రతిరోజూ కాసేపు వ్యాయామం చేయడం, బరువు అదుపులో ఉంచుకోవడం, తగినంత నిద్రపోవడం, తీపి పదార్థాలు తగ్గించడం చాలా ముఖ్యం. చిన్న చిన్న మార్పులతోనే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి సలహా తీసుకోవడం శ్రేయస్కరం.