Smoking Damage Lungs| ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సహా అన్ని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 తీవ్ర వాయు కాలుష్యం ఉన్న నగరాల్లో ఇండియాలోనే 99 నగరాలున్నాయని ఇటీవల రిపోర్ట్. అలాంటి పరిస్థితుల్లో ధూమపానం లాంటి చెడు అలవాట్లు ఉంటే ఇక ఊపిరితిత్తులు సహా శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినే అవకాశముంది.
కానీ చాలామంది ఒక్క సిగరెట్ తాగితే ఏమవుతుంది? అప్పుడప్పుడు పొగ తాగితే పెద్దగా ప్రమాదం ఉండదని అనుకుంటున్నారు.
మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే మీ ఊపిరితిత్తులు ఇప్పటికే ప్రమాదంలో పడినట్లే. ధూమపానం వల్ల కలిగే నష్టం బయటకు కనిపించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం మొదటి సిగరెట్ నుంచే ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న నగరాల్లో నివసించేవారికి ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది. అసలు సిగరెట్ పొగ ఊపిరితిత్తులను ఎంత త్వరగా దెబ్బతీస్తుంది? ధూమపానం మానేస్తే అవి మళ్లీ ఆరోగ్యంగా మారతాయా? తెలుసుకుందాం.
ధూమపానం వల్ల ఊపిరితిత్తులకు కలిగే నష్టం ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. ఎన్ని సిగరెట్లు తాగుతున్నారు, ఎంతకాలంగా అలవాటు ఉంది, ఆరోగ్యం ఎలా ఉందనే అంశాలు ప్రభావం చూపుతాయి. అయితే మొదటి సిగరెట్ నుంచే హానికర ప్రభావాలు ప్రారంభమవుతాయి. సిగరెట్ పొగలో వేలాది రసాయనాలు ఉంటాయి. వీటిలో కొన్ని విషపూరితమైనవి, క్యాన్సర్‌కు కారణమయ్యేవి కూడా ఉన్నాయి.
ఈ రసాయనాలు శ్వాసనాళాల్లో మంట, వాపును కలిగిస్తాయి. ఊపిరితిత్తుల్లో ఉండే సిలియా అనే చిన్న వెంట్రుకల్లాంటి నిర్మాణాలను కూడా దెబ్బతీస్తాయి. ఇవి శ్వాసనాళాల్లోని దుమ్ము, హాని కలిగించే సూక్ష్మకణాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు పనితీరు తగ్గుతుంది. దీంతో ఊపిరితిత్తుల్లో హానికర పదార్థాలు పేరుకుపోతాయి.
వాహనాల పొగ, పరిశ్రమలు, నిర్మాణ పనులు, చెత్తను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతుంది. ముఖ్యంగా PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు ఊపిరితిత్తుల లోపలి భాగాలకు చేరగలవు. ఇవి శ్వాసవ్యవస్థలో వాపు కలిగిస్తాయి. ఇలాంటి వాతావరణంలో సిగరెట్ తాగితే శరీరంలోకి మరిన్ని హానికర పదార్థాలు చేరుతాయి.
దీర్ఘకాలంలో క్రానిక్ బ్రాంకైటిస్, COPD, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి సమస్యల ముప్పు పెరుగుతుంది.
నిత్యం ధూమపానం చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో అనేక మార్పులు వస్తాయి.
చీమిడి (శ్లేష్మం) పెరుగుతుంది: శ్వాసనాళాల్లో ఎక్కువగా కఫం తయారవుతుంది.
వాపు ఏర్పడుతుంది: హానికర రసాయనాలు శ్వాసనాళాలను చికాకుపెడతాయి.
సిలియా దెబ్బతింటాయి: శ్వాసనాళాలను శుభ్రం చేసే సామర్థ్యం తగ్గుతుంది.
ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుంది: శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది.
గాలి సంచులు దెబ్బతింటాయి: రక్తానికి ఆక్సిజన్ అందించే సామర్థ్యం తగ్గుతుంది.
అప్పుడప్పుడు మాత్రమే సిగరెట్ తాగుతున్నామని కొందరు నిర్లక్ష్యం చేస్తారు. కానీ తక్కువగా ధూమపానం చేసినా హానికర రసాయనాలు శరీరంలోకి చేరుతాయి. పొగతాగడం వల్ల గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పూర్తిగా ధూమపానం మానేయడమే బెస్ట్.
Also Read: జిమ్ చేసిన తరువాత వేడి నీళ్లతో స్నానం చేయడం మంచిదేనా? ఈ విషయాలు తెలుసుకోండి
ధూమపానం మానేసిన తర్వాత శరీరం క్రమంగా కోలుకోవడం ప్రారంభిస్తుంది. కొన్ని వారాల్లోనే ఆరోగ్యపరమైన మార్పులు కనిపించవచ్చు. తర్వాతి నెలల్లో దగ్గు, శ్వాస సమస్యలు తగ్గవచ్చు. అయితే ఇప్పటికే జరిగిన నష్టం ఎంత ఉందనే దానిపై కోలుకునే ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఎంఫిసీమా వంటి సమస్యల వల్ల జరిగిన నష్టం పూర్తిగా తిరగకపోవచ్చు.
Also Read: విదుర నీతి.. ఈ 4 చోట్ల డబ్బు ఖర్చు చేస్తే సంపద మొత్తం హరించుకుపోతుంది
ధూమపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ఇతరులు తాగే సిగరెట్ పొగను కూడా పీల్చకూడదు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట వ్యాయామం చేయకుండా ఉండాలి. అవసరమైనప్పుడు సరైన N95 మాస్క్ ధరించాలి. దీర్ఘకాలంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్యులను సంప్రదించాలి.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధూమపానం మానేయడం తీసుకునే అత్యంత ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి.