Bone Strength Tips: మనం ఎప్పుడూ మన ఆరోగ్యం గురించే ఆలోచిస్తాం కానీ, లోపల మన ఎముకలు ఎంత బలంగా ఉన్నాయనే దానిపై పెద్దగా దృష్టి పెట్టం. పైకి ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ.. మన ఎముకలు లోలోపల బలహీనపడుతుంటాయి. దీనికి పెద్దగా ఎలాంటి లక్షణాలు కూడా కనిపించవు. అందుకే దీన్ని సైలెంట్ డిసీజ్ అంటుంటారు. ఏదైనా చిన్న దెబ్బ తగిలి, ఎముక విరిగినప్పుడే అసలు విషయం బయటపడుతుంది. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఎముకలను ఎలా గుల్ల చేస్తాయో చూద్దాం.
మన ఎముకలు గట్టిగా ఉండాలంటే క్యాల్షియం, విటమిన్ డి చాలా ముఖ్యం. కానీ మనం తినే తిండిలో వీటి మోతాదు తక్కువైపోతుంటుంది. కేలరీల కోసం ఏదో ఒకటి తినడం కాకుండా, పాలు, ఆకుకూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ఎండ తగలకుండా ఇంట్లోనే ఉండటం వల్ల విటమిన్ డి అందక ఎముకలు వీక్ అవుతాయి. ముఖ్యంగా బరువు తగ్గే పేరుతో కఠినమైన డైట్‌లు చేయడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అందక ఎముకలు గుల్లబారిపోతాయి.
Also Read: టమాటాలను ఉప్పునీటితో కడితే పురుగుమందులు పోతాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఇది అందరూ చేసే కామన్ తప్పు. ఆఫీసుల్లో కుర్చీలకే అతుక్కుపోయి గంటల తరబడి అలాగే కూర్చుంటున్నాం. ఒంటికి శ్రమ లేకపోతే ఎముకలు, కండరాలు కూడా బలహీనపడతాయి. కొంచెం నడక, చిన్నపాటి వ్యాయామాలు లేకపోతే ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. అప్పుడప్పుడు లేచి కాస్త నడవటం చాలా ముఖ్యం.
ధూమపానం, మద్యం సేవించే అలవాట్లు నేరుగా ఎముకల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సిగరెట్ తాగడం వల్ల ఎముకలకు అందే రక్తం తగ్గి అవి త్వరగా విరిగేలా తయారవుతాయి. అలాగే మద్యం ఎక్కువగా తాగితే బ్యాలెన్స్ తప్పుతుంది. దీనివల్ల కిందపడిపోయే ప్రమాదం ఎక్కువ. చిన్న వయసులోనే ఈ అలవాట్లకు బానిస అయితే భవిష్యత్తులో నడవడం కూడా కష్టమవుతుంది.
ఎముకలు అరిగిపోతున్నప్పుడు ఎలాంటి నొప్పులు వెంటనే రాకపోవచ్చు. మనకు ఎలాంటి సమస్య లేదు కదా అని నిర్లక్ష్యంగా ఉంటే చివరికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకల బలం తగ్గుతుంది. అందుకే అజాగ్రత్తగా ఉండకుండా సరైన వ్యాయామం చేస్తూ.. మంచి ఆహారం తీసుకుంటూ ఎముకలను కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది. సమస్య వచ్చే వరకు ఆగకుండా ఇప్పట్నుంచే జాగ్రత్త పడదాం.
Also Read: దీపావళికి ముందే ఈ 5 పనులు చేసేయండి.. పండగ రోజు అస్సలు టెన్షన్ ఉండదు!