Resting Heart Trend| ఒకప్పుడు డేటింగ్ యాప్స్‌లో ఆకర్షణీయమైన ఫొటోలు, సిక్స్ ప్యాక్, స్టైలిష్ లుక్ ఉంటే చాలు అనుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. అందంతోపాటు ఆరోగ్యం, ఫిట్‌నెస్, జీవనశైలికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరైతే తమ డేటింగ్ ప్రొఫైల్‌లో గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో కూడా వెల్లడిస్తున్నారు. అసలు ఈ రెస్టింగ్ హార్ట్ రేట్‌కు డేటింగ్‌కు సంబంధం ఏమిటి? మీ పార్ట్‌నర్‌ని ఎంచుకోవడంలో ఇది ఎలా ఉపయోగపడుతుంది? తెలుసుకుందాం.
డేటింగ్ ప్రపంచంలో ఇప్పుడు శారీరక అందానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఫిట్‌నెస్, ఒకరి అభిరుచులను మరొకరు అర్థం చేసుకోవడం కూడా ముఖ్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టే Ateam అనే డేటింగ్, సోషల్ యాప్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందులో కొందరు తమ రెస్టింగ్ హార్ట్ రేట్ వివరాలను ప్రొఫైల్‌లో చూపిస్తున్నారు.
రెస్టింగ్ హార్ట్ రేట్ అంటే విశ్రాంతిగా ఉన్నప్పుడు ఒక నిమిషంలో గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో తెలిపే కొలమానం. సాధారణంగా నిమిషానికి 60 కంటే తక్కువ సార్లు గుండె కొట్టుకుంటే దాన్ని తక్కువ హార్ట్ రేట్‌గా పరిగణిస్తారు. అయితే, ఈ స్థితి ప్రతి ఒక్కరిలో అనారోగ్యానికి సంకేతం కాదు.
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. ఆరోగ్యంగా ఉండే కొందరు వ్యక్తుల్లో, ముఖ్యంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అథ్లెట్లలో, తక్కువ రెస్టింగ్ హార్ట్ రేట్ కనిపించవచ్చు. వ్యాయామంతో గుండె కండరాలు బలపడతాయి. ఫలితంగా ప్రతి స్పందనతో ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలుగుతుంది.
అందువల్ల విశ్రాంతి సమయంలో గుండె తక్కువసార్లు కొట్టుకోవచ్చు. అయితే వయసు, మందులు, ఆరోగ్య సమస్యలు, ఫిట్‌నెస్ లెవెల్ వంటి అంశాలు కూడా హార్ట్ రేట్‌పై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా, తక్కువ హార్ట్ రేట్‌ను మానసిక స్థిరత్వానికి నేరుగా కొలమానంగా చూడకూడదు.
Also Read: మేధావి బాలుడు.. 5 ఏళ్ల వయసులో 3,000 పుస్తకాలు చదివి రికార్డ్.. ఎలా సాధ్యమైందంటే?
జిమ్‌కు వెళ్లడం, రన్నింగ్, రోజూ వ్యాయామం చేయడం ఇష్టపడేవారు తమ అభిరుచులను షేర్ చేసుకునే పార్ట్‌నర్‌ని కోరుకుంటారు. ఇలాంటి వ్యక్తుల కోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్ డేటింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
డేట్ ఫిట్, ఫిటాఫి, లెగ్ డే, సర్ఫ్, Ateam, ఫిట్‌నెస్ సింగిల్స్ వంటి యాప్స్ శారీరక చురుకుదనాన్ని ఇష్టపడే వ్యక్తులను కలుపుతున్నాయి. ఒకే రకమైన వ్యాయామ అలవాట్లు ఉన్నవారు తమ జీవనశైలిని సులభంగా అర్థం చేసుకోగలరని కొందరు భావిస్తారు. అయితే, విజయవంతమైన సంబంధానికి ఇద్దరి ఫిట్‌నెస్ లెవెల్స్ ఒకేలా ఉండాల్సిన అవసరం లేదు.
Also Read: మీ తప్పు లేకపోయినా సారీ చెబుతున్నారా.. ప్రతి విషయంలో మీరే తగ్గితే వచ్చే సమస్యలు ఇవే
కరోనా మహమ్మారి సమయంలో కొన్ని ప్రముఖ డేటింగ్ ప్లాట్‌ఫామ్‌లు వ్యాక్సినేషన్ స్టేటస్‌ని తెలియజేసే బ్యాడ్జ్‌లు, ఫీచర్లను ప్రవేశపెట్టాయి. దీనివల్ల వ్యక్తిగత ఆరోగ్య నిర్ణయాలు కూడా భాగస్వామిని ఎంచుకోవడంలో ప్రాధాన్యం పొందాయి.
ఇప్పుడు ఫిట్‌నెస్ అలవాట్లు, వ్యాయామ పద్ధతులు, హార్ట్ రేట్ వంటి వివరాలు కూడా చర్చకు వస్తున్నాయి. అయితే, ఒక్క ఆరోగ్య కొలమానం ఆధారంగా వ్యక్తి స్వభావాన్ని లేదా మానసిక పరిపక్వతను అంచనా వేయలేం.
మొత్తానికి, డేటింగ్‌లో ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. అయినప్పటికీ, బలమైన సంబంధానికి నమ్మకం, పరస్పర గౌరవం, మంచి సంభాషణ, మానసిక అవగాహన ఎంతో అవసరం.