చేపలతో చేసే వంటకాలు ఏవైనా చాలా రుచిగా ఉంటాయి. అందులోనూ పెప్పర్ ఫిష్ ఫ్రై మరింత రుచిగా ఉంటుంది. దీన్ని మిరియాల పొడి వేసి చేస్తాము. కాబట్టి దాని ఘాటు, సువాసన వల్ల ఈ ఫ్రై తినడానికి చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా సింపుల్ పదార్థాలతో పెప్పర్ ఫిష్ ఫ్రై రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో సులభంగా తెలసుకోండి.
పెప్పర్ ఫిష్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు – అర కిలో
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – ఒకటిన్నర స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
పసుపు – పావు స్పూను
కారం – ఒక స్పూన్
జీలకర్ర పొడి – అర స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
నూనె – వేయించడానికి సరిపడా
పెప్పర్ ఫిష్ ఫ్రై రెసిపీ
1. మొదట చేప ముక్కలను ఉప్పు, నీరు, పసుపు వేసి శుభ్రం చేయాలి. చేపపై నీరు ఎక్కువగా ఉంటే మసాలా బాగా పట్టదు. కాబట్టి చేపలు తడిలేకుండా చూసుకోండి.
2. ఇప్పుడు మసాలా ముద్ద రెడీ చేయాలి. ఒక పాత్రలో అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, మిరప పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం మందంగా పేస్ట్‌లా ఉండాలి.
3. పెప్పర్ ఫిష్ ఫ్రైలో అసలు రుచి మిరియాల నుంచే వస్తుంది. అందుకే మిరియాల పొడి కొంచెం ఎక్కువగా ఉపయోగిస్తే వంటకం చాలా రుచిగా ఉంటుంది.
4. ఇప్పుడు చేప ముక్కలపై ఈ పేస్ట్‌ను తీసుకుని బాగా రాయాలి. రెండు వైపులా సమంగా రాయాలి.
5. ఇలా మసాలా అద్ధిన తరువాత చేపను కనీసం 20 నుంచి 30 నిమిషాలు మారినేట్ అయ్యేలా ఉంచాలి.
6. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. మంటను మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలి.
7. నూనె వేడెక్కిన తర్వాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసి నెమ్మదిగా ఫ్రై చేయాలి.
8. చేప ముక్కలు గోధుమ రంగులోకి మారి క్రిస్పీగా కనిపిస్తే చేప రెడీ అయినట్టే.
9. చివరిలో కరివేపాకులు వేసి ఒక నిమిషం వేయిస్తే చాలు రుచి, సువాసన అదిరిపోతుంది.
10. ఫ్రై చేసిన చేపను పళ్లెంలోకి తీసి మీద కొద్దిగా మిరియాల పొడి చల్లుకోవాలి. ఇలా చేస్తే పెప్పర్ రుచి ఇంకా పెరుగుతుంది.
11. చేపతో పాటూ ఉల్లిపాయ, నిమ్మముక్కలు పెట్టుకుంటే ఇంకా బాగా ఉంటుంది.
ఈ చేప వేపుడును ఒక్కసారి తింటే మీకు నచ్చడం ఖాయం. దీనిలో మనం వాడేవి తక్కువ పదార్థాలే అయిన చాలా రుచిగా ఉంటుంది. మిరియాల పొడి ఆరోగ్యానికి మంచిది, జలుబు, దగ్గు వంటి సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది.చేపలో ప్రోటీన్, ఒమేగా-3 ఎక్కువగా ఉండడం వల్ల శరీరానికి బలం వస్తుంది. ఎక్కువ మసాలాలు అవసరం లేకుండా దీన్ని వండాము కాబట్టి పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.