Diwali History: దీపావళి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది రాముడు, అయోధ్య, దీపాల వెలుగులు! కానీ మన దేశంలో అందరూ దీపావళిని రాముడి కోసమే జరుపుకోరు. ఒకచోట నరకాసురుడి సంహారానికి జరుపుకుంటే.. మరోచోట మహావీరుడి నిర్వాణాన్ని గుర్తు చేసుకుంటారు. ఇంకోచోట 52 మంది రాజుల విడుదలను గుర్తు చేసుకుంటారు.మరి ఒకే పండుగకు ఇన్ని కథలు ఎలా వచ్చాయి? అసలు దీపావళి చరిత్ర ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి అనే పదానికి అర్థం తెలుసా..?
ముందుగా దీపావళి అనే పదానికి అర్థం తెలుసుకుందాం. దీపావళి అనే పదం సంస్కృతంలోని రెండు పదాల నుంచి వచ్చింది. దీప అంటే దీపం.. ఆవళి అంటే వరుస. అంటే దీపాల వరుస అని అర్థం.అయితే ఈ పండుగ ఎప్పుడు మొదలైంది? ఎవరు మొదలుపెట్టారు? అనే ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం లేదు.ఎందుకంటే దీపావళికి ఒకే ఒక్క ఆరంభం లేదు. కాలక్రమంలో వేర్వేరు ప్రాంతాల్లో, వేర్వేరు మతాల్లో భిన్నమైన సంప్రదాయాలు ఏర్పడ్డాయి.
రామాయణం ప్రకారం..
ముందుగా ఉత్తర భారతదేశం విషయానికి వస్తే..రామాయణం ప్రకారం.. 14 ఏళ్ల వనవాసం తర్వాత శ్రీరాముడు రావణుడిని సంహరించి సీతమ్మ, లక్ష్మణుడితో కలిసి అయోధ్యకు తిరిగి వస్తాడు.అప్పుడు తమ ప్రియమైన రాముడికి స్వాగతం పలుకుతూ అయోధ్య ప్రజలు నగరమంతా దీపాలు వెలిగించారని సంప్రదాయ కథనం చెబుతుంది.అందుకే ఉత్తర భారతదేశంలో దీపావళిని శ్రీరాముడి అయోధ్య రాకకు గుర్తుగా జరుపుకునే సంప్రదాయం బలంగా ఉంది.
దక్షిణ భారత్ దేశంలో దీపావళికి మరో కథ..
ఇక మన దక్షిణ భారతదేశానికి వస్తే.. ఇక్కడ దీపావళికి మరో కథ ఉంది. నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను, దేవతలను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడని పురాణాలు చెబుతాయి. అతడి బాధలు భరించలేక దేవతలు శ్రీకృష్ణుడిని ఆశ్రయిస్తారు. దీంతో శ్రీకృష్ణుడు, సత్యభామ కలిసి నరకాసురుడిని సంహరిస్తారు. ఆ రాక్షసుడి మరణంతో ప్రజలకు విముక్తి లభించిందని నరక చతుర్దశిని జరుపుకుంటారు. అందుకే దక్షిణ భారతదేశంలో తెల్లవారుజామునే నిద్రలేచి నూనె స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి దీపావళి జరుపుకునే సంప్రదాయం ఉంది.
పశ్చిమ బెంగాల్లో దీపావళి..
ఇక పశ్చిమ బెంగాల్‌కు వెళ్తే.. అక్కడ దీపావళి జరుపుకునే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. దీపావళి అమావాస్య రోజున అక్కడి ప్రజలు కాళీమాతను ప్రత్యేకంగా పూజిస్తారు. దీనినే కాళీ పూజ అంటారు. అంటే మన దగ్గర లక్ష్మీపూజకు ప్రాధాన్యత ఉంటే.. బెంగాల్లో కాళీ పూజకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
జైన మతం విషయానికి వస్తే..
ఇప్పుడు జైన మతం విషయానికి వస్తే.. వాళ్లకు దీపావళి మరింత ప్రత్యేకమైన రోజు.జైన మతంలోని 24వ తీర్థంకరుడు మహావీరుడు దీపావళి రోజునే పావాపురిలో నిర్వాణం పొందారని జైన సంప్రదాయం విశ్వసిస్తుంది.నిర్వాణం అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందడం. మహావీరుడి భౌతిక జీవితం ముగిసినప్పటికీ.. ఆయన అందించిన జ్ఞానం ఎప్పటికీ వెలుగులు పంచాలని దీపాలు వెలిగించే సంప్రదాయం ఉందని చెబుతారు.
సిక్కుల విషయానికి వస్తే..
ఇక సిక్కులకు కూడా దీపావళి సమయంలో ఒక ప్రత్యేకమైన పండుగ ఉంటుంది. అదే బందీ ఛోర్ దివస్. సిక్కుల ఆరవ గురువు గురు హర్గోబింద్ సింగ్‌ను గ్వాలియర్ కోటలో నిర్బంధించారు. ఆయన విడుదలైన సమయంలో తనతో పాటు నిర్బంధంలో ఉన్న 52 మంది రాజులను కూడా విడిపించారని సిక్కు సంప్రదాయం చెబుతుంది. ఈ సంఘటనకు గుర్తుగా బందీ ఛోర్ దివస్ జరుపుకుంటారు. అందుకే దీపావళి సమయంలో అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దీపాలతో అందంగా అలంకరిస్తారు.
చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయి..
ఇప్పటివరకు మనం మతపరమైన కథలు తెలుసుకున్నాం. మరి చారిత్రక ఆధారాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. దీపావళి గురించి శతాబ్దాల క్రితమే వివిధ రచనల్లో ప్రస్తావనలు కనిపిస్తాయి. పురాతన సంస్కృత గ్రంథాల్లో దీపాల పండుగలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి.11వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన అల్బెరూనీ తన రచనల్లో దీపావళి గురించి వివరించారు.కన్నడ శాసనాల్లో కూడా దీపావళి ప్రస్తావనలు కనిపిస్తాయి. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలానికి చెందిన ఐన్-ఇ-అక్బరీలో కూడా దీపావళి వేడుకల గురించి ప్రస్తావించారు.అంటే దీపావళి సంప్రదాయం చాలా శతాబ్దాలుగా భారతదేశంలో కొనసాగుతోందని చారిత్రక రచనలు తెలియజేస్తున్నాయి. అయితే దీపావళి మొదలైన ఖచ్చితమైన సంవత్సరం మాత్రం నిర్ధారించబడలేదు.
దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తాం..
ఇక మనం దీపావళి రోజు లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తామో చూద్దాం. లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యం, శుభానికి ప్రతీకగా భావిస్తారు.వ్యాపారులు ఈ రోజును కొత్త ఆర్థిక సంవత్సరానికి లేదా కొత్త లెక్కల ప్రారంభానికి శుభసూచకంగా భావించే సంప్రదాయాలు కూడా ఉన్నాయి. అందుకే చాలామంది ఇళ్లలోనే కాకుండా వ్యాపార సంస్థల్లో కూడా లక్ష్మీపూజ నిర్వహిస్తారు.ఇలా చూస్తే దీపావళి అంటే కేవలం ఒక కథ కాదు.. ఒక మతానికి మాత్రమే పరిమితమైన పండుగ కూడా కాదు. ఉత్తర భారతదేశంలో రాముడి రాక.. దక్షిణ భారతదేశంలో నరకాసురుడి సంహారం.. జైనులకు మహావీరుడి నిర్వాణం.. సిక్కులకు బందీ ఛోర్ దివస్.. కథలు వేరైనా.. సంప్రదాయాలు వేరైనా.. ప్రతి ఒక్కరూ ఈ పండుగను వెలుగుకు, మంచి మార్పుకు ప్రతీకగా జరుపుకుంటున్నారు. అందుకే దీపావళి కేవలం దీపాల పండుగ కాదు.. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపించే భారతీయ సంస్కృతికి ఒక ఉదాహరణ.
Also Read: ఉద్యోగం పేరుతో దగా.. ఉక్రెయిన్ యుద్ధానికి కూలి సైనికులుగా 259 మంది భారతీయులు!