ప్రతి తల్లిదండ్రులు తమ కుమార్తె ఆత్మవిశ్వాసంతో, తెలివిగా, స్వతంత్రంగా ఎదగాలని కోరుకుంటారు. మంచి చదువు ఎంత ముఖ్యమో, జీవితానికి అవసరమైన విలువలను నేర్పించడం కూడా అంతే ముఖ్యం.
చిన్నప్పటి నుంచి నేర్చుకున్న మంచి అలవాట్లు, జీవిత పాఠాలు భవిష్యత్తులో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయి. ముఖ్యంగా యుక్తవయస్సులో కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలియజేయాలి.
ప్రతి ఒక్కరూ తమను మెచ్చుకోవాలని చాలామంది పిల్లలు కోరుకుంటారు. కానీ నిజ జీవితంలో అది సాధ్యం కాదని కుమార్తెలకు చెప్పాలి. కొంతమంది వారి ప్రతిభను ప్రశంసిస్తారు. మరికొందరు కారణం లేకుండా విమర్శించవచ్చు. ఇతరుల అభిప్రాయాలతో తమ విలువను కొలవకూడదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.
తమ సామర్థ్యాన్ని నమ్ముకోవడం, కష్టపడి పనిచేయడం ముఖ్యమని నేర్పించాలి. ఆత్మవిశ్వాసం బయట నుంచి కాకుండా మనలో నుంచే రావాలని వారికి తెలియజేయాలి.
ప్రతి అమ్మాయి తన భద్రత, గౌరవం గురించి అవగాహన కలిగి ఉండాలి. ఎవరైనా వ్యక్తి, ప్రదేశం లేదా పరిస్థితి అసౌకర్యంగా అనిపిస్తే ధైర్యంగా “కాదు” అని చెప్పగలగాలి. తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఎవరికీ అధికారం లేదనే విషయం అర్థమయ్యేట్లు చెప్పాలి. తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం బలహీనత కాదు, ఆత్మవిశ్వాసానికి గుర్తు అని తెలియజేయాలి.
ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణాన్ని కల్పిస్తే వారు తమ భావాలను నిర్భయంగా వ్యక్తపరచడం నేర్చుకుంటారు.
జీవితంలో అత్యంత ముఖ్యమైనది ప్రతి వ్యక్తి తనను తాను నమ్మడం. అందుకే అమ్మాయిలు తమ బలాలను గుర్తించి వాటిపై నమ్మకం పెంచుకోవాలి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ప్రతి వ్యక్తిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని వారికి చెప్పాలి.
పరిపూర్ణత కోసం కాకుండా, ప్రతి చిన్న పురోగతిని కూడా ఆనందంగా స్వీకరించడం అలవాటు చేయాలి. సానుకూల ఆలోచనలు ఒత్తిడిని తగ్గించి ధైర్యాన్ని పెంచుతాయి.
Also Read: ఖర్చు లేకుండానే డేటింగ్ చేయాలా? తక్కువ బడ్జెట్‌లో ఇలా ప్లాన్ చేయండి
పిల్లలు తల్లిదండ్రులను చూసే చాలా విషయాలు నేర్చుకుంటారు. అందువల్ల వారి పిల్లలు చేసే ప్రయత్నాలను మెచ్చుకోవాలి. విజయాన్ని మాత్రమే కాకుండా కృషిని కూడా ప్రశంసించాలి.
చిన్న చిన్న సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే అవకాశాన్ని ఇవ్వాలి. దీంతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. దయ, నిజాయితీ, గౌరవం వంటి విలువలను కూడా నేర్పించడం చాలా అవసరం.
తల్లిదండ్రులు నేర్పే చిన్న చిన్న జీవిత పాఠాలు కుమార్తెలను మానసికంగా బలంగా తయారు చేస్తాయి. ఆత్మవిశ్వాసం, స్వీయ గౌరవం, సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం జీవితంలో ప్రతి దశలో వారికి ఉపయోగపడతాయి.