Rebecca Syndrome: భార్యాభర్తలు ఇద్దరూ ఎదుటివారి లోపాలను, కష్టాలను, ఇబ్బందులను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. కానీ కొంతమంది లేనిపోని అవమానాలు, అనుమానాలు, ఆలోచనలతో జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. అలా ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య సమస్యగా మారిన ఒక కొత్త అంశం… రెబెక్కా సిండ్రోమ్.
రెబెక్కా సిండ్రోమ్ అంటే ఏమిటి?
దీన్ని రెట్రోయాక్టివ్ జెలసీ అని కూడా పిలుస్తారు. సోషల్ మీడియా వల్ల ఆధునిక డేటింగ్ యుగంలో పుట్టుకొచ్చిన కొత్త సమస్య ఇది. అసూయకు దీన్ని కొత్త రూపంగా చెప్పుకోవచ్చు. తమ జీవిత భాగస్వామి గత అనుబంధాల గురించి వారి మాజీ ప్రేయసి లేదా ప్రియులతో పోల్చుకుంటూ అసూయ పడుతూ తమలో తామే నలిగిపోయే సమస్య రెబెక్కా సిండ్రోమ్. ప్రేమ జీవితంలోనే కాదు బెడ్ రూమ్‌లో లైంగిక జీవితంలో కూడా వారి మాజీ ప్రేయసి లేదా ప్రేమికులతో ఎలా ఉన్నారో అని ఆలోచిస్తూ తమ జీవితంతో పాటు తమ భాగస్వామి జీవితాన్ని కూడా ఇబ్బందుల పాలు చేసే భావోద్వేగమే రెబెక్కా సిండ్రోమ్.
ఈ పేరు ఎలా వచ్చింది?
రెబెక్కా సిండ్రోమ్ అనేది ఒక వ్యక్తి తన భాగస్వామి గత జీవితంలో ఉన్న శృంగార సంబంధాలను తలుచుకొని అసూయపడే సమస్య ఇది. రెబెక్కా అనేది ఒక ఇంగ్లీష్ నవల నుండి ఉద్భవించిన పేరు. ఆ నవలలో ఒక మహిళ పెళ్లి చేసుకుంటుంది. ఆమెకు అది మొదటి పెళ్లి కానీ ఆమె భర్తకు మాత్రం అది రెండో పెళ్లి. ఆ భర్త మొదటి భార్య పేరు రెబెక్కా. ఆమె మరణిస్తుంది. ఆమె మరణించినా కూడా రెబెక్కా జ్ఞాపకాలతోనే ఈ రెండో భార్య సతమతమవుతూ ఉంటుంది. రెబెక్కా సజీవంగా లేనప్పటికీ ఆ మహిళ… ఆమెతో తన భర్త ఎంతో సంతోషంగా ఉన్నట్టు భావిస్తూ అసూయతో రగిలిపోతూ ఉంటుంది. అందుకే ఇలా ప్రవర్తించే వారికి రెబెక్కా సిండ్రోమ్ ఉందని చెప్పడం మొదలుపెట్టారు.
రెబెక్కా సిండ్రోమ్ లక్షణాలు అందరికీ కొత్త కావు. ఒక ఇంట్లో తల్లిదండ్రులకు ఇద్దరు బిడ్డలు ఉంటారు. అందులో పెద్ద బిడ్డ ఎప్పుడూ చిన్న బిడ్డను ఎక్కువ చూస్తున్నారని భావిస్తూ ఉంటుంది. ఇది కూడా అసూయ. అలాంటిదే రెబెక్కా సిండ్రోమ్ కూడా. ఇది వస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం ప్రభావితం అవుతుంది. భార్య లేదా భర్త అభద్రతతో జీవిస్తూ ఉంటారు. వారి ప్రవర్తన కూడా మారిపోతుంది. భాగస్వామి గతం గురించి అనేక అనుమానాలను కలిగి ఉంటారు. ఏదో ఒకటి అంటూ ఉంటారు. మాజీ ప్రియుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని నీరసపడేలా చేస్తుంది.
నిజానికి 2017 లో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం రెబెక్కా సిండ్రోమ్ తో బాధపడుతున్న పురుషులు 79 శాతం మంది ఉన్నారని తేలింది. అలాగే మహిళలు 66 శాతం మంది ఉన్నట్టు బయటపడింది. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణం ఒత్తిడే. భార్యాభర్తలు ప్రేమ జీవితాన్ని అందంగా గడిపితే వారి మధ్య ఎలాంటి సిండ్రోమ్‌లు రావు.