Bathroom Cleaning Tips: ఇంట్లో ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రదేశాల్లో బాత్రూమ్ చాలా ముఖ్యమైనది. నిరంతరం వాడటం, తేమ ఎక్కువగా ఉండటం వల్ల బాత్రూమ్‌లో మురికి, సబ్బు మరకలు, బ్యాక్టీరియా, దుర్వాసన త్వరగా చేరుతాయి. వీటిని వదిలించుకోవడానికి చాలామంది రకరకాల ఖరీదైన కెమికల్ క్లీనర్లు కొంటూ ఉంటారు. కానీ మన ఇంట్లోనే దొరికే ఒకే ఒక్క సింపుల్ వస్తువుతో బాత్రూమ్ మొత్తాన్ని తక్కువ ఖర్చుతో, ఎలాంటి ఘాటు వాసన లేకుండా కొత్తదానిలా మార్చవచ్చు. ఆ అద్భుతమైన వస్తువే హైడ్రోజన్ పెరాక్సైడ్.
హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో తయారయ్యే ఈ ద్రవం ఉపరితలంపై పడినప్పుడు ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది మొండి మరకలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా.. బాత్రూమ్‌లోని బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ను పూర్తిగా నాశనం చేస్తుంది. బ్లీచ్ లాగా దీనివల్ల ఘాటైన వాసన రాదు. పైగా ఇది నీరు, ఆక్సిజన్‌గా విడిపోతుంది కాబట్టి.. పర్యావరణానికి, మన ఆరోగ్యానికి చాలా సురక్షితం.
రోజువారీ క్లీనింగ్ కోసం 3 శాతం హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటిని సమాన భాగాలుగా కలిపి ఒక ముదురు రంగు స్ప్రే బాటిల్‌లో పోయాలి. వెలుతురు తగిలితే దీని శక్తి తగ్గుతుంది కాబట్టి.. డార్క్ బాటిల్ వాడటం మంచిది. ఈ మిశ్రమాన్ని సింక్‌లు, ట్యాప్‌లు, షవర్ డోర్లపై స్ప్రే చేసి ఐదు నిమిషాలు వదిలేసి, ఆ తర్వాత తడి గుడ్డతో తుడిచేయాలి. మరీ ఎక్కువ మురికి ఉంటే నీరు కలపకుండా నేరుగా స్ప్రే చేసి పది నిమిషాల తర్వాత బ్రష్‌తో రుద్ది కడగాలి.
Also Read: ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
బాత్రూమ్ మూలల్లో, టైల్స్ అంచుల్లో పేరుకుపోయిన మొండి పసుపు మరకలను వదిలించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడాను సమాన భాగాలుగా కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను మరకలపై రాసి అరగంట పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత బ్రష్‌తో రుద్ది నీటితో కడిగితే మరకలు మాయమవుతాయి.
టైల్స్ మధ్య ఉండే గీతలలో మురికి ఎక్కువగా చేరుతుంది. తేలికపాటి మరకల కోసం హైడ్రోజన్ పెరాక్సైడ్, నీటి మిశ్రమాన్ని స్ప్రే చేసి 5 నిమిషాల తర్వాత చిన్న బ్రష్‌తో రుద్దాలి. లోతైన మరకలకు బేకింగ్ సోడా పేస్ట్ వాడటం ఉత్తమం. అలాగే టాయిలెట్ బౌల్‌లో ఒక కప్పు హైడ్రోజన్ పెరాక్సైడ్ పోసి అరగంట తర్వాత బ్రష్‌తో రుద్ది ఫ్లష్ చేస్తే క్రిములు నశించి టాయిలెట్ తెల్లగా, శుభ్రంగా మారుతుంది.
Also Read: పాతికేళ్లకే నలభై ఏళ్ల వారిలా కనిపిస్తున్నారా? మగాళ్లు చేసే ఈ 5 తప్పులే కొంపముంచుతున్నాయి!