Chicken Malai Kebab: ఆదివారం వచ్చిందంటే చాలు ఏదో ఒక నాన్‌వెజ్ స్పెషల్ ఉండాల్సిందే. సాధారణంగా చేసే చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ రోజూ తినేదే కదా.. ఈసారి కాస్త కొత్తగా, రెస్టారెంట్ లెవెల్ రుచితో ఇంట్లోనే ‘చికెన్ మలయ్ కబాబ్’ ట్రై చేస్తే ఎలా ఉంటుంది? వినడానికే నోరూరుతోంది కదూ! నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయేంత మెత్తగా, క్రీమీగా ఉండే ఈ కబాబ్స్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ బాగా నచ్చుతాయి.
సాధారణంగా కబాబ్స్ చేయాలంటే తందూరు ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ మన ఇంట్లో ఉండే సాధారణ పెనం లేదా పాన్ పైనే చాలా సులువుగా, తక్కువ సమయంలోనే ఈ టేస్టీ డిష్‌ను సిద్ధం చేసుకోవచ్చు. సాయంత్రం పూట స్నాక్‌గా లేదా వీకెండ్ స్పెషల్ స్టార్టర్‌గా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. మరి ఆలస్యం దేనికి.. ఈ సీక్రెట్ రెసిపీ తయారీకి ఏమేం కావాలో, ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి..
బోన్‌లెస్ చికెన్ ముక్కలు – అరకిలో
చిక్కటి గడ్డ పెరుగు – అర కప్పు
ఫ్రెష్ క్రీమ్ లేదా మీగడ – పావు కప్పు
జీడిపప్పు పప్పులు – పది
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టీస్పూన్
Also Read: ఈ ఒక్క కర్రీ ఉంటే చాలు.. ఎన్ని రోటీలైనా క్షణాల్లో ఖాళీ అయిపోవాల్సిందే!
మిరియాల పొడి – ఒక టీస్పూన్
గరం మసాలా పొడి – అర టీస్పూన్
కస్తూరి మేథీ – ఒక టీస్పూన్
నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్
వెన్న లేదా నూనె – మూడు టేబుల్ స్పూన్లు
రుచికి సరిపడా ఉప్పు – తగినంత
ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి నీరు ఏమీ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్‌లో జీడిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో గడ్డ పెరుగు, ఫ్రెష్ క్రీమ్, రుబ్బిన జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, మిరియాల పొడి, గరం మసాలా, నిమ్మరసం, కస్తూరి మేథీ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
ఈ మసాలా మిశ్రమంలో చికెన్ ముక్కలను వేసి, ప్రతి ముక్కకు మసాలా బాగా పట్టేలా కలపాలి. ఈ మిశ్రమాన్ని కనీసం రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో నానబెట్టాలి. చికెన్ ఎంత ఎక్కువ సేపు నానితే కబాబ్స్ అంత మెత్తగా, రుచిగా వస్తాయి.
తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్ల వెన్న లేదా నూనె వేసి వేడి చేయాలి. నానిన చికెన్ ముక్కలను వుడెన్ స్టిక్స్‌కి గుచ్చి లేదా నేరుగా పాన్ మీద ఒక్కొక్కటిగా పరచాలి. చిన్న మంట మీద తిప్పుతూ అన్ని వైపులా దోరగా కాల్చుకోవాలి. చికెన్ మంచి రంగు వచ్చి, మెత్తగా ఉడికే వరకు వేయించి దింపేసుకుంటే నోరూరించే చికెన్ మలయ్ కబాబ్ సిద్ధమైనట్లే. దీనిపై కాస్త నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలతో వేడిగా సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Also Read: చేపలు లేవు.. అయినా ఈ రెసిపీ పేరు బొమ్మిడాల చారు.. రాయలసీమ సీక్రెట్ రెసిపీ ఇదే!