Chicken Patiala Recipe: రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు చాలామంది చికెన్ కర్రీ లేదా బటర్ చికెన్ ఆర్డర్ చేస్తుంటారు. కానీ ఈసారి కాస్త డిఫరెంట్‌గా, పంజాబీ దాబాల్లో దొరికే ‘చికెన్ పటియాలా’ ఇంట్లోనే ట్రై చేసి చూడండి. ఈ డిష్ ప్రత్యేకత ఏంటంటే.. ముక్కలకు పట్టించిన కారకారంగా ఉండే మసాలా గుజ్జు ఒకెత్తయితే, దానిపైన వేసే ఆమ్లెట్ కవరింగ్ ఇంకొకెత్తు. అవును.. గుడ్డు, చికెన్ కలయికతో నోరూరించేలా ఉండే ఈ వంటకం ఒక్కసారి తిన్నారంటే ఆ ఇంటి ఇల్లాలి చేతి వంటకి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. వేడి వేడి రోటీలు, నాన్ లేదా బటర్ రోటీలోకి ఈ కర్రీ అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. రాయల్ రుచితో ఉండే ఈ పంజాబీ స్పెషల్ చికెన్ పటియాలాను సులభంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా..
చికెన్ – అర కిలో
పెరుగు – అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు చెంచాలు
పసుపు – ముప్పావు చెంచా
కారం – రెండు చెంచాలు
ధనియాల పొడి – ఒక చెంచా
జీలకర్ర పొడి – అర చెంచా
గరం మసాలా – ఒక చెంచా
నూనె – నాలుగు చెంచాలు
నెయ్యి – రెండు చెంచాలు
Also Read: చేపలు లేవు.. అయినా ఈ రెసిపీ పేరు బొమ్మిడాల చారు.. రాయలసీమ సీక్రెట్ రెసిపీ ఇదే!
గుడ్లు – రెండు
ఉల్లిపాయలు – మూడు (సన్నగా తరిగినవి)
టమోటాలు – రెండు (ప్యూరీలా చేసుకున్నవి)
పచ్చిమిర్చి – నాలుగు (నిలువుగా కోసినవి)
కాప్సికం – ఒకటి (ముక్కలుగా కోసినది)
జీడిపప్పు పేస్ట్ – రెండు చెంచాలు
ఫ్రెష్ క్రీమ్ – రెండు చెంచాలు
కసూరీ మేథి – ఒక చెంచా
కొత్తిమీర తరుగు – గుప్పెడు
ఉప్పు – రుచికి సరిపడా
మీకు కావాల్సినంత చికెన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి అర గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మారినేట్ చేసిన చికెన్‌ను అందులో వేసి మూతపెట్టి, చికెన్ మెత్తగా ఉడికి దగ్గరపడే వరకు వేయించి ఒక పాత్రలోకి తీసుకోవాలి.
అదే బాణలిలో నెయ్యి వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమోటో ప్యూరీ వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఆ తర్వాత కాప్సికం ముక్కలు, మిగిలిన గరం మసాలా, జీడిపప్పు పేస్ట్ వేసి తక్కువ మంటపై రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు అందులో ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు, కాసిన్ని నీళ్లు పోసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్, నలిపిన కసూరీ మేథి, కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి.
మరోవైపు ఒక చిన్న గిన్నెలో గుడ్లు, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పెనంపై కొద్దిగా నూనె వేసి పల్చటి ఆమ్లెట్‌లా వేసుకోవాలి. తయారైన చికెన్ గ్రేవీని ఈ ఆమ్లెట్ మధ్యలో పెట్టి రోల్ చేయవచ్చు లేదా గ్రేవీపైన ఈ ఆమ్లెట్ పొరను పరిచి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఘుమఘుమలాడే చికెన్ పటియాలా తినడానికి రెడీ అయినట్టే.
Also Read: ఉదయాన్నే పిల్లలకు ఈ టిఫిన్స్ తినిపిస్తే రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు!