Rayalaseema Bommidala Pulusu: వేడి వేడి అన్నంలోకి కాస్త ఘాటుగా, పుల్లపుల్లగా ఉండే చారు పడితే ఆ మజానే వేరు కదా. అందులోనూ రాయలసీమ వైపు ఎంతో ఇష్టంగా చేసుకునే ‘బొంబాయి బొమ్మిడాల చారు’ ఉంటే ఆ రోజు భోజనం రాయల్ అనాల్సిందే. పేరు వినడానికి కాస్త కొత్తగా ఉన్నా.. ఇది చాపల రసం కాదు. శనగపిండి, టమోటాలు, ఆవాల తిరగమాతతో ఎంతో రుచిగా, నోటికి కారంగా చేసుకునే ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకం. జలుబు చేసినప్పుడు లేదా నోరు బాగులేనప్పుడు వేడివేడిగా ఈ చారు చేసుకుని తాగితే ప్రాణం లేచొస్తుంది. బ్యాచిలర్స్ కూడా చాలా సులువుగా, తక్కువ సమయంలో దీనిని తయారుచేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ ఘుమఘుమలాడే చారు తయారీ విధానం ఏంటో చూద్దామా!
శనగపిండి – రెండు పెద్ద స్పూన్లు
టమోటాలు – మూడు (సన్నగా తరిగినవి)
ఉల్లిపాయ – ఒకటి (నిలువుగా కోసినది)
పచ్చిమిర్చి – నాలుగు (నిలువుగా చీల్చినవి)
చింతపండు రసం – అర కప్పు
పసుపు – అర స్పూన్
కారం – ఒక స్పూన్
Also Read: చికెన్‌లో చింతపండు వేస్తే ఇంత టేస్టీగా ఉంటుందా? తప్పక ట్రై చేయండి!
ధనియాల పొడి – ఒక స్పూన్
ఆవాలు – అర స్పూన్
జీలకర్ర – అర స్పూన్
మెంతులు – పావు స్పూన్
ఎండుమిర్చి – రెండు
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా (సన్నగా తరిగినది)
ఇంగువ – పావు స్పూన్
నూనె – రెండు పెద్ద స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
ఒక పాత్రలో శనగపిండి తీసుకుని, అందులో కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి తిరగమాత దోరగా వేయించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి.
ఉల్లిపాయలు వేగిన తర్వాత టమోటా ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు, పసుపు చేర్చి టమోటాలు గుజ్జులా అయ్యే వరకు మూత పెట్టి ఉడికించాలి. టమోటాలు బాగా మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు కలపాలి. ఇప్పుడు చింతపండు రసంతో పాటు, చారుకు సరిపడా (దాదాపు రెండు నుండి మూడు కప్పుల) నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐదు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి.
చారు బాగా మరుగుతున్నప్పుడు, ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని మళ్లీ ఒకసారి కలిపి, చారులో పోస్తూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. శనగపిండి నీళ్లు పోసిన తర్వాత చారు చిక్కబడటం ప్రారంభిస్తుంది. కాబట్టి.. మంటను చిన్నగా పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. శనగపిండి పచ్చివాసన పోయి, చారు మంచి సువాసన వచ్చే వరకు మరో 5 నుండి 7 నిమిషాలు సన్నని మంటపై మరగనివ్వాలి. చివరిగా రుచి చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకుని, పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని దించేయాలి. ఎంతో రుచికరమైన బొంబాయి బొమ్మిడాల చారు సిద్ధం.
Also Read: మటన్ చాప్స్ రోస్ట్ ఇలా చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు!