Garlic Butter Prawns: రొయ్యలతో ఏ డిష్ చేసినా దాని అద్భుతంగా ఉంటుంది. అందులోనూ వెల్లుల్లి, వెన్న కాంబినేషన్ జతైతే.. ఆ సువాసనకే కడుపు నిండిపోతుంది. సాధారణంగా సీఫుడ్ ప్రియులు రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఎక్కువగా ఆర్డర్ చేసే స్టాటర్స్‌లో ‘గార్లిక్ బటర్ ప్రాన్స్’ ఒకటి. బయట అంత ధర పెట్టి తినే ఈ క్రంచీ అండ్ టేస్టీ డిష్‌ను మన ఇంట్లోనే చాలా తక్కువ సమయంలో, ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. అకస్మాత్తుగా వచ్చే అతిథులకు లేదా సాయంత్రం పూట వేడివేడిగా ఏదైనా స్పెషల్ గా తినాలనిపించినప్పుడు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతీ ఒక్కరూ దీని రుచికి ఫిదా అవ్వాల్సిందే.
కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు – అర కేజీ (శుభ్రం చేసినవి), వెన్న – మూడు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – ఒక టీస్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – ఒక టీస్పూన్, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి సరిపడా.
Also Read: లైఫ్‌లో ఒక్కసారైనా ఈ చాక్లెట్ లావా కేక్ రుచి చూడాల్సిందే.. 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ఎలా తయారు చేయాలంటే?
శుభ్రం చేసిన రొయ్యలలో సరిపడా ఉప్పు, అర టీస్పూన్ మిరియాల పొడి, నిమ్మరసం చేర్చి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాణలి పెట్టి అందులో నూనె, ఒక టేబుల్ స్పూన్ వెన్న వేయాలి. వెన్న కరిగిన తర్వాత మసాలా పటించిన రొయ్యలను అందులో వేసి మీడియం మంటపై రెండు వైపులా రెండు నుండి మూడు నిమిషాల పాటు తేలికగా వేయించాలి. రొయ్యలు ఎక్కువగా వేగితే గట్టిగా మారతాయి కాబట్టి.. రంగు మారగానే వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి.
అదే బాణలిలో మిగిలిన వెన్న వేసి కరిగించాక, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి దోరగా వేయించాలి. వెల్లుల్లి మంచి సువాసన వస్తున్నప్పుడు అందులో మిగిలిన మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఒకసారి కలపాలి.
తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను ఈ మిశ్రమంలో వేసి వెన్న, వెల్లుల్లి ఫ్లేవర్లు రొయ్యలకు బాగా పట్టేలా రెండు నిమిషాలు తిప్పుతూ వేయించాలి.
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ అఫ్ చేసుకుంటే ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ ప్రాన్స్ సిద్ధమైనట్లే. దీనిని వేడివేడిగా స్నాక్‌లా లేదా రైస్, రోటీలతో నంజుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Also Read: పక్కా దాబా స్టైల్ కాశ్మీరి దమ్ ఆలూ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు!