Malayalam OTT Releases: మలయాళ సినిమాలంటేనే కంటెంట్‌కు పెట్టింది పేరు. భారీ హంగులు, అనవసరమైన కమర్షియల్ హంగామా లేకుండా కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు అక్కడి దర్శకనిర్మాతలు. అందుకే మలయాళంలో చిన్న సినిమాగా విడుదలైన కొన్ని చిత్రాలు కూడా ఓటీటీలోకి వచ్చాక దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి సినిమాల కోసం ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌కు ఈ వీకెండ్ మరో మంచి ఛాన్స్ వచ్చింది. ఏకంగా రెండు మలయాళ చిత్రాలు ఒకే రోజు డిజిటల్ స్క్రీన్స్‌పైకి రాబోతున్నాయి. అయితే ఈ రెండూ ఒకే జానర్‌కు చెందినవి కావు. ఒకటి దుల్కర్ సల్మాన్ నటించిన యాక్షన్, ఫాంటసీ థ్రిల్లర్ కాగా.. మరొకటి క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామా. నవంబర్ 6న వేర్వేరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ రెండు సినిమాల వివరాలేంటో తెలుసుకుందాం పదండి.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐయామ్ గేమ్’ (I’m Game). దర్శకుడు నహాస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్ ముందుకు వస్తోంది. నవంబర్ 6 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో దుల్కర్ డాన్ జాన్ అనే సంపన్న యువకుడి పాత్రలో కనిపిస్తాడు.
డబ్బు సంపాదించడం, లగ్జరీ లైఫ్ గడపడమే జీవితంగా భావించే డాన్ జాన్‌కు జూదం మీద కూడా విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా బెట్టింగ్ వ్యవహారాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటాడు. అయితే ఈ అలవాటే క్రమంగా అతడిని చిక్కుల్లోకి నెడుతుంది. ఒకవైపు డబ్బు సంపాదించాలనే ఆశ, మరోవైపు తీసుకున్న రిస్క్‌లు అతని జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతాయి. ఇంతలో ఎదురైన ఓ ప్రమాదం అతని ప్రపంచాన్నే మార్చేస్తుంది. ఆ తర్వాత డాన్ జాన్ జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు, వాటి నుంచి బయటపడటానికి అతను చేసే పోరాటమే ఈ సినిమా ప్రధాన కథాంశం.
కేవలం సాధారణ యాక్షన్ సీన్స్‌కే పరిమితం కాకుండా ఫాంటసీ, థ్రిల్లర్ అంశాలను కూడా ఇందులో జోడించారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ కొత్త తరహా పాత్రలో కనిపించడం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కయాదు లోహర్ (Kayadu Lohar), ఆంటోనీ వర్గీస్ (Antony Varghese), మిస్కిన్ (Mysskin), కతిర్ (Kathir), సంయుక్త విశ్వనాథన్ (Samyuktha Viswanathan), వినయ్ ఫోర్ట్ (Vinay Forrt), పార్థ్ తివారీ (Parth Tiwari) కీలక పాత్రలు పోషించారు. నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించగా, దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ Wayfarer Films బ్యానర్‌పై నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ చూడవచ్చు. నవంబర్ 6 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ కానుంది. యాక్షన్, ఫాంటసీ, థ్రిల్లర్ కలగలిపిన కథలను ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్.
ఇక రెండో సినిమా ‘ఐసీయూ’ (ICU). టైటిల్ చూడగానే ఇదేదో హాస్పిటల్, మెడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ అనిపించవచ్చు. కానీ ఇది అలాంటి సినిమా కాదు. ప్రేమ, వ్యక్తిగత సమస్యలు, స్థానిక క్రైమ్ ప్రపంచం చుట్టూ తిరిగే మలయాళ క్రైమ్ థ్రిల్లర్. జార్జ్ వర్గీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 6 నుంచి Sun NXTలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ కథలో ఉన్ని, ఇందు అనే ఇద్దరు ప్రేమికులు ఉంటారు. చాలాకాలంగా ప్రేమించుకుంటున్న వీరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు మొదలవుతాయి. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి బంధం క్రమంగా బలహీనపడుతుంది. దీంతో ఎలాగైనా తమ రిలేషన్‌ను మళ్లీ చక్కదిద్దుకోవాలని ఉన్ని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సలాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అయితే అతను సాధారణ వ్యక్తి కాదు. స్థానికంగా భయంకరమైన గూండాగా పేరున్న మైఖేల్ దగ్గర పనిచేస్తుంటాడు.
అక్కడి నుంచి ఉన్ని జీవితంలో అనుకోని సమస్యలు మొదలవుతాయి. తన ప్రేమను నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మొదలైన ప్రయత్నం అతడిని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టింది? సలాంతో ఏర్పడిన పరిచయం వల్ల మైఖేల్‌తో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఈ క్రైమ్ వ్యవహారంలో ఉన్ని ఎలా ఇరుక్కున్నాడు? అనే అంశాలతో సినిమా సాగుతుంది. ప్రేమకథగా మొదలై క్రమంగా క్రైమ్, సస్పెన్స్ వైపు మలుపు తిరిగే కథనం ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది.
బిబిన్ జార్జ్ (Bibin George) ఉన్ని పాత్రలో నటించగా, విస్మయ (Vismaya) ఇందుగా కనిపిస్తుంది. బాబురాజ్ (Baburaj) మైఖేల్ పాత్రలో, మురళీ గోపీ (Murali Gopy) ఫ్రాన్సిస్ పాత్రలో నటించారు. వినోద్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్ర పోషించారు. జార్జ్ వర్గీస్ దర్శకత్వం వహించగా, జైన్ పాల్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా నవంబర్ 6 నుంచి Sun NXTలో అందుబాటులోకి రానుంది.
Read Also: ఈ ఫ్రైడే ఓటీటీలో ఏకంగా 9 తెలుగు సినిమాలు, సిరీస్ లు… ఇవి మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు