PNR Number: భారతీయ రైల్వేలో ప్రయాణించే వారందరికీ ‘పీఎన్‌ఆర్’ (PNR) సంఖ్య సుపరిచితమే. రైలు టికెట్ బుక్ చేయగానే 10 అంకెలతో కూడిన ఈ నెంబర్ వెంటనే టికెట్‌పై ప్రత్యక్షమవుతుంది. అయితే ఈ 10 అంకెల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో, అది ఎలా పనిచేస్తుందో ఎప్పుడైనా గమనించారా? ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికుల వివరాలను ఎలాంటి గందరగోళం లేకుండా నిర్వహించడంలో ఈ పీఎన్ఆర్ వ్యవస్థ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
పీఎన్‌ఆర్ అంటే ‘పాసింజర్ నేమ్ రికార్డ్’ (Passenger Name Record) అని అర్ధం. భారతీయ రైల్వేలో రిజర్వేషన్ పొందిన ప్రతి టికెట్‌కు కేటాయించే 10 అంకెల విశిష్ట (యూనిక్) కోడ్ గా దీన్ని అభివర్ణిస్తారు. ప్రయాణికుల పేరు, వయస్సు, ప్రయాణ తేదీ, రైలు సంఖ్య, సీటు లేదా బర్త్ స్థితి (కన్ఫర్మ్‌డ్, RAC, వెయిటింగ్ లిస్ట్) వంటి అన్ని వివరాలు ఈ ఒక్క నంబర్‌లోనే భద్రపరచబడి ఉంటాయి. రైల్వే డేటాబేస్‌లో మీ టికెట్‌కు ఇది ఒక గుర్తింపు కార్డులా పనిచేస్తుంది.
ప్రపంచంలోనే అత్యధికమంది ప్రయాణికులను చేరవేసే వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. ఇక్కడ ప్రతిరోజూ లక్షలాది టికెట్లు బుక్ అవుతుంటాయి. 10 అంకెల కంటే తక్కువ ఉంటే అన్ని టికెట్లకు సరిపడా కొత్త నంబర్లు క్రియేట్ చేయడం కష్టమవుతుంది. అలా చేస్తే నంబర్లు పునరావృతమయ్యే (డూప్లికేషన్) ప్రమాదం ఉంటుంది. ఒకవేళ 10 అంకెల కంటే ఎక్కువ ఉంటే గుర్తుంచుకోవడం, నిర్వహించడం కష్టంగా మారుతుంది. అందుకే రైల్వే వ్యవస్థ విభిన్నమైన నంబర్ల కాంబినేషన్లను సులభంగా సృష్టించడానికి ఈ 10 అంకెల విధానాన్ని ఆచరణాత్మక పరిష్కారంగా ఎంచుకుంది.
మనం చూసే 10 అంకెల పీఎన్‌ఆర్ నంబర్ ఏదో యాదృచ్ఛికంగా (Random) కేటాయించింది కాదు. అందులోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. మొదటి 3 అంకెలు (జోన్ వివరాలు) ఆ టికెట్ ఏ రైల్వే జోన్ లేదా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కేంద్రంలో బుక్ అయిందో తెలియజేస్తాయి. తదుపరి 7 అంకెలు సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా తయారవుతాయి. ఒకేలాంటి నంబర్లు వేర్వేరు టికెట్లకు రాకుండా చూస్తూ ప్రతి ప్రయాణానికి పూర్తి విభిన్నతను ఇవి అందిస్తాయి.
Also Read: రైలులో విమానం రూల్.. ఈ తప్పు అస్సలు చేయెుద్దు.. లేదంటే టికెట్ ఉన్నా 6 రెట్లు ఫైన్ కట్టాల్సిందే!
రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా నడవటానికి ఈ 10 అంకెల విధానం దోహదపడుతోంది. దీని ద్వారా ప్రయాణ సమయానికి టికెట్ కన్ఫర్మ్ అయిందో లేదో సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఒకే నంబర్‌పై రెండు టికెట్లు రాకుండా ఇది నిరోధిస్తుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మెుత్తంగా పైకి కేవలం అంకెల సమాహారంగా కనిపించే ఈ 10 అంకెల పీఎన్‌ఆర్ నంబర్.. తెలివైన సాంకేతిక వ్యవస్థతో పనిచేస్తుందని చెప్పవచ్చు.
Also Read: కపుల్స్ కోసం Airtel బంపరాఫర్.. రూ.749కే అపరిమిత 5G డేటా.. ఓటీటీలు, 2 సిమ్ కార్డ్‌లు!