Body Language: మనం ఎవరినైనా మొదటిసారి కలిసినప్పుడు వారిని ఎలా అంచనా వేస్తాం? సాధారణంగా వారు ఇచ్చే షేక్ హ్యాండ్, మాట్లాడే విధానం లేదా ధరించే దుస్తులను బట్టి ఒక అభిప్రాయానికి వస్తాం. కానీ వీటన్నింటికంటే ముఖ్యమైనది మన శరీర భంగిమ. మనం నడిచే తీరు, నిలబడే పద్ధతి మాత్రమే కాదు.. కూర్చునే విధానం కూడా ఎదుటివారికి మన గురించి చాలా విషయాలు చెప్తుంది. బాడీ లాంగ్వేజ్ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం మనం కూర్చునే స్టైల్ మన ఆత్మవిశ్వాసాన్ని, మనసులోని ఆలోచనలను తెలియజేస్తుందట.
చాలామంది కుర్చీలో లేదా సోఫాలో కూర్చున్నప్పుడు ఒక కాలు మీద మరో కాలు వేసుకుంటారు. ఇలా కూర్చోవడం ప్రశాంతతకు, హుందాతనానికి ప్రతీకగా కనిపిస్తుంది. అలాగే సందర్భాన్ని బట్టి ఇదొక రక్షణ కవచంలా కూడా పనిచేస్తుంది. సమాజంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు కొద్దిగా దాపరికం లేదా స్వల్ప హెచ్చరికతో ఉన్నప్పుడు ప్రజలు సాధారణంగా ఈ తరహా పొజిషన్‌ను ఎంచుకుంటారు.
Also Read: ధనత్రయోదశి నాడు వీటిని ఇతరులకు ఇచ్చారో.. మీ ఇంట్లోని ఐశ్వర్యం తుడిచిపెట్టుకుపోతుంది!
పాదాల వద్ద కాళ్లను క్రాస్ చేసి కూర్చోవడం చాలా ప్రత్యేకమైన పద్ధతి. ఇది ఒక రకమైన శైలి, క్రమశిక్షణ, గంభీరతను సూచిస్తుంది. ఇలా కూర్చునేవారు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఆందోళన పడకుండా చాలా ప్రశాంతంగా, సంయమనంతో నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్నవారు ఎక్కువగా ఈ పొజిషన్‌లో కనిపిస్తారు.
ఒక కాలు పైన మరో కాలు మడతపెట్టి, మోకాలుపై యాంకిల్ వచ్చేలా కూర్చోవడాన్ని ఫిగర్ ఫోర్ అంటారు. ఈ విధానం పూర్తి ఆత్మవిశ్వాసానికి, స్వతంత్ర భావాలకు నిదర్శనం. ఇలా కూర్చునేవారు తమ భావాలను స్పష్టంగా వ్యక్తం చేస్తారు. ఆఫీసుల్లో లేదా స్నేహితుల మధ్య ఈ భంగిమలో కనిపించేవారు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటారు.
రెండు పాదాలను నేలపై సమానంగా పెట్టి కూర్చోవడం అత్యంత సాధారణమైన, సహజమైన పద్ధతి. ఇది వ్యక్తి యొక్క స్థిరత్వాన్ని, నిబద్ధతను తెలియజేస్తుంది. ఇలా కూర్చునేవారు ఎదుటివారు చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారు. పనిపై పూర్తి దృష్టి పెట్టడమే కాకుండా.. ఎల్లప్పుడూ నిజాయితీగా, అనుకూల దృక్పథంతో ఉండటానికి ఇష్టపడతారు.
Also Read: రోజూ తెల్లవారుజామున 3 గంటలకే మెలకువ వచ్చేస్తోందా? మీ శరీరం ఏం చెబుతోందంటే!