Kadai Paneer Masala: వారంతంలో ఇంటిల్లిపాదీ కలిసి ఏదైనా స్పెషల్‌గా తినాలనుకున్నప్పుడు లేదా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు అందరికీ ముందుగా గుర్తొచ్చే వెజ్ వంటకం పనీర్. అందులోనూ నోరూరించే సువాసనతో, కారం కారంగా ఉండే ‘కడాయి పనీర్ మసాలా’ రుచే వేరు. నాన్, రోటీ లేదా జీరా రైస్‌లోకి ఇది అద్భుతంగా ఉంటుంది. బయట రెస్టారెంట్లలో దొరికే అదే రుచితో, ఎలాంటి కృత్రిమ రంగులు వాడకుండా మన వంటింట్లో ఉండే మసాలాలతోనే దీనిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు, నోరూరించే కడాయి పనీర్ మసాలా తయారీకి ఏమేం కావాలో, ఎలా చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి..
పనీర్ ముక్కలు – 250 గ్రాములు
ఉల్లిపాయలు – రెండు (పెద్దవి)
టమోటాలు – మూడు
క్యాప్సికమ్ – ఒకటి
పచ్చిమిర్చి – నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్
ధనియాలు – ఒక టేబుల్ స్పూన్
జీలకర్ర – ఒక టీస్పూన్
ఎండుమిర్చి – మూడు
మిరియాలు – అర టీస్పూన్
కారం – ఒకటిన్నర టీస్పూన్
పసుపు – పావు టీస్పూన్
కసూరి మేతి – ఒక టీస్పూన్
ఫ్రెష్ క్రీమ్ – రెండు టేబుల్ స్పూన్లు
నూనె లేదా వెన్న – మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
Also Read: కారం కారంగా, నోట్లో నీళ్లూరించే ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు.. ప్లేట్లో ఒక్క ముద్ద కూడా మిగలదు!
ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిలో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధానమే ఈ రెసిపీకి అసలైన రుచిని ఇస్తుంది.
ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, పెద్ద ముక్కలుగా కోసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ వేసి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద వేయించి పక్కకు తీయాలి. ఆ తర్వాత పనీర్ ముక్కలను కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
ఇప్పుడు కడాయిలో మిగిలిన నూనె లేదా కొద్దిగా వెన్న వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు కలపాలి. తర్వాత మెత్తగా రుబ్బుకున్న టమోటా ప్యూరీ వేసి నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించాలి.
తర్వాత ఉప్పు, పసుపు, కారం, మనం ముందుగా సిద్ధం చేసుకున్న కడాయి మసాలా పొడి వేసి బాగా కలపాలి. గ్రేవీ చిక్కబడటానికి కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. గ్రేవీ బాగా ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న పనీర్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలను వేసి నెమ్మదిగా కలపాలి.
చివరగా చేత్తో నలిపిన కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఘుమఘుమలాడే రెస్టారెంట్ స్టైల్ కడాయి పనీర్ మసాలా వేడివేడిగా వడ్డించడానికి సిద్ధం అయినట్టే.
Also Read: ఆదివారం ఇల్లు మొత్తం ఘుమఘుమలాడిపోవాలంటే.. ఈ టేస్టీ కాజు చికెన్ ఫ్రై చేసుకోవాల్సిందే!