Ullikaram Kodiguddu Vepudu: రోజూ చేసే కోడిగుడ్డు వేపుడే కదా అని తేలిగ్గా తీసుకోకండి. కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, మసాలాలు జోడించి ఉల్లికారంతో కోడిగుడ్డు వేపుడు తయారు చేస్తే రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా ఉల్లిపాయలను బాగా వేయించి, వాటితో గుడ్లను కలిపి వండటం వల్ల ప్రతి ముక్కలోనూ అద్భుతమైన రుచి ఉంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ వేపుడును జత చేసుకుంటే ఇంకేం కావాలి చెప్పండి. తక్కువ సమయంలో, మన వంటింట్లో ఉండే పదార్థాలతో చేసుకోగలిగే ఈ ఉల్లికారంతో కోడిగుడ్డు వేపుడును మీరు కూడా ఓసారి ట్రై చేయండి.
కోడిగుడ్లు – 4
ఉల్లిపాయలు – 3
పచ్చిమిర్చి – 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
కారం – ఒక టీ స్పూన్
పసుపు – పావు టీ స్పూన్
ధనియాల పొడి – అర టీ స్పూన్
గరం మసాలా – అర టీ స్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
కరివేపాకు – రెండు రెమ్మలు
కొత్తిమీర – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – 3 టేబుల్ స్పూన్లు
Also Read: ఆదివారం ఇల్లు మొత్తం ఘుమఘుమలాడిపోవాలంటే.. ఈ టేస్టీ కాజు చికెన్ ఫ్రై చేసుకోవాల్సిందే!
కోడిగుడ్లను నీటిలో వేసి బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పొట్టు తీసి గుడ్లను చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా తరిగి, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు నిదానంగా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి.
తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ ఉల్లిపాయలకు పట్టిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గుడ్డు ముక్కలను వేసుకోవాలి. గుడ్లు విరిగిపోకుండా మెల్లగా కలుపుతూ 3 నుంచి 4 నిమిషాలు వేయించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లి మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
ఇక అంతే.. ఎంతో రుచికరమైన ఉల్లికారంతో కోడిగుడ్డు వేపుడు సిద్ధం. వేడివేడి అన్నం, చపాతీ లేదా రొట్టెల్లోకి ఈ వేపుడు చాలా బాగుంటుంది. వారంలో మూడు సార్లపై పైగా చేసుకునే తినేయొచ్చు అన్నంత అద్భుతంగా ఉంటుందీ వంటకం.
Also Read: బయట దొరికే పాస్తా కంటే 10 రెట్లు రుచిగా.. ఇంట్లోనే క్రీమీ చీజీ చికెన్ పాస్తా తయారీ విధానం!