సదాబహార్ పువ్వులంటే ఎవరికీ తెలియదు. కానీ వీటిని చూస్తే మాత్రం పోల్చేస్తారు. వీటిని ఎక్కువ మంది ఏవో పిచ్చి పువ్వులు అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఇది శక్తివంతమైన ఔషధ మొక్కగా చెప్పుకోవచ్చు. ఉష్ణ మండల ప్రాంతాల్లో పెరిగే మొక్క ఇది. సాంప్రదాయ వైద్యంలో కూడా దీనిని వినియోగిస్తూ ఉంటారు. కానీ దీని గొప్పతనం తెలియక ఎంతోమంది ఈ మొక్కలను తీసి పడేస్తూ ఉంటారు. దీని పువ్వులు గులాబీ రంగు, తెలుపు రంగుల్లో ఉంటాయి. ఇంటి ముందు ఎక్కువగా ఇవి కనపడతాయి. కానీ ఇంట్లో మాత్రం వీటిని ఎవరు పెంచుకోవడానికి ఇష్టపడరు.
సదా బహార్ మొక్కను శతాబ్దాలుగా ఆయుర్వేద నివారణలో భాగంగా వినియోగిస్తున్నారు. దీన్ని జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. సదాబహార్ పువ్వులో బయోయాక్టివ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నెత్తి మీద ఉండే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి సదాబహార్ పువ్వులు ఉపయోగించి జుట్టును ఎలా పెంచుకోవచ్చో తెలుసుకోండి.
సదా బహార్ పువ్వుల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా జుట్టు సంరక్షణకు సహజ నివారణలుగా ఉపయోగపడతాయి. జుట్టును పెంచడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తలపై చర్మం దెబ్బ తినకుండా, జుట్టు పలచబడకుండా అడ్డుకుంటాయి. ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించి జుట్టు ఎదుగుదలకు సహకరిస్తాయి. జుట్టు కుదుళ్లను ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించి బలాన్ని ఇస్తాయి.
తలపై చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలు ఉన్నవారు సదాబహార్ పువ్వులను ఉపయోగించవచ్చు. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఇవి ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి జుట్టు పెరుగుదలకు అవసరమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తాయి.
కొన్ని అధ్యయనాలు ప్రకారం సదాబహార్ పువ్వులు తలపై రక్తప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడతాయి. రక్త ప్రవాహం మాడు పై పెరిగితే జుట్టు కుదుళ్లకు పోషకాలు పుష్కలంగా పొందుతాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తాయి. సదాబహార్ పువ్వులు జుట్టు కుదుళ్లను బలంగా మార్చడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరంగా జుట్టు పెరగడానికి సహాయపడతాయి. అలాగే చుండ్రుతో ఇబ్బంది పడుతున్న వారు కూడా సదాబహార్ పువ్వులను వాడడం వల్ల ఇబ్బంది నుంచి బయటపడవచ్చు.
సదా బహార్ పువ్వులతో జుట్టును ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి
ఈ పువ్వులను ఉపయోగించి నూనె కషాయాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని అప్పుడప్పుడు తలపై వేసుకొని మర్దన చేస్తూ ఉండాలి. ఇది మొత్తం జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందుకోసం మీరు కొన్ని తాజా సదా బహార్ పువ్వులను తీసుకోవాలి. అలాగే ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె తీసుకోవాలి.
ఇప్పుడు సదా బహార్ పువ్వులను శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె వేసి కొంచెం వేడి చేయాలి. ఆ వేడి నూనెలోనే సదాబహార్ పువ్వులను వేసి కలపాలి. పావుగంటసేపు చిన్న మంట మీద ఆ నూనెలోనే ఈ పువ్వులను వేగనివ్వాలి. ఈ పువ్వుల్లోని సమ్మేళనాలన్నీ నూనెలోకి చేరుతాయి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు వడకట్టి ఈ నూనెను ఒక బాటిల్ లో వేసుకోవాలి. అప్పుడప్పుడు ఆ నూనెను తలపై మర్దనా చేస్తూ ఉండాలి. దీన్ని గది ఉష్ణోగ్రత వద్ద చీకటి ప్రదేశంలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం ఈ నూనె తాజాగా ఉంటుంది.
సదాబహార్ నూనెను తలపై వేసుకొని జుట్టు కుదుళ్లకు తాకేలా మర్ధనా చేయాలి. కనీసం అరగంట పాటు అలా వదిలేయాలి. లేదా పడుకునే ముందు రాసుకొని రాత్రంతా జుట్టు అలాగే వదిలేయాలి. ఉదయం లేచాక తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేసుకోవాలి. మంచి ఫలితాల కోసం వారానికి రెండు మూడు సార్లు ఇలా చేస్తే జుట్టు బాగా ఎదుగుతుంది.
సదా బహార్ పువ్వులతో హెయిర్ మాస్క్ కూడా వేసుకోవచ్చు. ఈ పువ్వులు తేనె, కలబంద జెల్ అన్ని కలిపి మిక్సీలో పేస్టులా చేయాలి. ఆ మొత్తాన్ని తలకు పట్టించి పది నిమిషాలు వదిలేయాలి. తర్వాత తేలిక పాటు షాంపూతో వాష్ చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు రావడం ఖాయం.
Also Read: GBS వైరస్.. ఇది సోకగానే మొదట కనిపించే లక్షణం ఇదే, తస్మాత్ జాగ్రత్త !