ప్రపంచంలో ఉన్న ఆహారాలలో పాలు ఎంతో ముఖ్యమైనవి. వీటిలో కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరినీ పాలు తాగమని చెబుతారు. కానీ అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు పాలు తాగడానికి సందేహపడతారు. ప్రతిరోజు పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ మరింతగా పెరిగిపోయే అవకాశం ఉందని భయపడతారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
పాలతో అధిక కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు కొవ్వు అధికంగా ఉండే పాలను తీసుకోకూడదు. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే అవకాశం ఉంది. దీనివల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. అలా కాకుండా కొవ్వు తీసిన పాలు లేదా స్కిమ్డ్ మిల్క్ బయట దొరుకుతాయి. వాటిలో సంతృప్తి కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలాంటివి తాగితే ఎలాంటి సమస్య ఉండదు. అలాగే బాదం, సోయా, వోట్ మీల్ తో తయారు చేసిన పాలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఇలాంటి పాల రకాలను ఎంపిక చేసుకుంటే పోషకాలు సమృద్ధిగా శరీరానికి అందుతాయి. ఆ పాలల్లో కొలెస్ట్రాల్ కూడా ఉండదు. అవి ఎల్డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
వెన్న తీయని పాలను తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలో ఎలా పెరుగుతాయో తెలుసుకుందాం. పాలలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేస్తాయి. ఒక కప్పు పాలలో 24 నుంచి 35 మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంది. అదే కొవ్వు తీసిన పాలలో అంటే వెన్న తీసిన పాలలో లేదా స్కిమ్డ్ మిల్క్ లో సంతృప్తి కొవ్వులు తక్కువగా ఉంటాయి. దీనిలో ఒక కప్పు పాలకూ ఐదు మిల్లీగ్రాముల కొలెస్ట్రాల్ మాత్రమే ఉంటుంది. అదే మొక్కల ఆధారిత పాలు అయినా బాదం, సోయా, ఓట్ మిల్ వంటి పాలల్లో కొలెస్ట్రాల్ ఉండదు. కాబట్టి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను బట్టి మీరు ఏ పాలు తాగాలో నిర్ణయించుకోండి.
గుండె ఆరోగ్యానికి
అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు బాదం పాలను తాగవచ్చు. ఇది గుండె ఆరోగ్యానికి మంచి ఎంపిక. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఇక సోయా పాలలో మొక్కల నుంచి వచ్చే స్టెరాల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గిస్తాయి. ఇక ఓట్ మీల్ తో చేసే పాలలో కొలెస్ట్రాల్ ఉండదు. ఇది సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవచ్చు. గుండె ఆరోగ్యానికి ఈ వోట్ మీల్ ఎంతో ఉపయోగపడతాయి. స్కిమ్డ్ మిల్క్ అంటే కొవ్వు, వెన్న తీసేసిన పాలు వీటిలో సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఈ స్కిమ్డ్ మిల్క్ తాగవచ్చు. దీనిలో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి.