Electrolytes: ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా.. ఆరోగ్యంగా జీవించాలంటే రోజూ మనం తీసుకునే ఆహారం మంచి పోషకాలను కలిగి ఉండాలి. పోషకాలంటే.. విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్స్, కొవ్వులు, పిండి పదార్థాలు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలే. అయితే, వీటిల్లోని మినరల్స్‌ను ఇప్పుడు మనం ఎలక్ట్రోలైట్స్ అని కూడా పిలుచుకుంటున్నాం. ఈ ఎలక్ట్రోరల్స్ మన శరీరంలోని అనేక జీవక్రియలను నిర్వహించేందుకు ఎంతగానో తోడ్పడుతుంటాయి.
ఎలక్ట్రోలైట్స్‌ను నేరుగా కాకుండా.. ఆహారాలు, ద్రవాల రూపంలో తీసుకుంటున్నాం. అలాగే ఇవి మనం విసర్జించే చెమట, మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. కాబట్టి.. ఎప్పటికప్పుడు మన బాడీ ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మన శరీరం అన్ని క్రియలను సక్రమంగా నిర్వహించగలదు.
* ఈ ఎలక్ట్రోలైట్స్ అనేది మన శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచుతాయి. మన బాడీ డీహైడ్రేడ్ అవ్వకుండా కాపాడుతుంటాయి.
* ఇవి మన శరీరంలోని కణాలకు తక్షణ శక్తినిచ్చి, నాడీ మండల వ్యవస్థ, మెదడు యాక్టివ్‌గా ఉండేలా చూస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.
* మన బాడీలోని పీహెచ్ స్థాయిలు ఎలక్ట్రోలైట్స్ వల్లే సక్రమంగా ఉంటాయి. కణాలకు పోషకాలను అందించేందుకు కూడా ఎలక్ట్రోలైట్సే సాయపడతాయి.
* శరీరంలో ఎప్పటికప్పుడు ఉత్పత్తయ్యే వ్యర్థాలను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి ఎలక్ట్రోలైట్స్. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రంగా ఉంటుంది.
* ఇవి శరీరంలో దెబ్బతిన్న కణజాలాలకు మరమ్మత్తులను నిర్వహించడంలోనూ కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి.. ఎలక్ట్రోలైట్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగకరం.
సోడియం, పొటాషియం, క్లోరైడ్, క్యాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్ వంటి మినరల్స్ సమ్మేళనాలను ఎలక్ట్రోలైట్స్ అంటారు. వీటిని ఎక్కువగా క్రీడాకారులు, శారీరక శ్రమ చేసేవారు తీసుకుంటారు. అయితే, ఇవి చెమట రూపంలో బయటకి వచ్చేస్తుంటాయి. కాబట్టి వాళ్లు నీళ్లతోపాటు ఎలక్ట్రోలైట్స్ ఉండే పానీయాలను ఎక్కువగా తీసుకుంటుంటారు. ఎలక్ట్రోలైట్స్‌ను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభించి మళ్లీ క్రీడల్లో చురుగ్గా పాల్గొంటారు. దీనివల్ల నీరసం, అలసట రాకుండా ఉంటాయి.