Amla: ఉసిరికాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇది విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఇతర పోషకాలకు నిలయం. అందుకే దీనిని ‘సూపర్ ఫుడ్’ అని కూడా పిలుస్తారు. ఉసిరి రోగనిరోధక శక్తిని పెంచడానికి.. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది జుట్టు, చర్మ ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే ఉసిరిని జ్యూస్ లాగా తీసుకోవాలా ? లేక పొడి రూపంలో తీసుకోవాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి ప్రయోజనాలు:
అధిక విటమిన్ సి: తాజా ఉసిరి రసంలో విటమిన్ సి అత్యధికంగా లభిస్తుంది. శరీరానికి ఇది తక్షణ పోషణ అందిస్తుంది. అయితే.. గాలికి లేదా వేడికి విటమిన్ సి కొంత కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి తాజాగా తయారుచేసి వెంటనే తాగడం మంచిది .
తక్షణ శోషణ: రసం రూపంలో పోషకాలు రక్తంలోకి త్వరగా శోషించబడతాయి. తద్వారా త్వరగా శక్తి , ఆరోగ్యాన్ని ఇస్తుంది.
శరీరాన్ని శుభ్రపరుస్తుంది: ఉదయం ఖాళీ కడుపుతో రసం తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల కూడా జీవక్రియ వేగవంతం అవుతుంది.
జీర్ణక్రియకు సులభం: అజీర్తి, ఎసిడిటీ ఉన్నవారికి రసం త్వరగా ఉపశమనాన్ని ఇస్తుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
రసాన్ని ఫిల్టర్ చేస్తే.. ఫైబర్ కొంత కోల్పోతాము.
ప్యాక్ చేసిన జ్యూస్లలో చక్కెర లేదా ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది.
ఉసిరి పొడి ప్రయోజనాలు:
ఫైబర్ సమృద్ధి: పొడిలో ఉసిరికాయ మొత్తం భాగం ఉంటుంది కాబట్టి. ఇది సహజమైన ఫైబర్‌ను కలిగి ఉంటుంది. ఇది మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయ పడుతుంది.
యాంటీఆక్సిడెంట్లు: పొడిగా మార్చడం వల్ల విటమిన్ సి కొంత తగ్గినా, యాంటీఆక్సిడెంట్లు , ఇతర ముఖ్య పోషకాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
సులభంగా లభ్యం/వాడకం: ఉసిరికాయలు లభ్యం కాని సమయంలో కూడా పొడిని సులభంగా వాడుకోవచ్చు. దీనిని తేనె, నీరు లేదా ఇతర పదార్థాలతో కలిపి కూడా తీసుకోవచ్చు.
ఆయుర్వేదం: ఆయుర్వేదంలో దీనిని త్రిఫల వంటి అనేక ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పొడి తయారుచేసే విధానం వల్ల విటమిన్ సి కొంత కోల్పోవచ్చు. నాణ్యత లేని పొడిలో కల్తీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి నాణ్యమైన ఆర్గానిక్ పొడిని ఎంచుకోవడం ముఖ్యం.
ఏది బెస్ట్ ?
నిజానికి ఉసిరి రసం, పొడి రెండూ వాటి ప్రత్యేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఈ రెండిటిలో ఏది ఉత్తమం అనేది మీ వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.
మీ లక్ష్యం విటమిన్ సి, తక్షణ పోషణ అయితే: ఉసిరి రసం బెస్ట్. మీ లక్ష్యం జీర్ణక్రియ, మలబద్ధకం వంటి సమస్యలయితే ఉసిరి పొడి ఉత్తమం. ఎందుకంటే పొడిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా దీన్ని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.