భారతీయ భోజనంలో పెరుగు ఎంతో ముఖ్యమైనది. పంచభక్ష్య పరమాన్నాలు తిన్నా… చివరిలో పెరుగుతో ఒక ముద్ద తిననిదే భోజనం పూర్తికాదు. రుచిలోనే కాదు ఆరోగ్యపరంగా కూడా పెరుగు ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో పెరుగు లేనిదే ఎంతోమంది ఆహారాన్ని తినలేరు. కూడా పెరుగు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. గట్ బ్యాక్టీరియాను కాపాడతాయి. అయితే రాత్రిపూట పెరుగు తినకూడదు అనే వాదన ఎంతోమందిలో ఉంది. ఇది ఆరోగ్యాన్ని నెమ్మదిగా క్షీణించేలా చేస్తుందని కూడా అంటారు. దీనికి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
మధ్యాహ్న భోజనంలోనే పెరుగు
ప్రాచీన కాలం నుండి పెరుగును ఆరోగ్యకరమైన ఆహారంగానే పరిగణిస్తున్నారు. ఇందులో ప్రోబయోటిక్ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియతో ఎంతో సహాయపడతాయి. అయితే పెరుగు తినేందుకు కూడా సరైన సమయం ఉంది. రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిది. వీలైనంతవరకు బ్రేక్ ఫాస్ట్ లో లేదా మధ్యాహ్న భోజంలోనే పెరుగును తినాలి. రాత్రిపూట ఆహార ఆహారంలో భాగంగా పెరుగును తినడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి.
పెరుగు భారీ ఆహారమే
రాత్రిపూట శరీర జీవక్రియలు నెమ్మదిస్తాయి. అలాంటప్పుడు పెరుగును తింటే అది భారీ ఆహారంగా మారుతుంది. జీర్ణ క్రియ మరింత నెమ్మదిగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణక్రియ ఎంజైమ్ లను మరింతగా చల్లబరుస్తాయి. కాబట్టి జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కఫ దోషం రావడం ఖాయం
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం రాత్రిపూట పెరుగు తినడం వల్ల కఫదోషం పెరిగిపోతుంది. ఇది గొంతు నొప్పికి, ముక్కు దిబ్బడకు కారణం అవుతుంది. ఉదయం లేచినప్పుడు ముక్కు పట్టేసి, తలంతా బరువుగా అనిపిస్తుంది. పెరుగు వల్ల చల్లని స్వభావం శరీరానికి కలుగుతుంది. రాత్రిపూట పెరుగు తింటే జలుబు, ఫ్లూ, దగ్గు వంటివి వచ్చే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు రాత్రిపూట పెరుగును పెట్టకూడదు. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు పెరుగును రాత్రిపూట తినకపోవడమే ఉత్తమం.
కొంతమందిలో రాత్రిపూట పెరుగుతుంటే ఉదయానికి చర్మ అలెర్జీలు, మొటిమలు, దురదలు వంటివి వచ్చే అవకాశం ఉంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ కారణంగా ఇది కలగవచ్చు. అలాంటివారు పెరుగుకు దూరంగా ఉండడమే మంచిది. రాత్రిపూట పెరుగు తినే బదులు మధ్యాహ్న భోజనంలో వీరు పెరుగును తినవచ్చు. రాత్రిపూట పెరుగు తింటే మాత్రం ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది.
కీళ్ల నొప్పులతో బాధపడేవారు కూడా రాత్రిపూట పెరుగు తినకూడదు. వారికి కీళ్ల నొప్పులు మరింత పెరిగిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ లేదా లంచ్ లోనే పెరుగును తినేలా చూసుకోండి. రాత్రిపూట పెరుగు లేకుండా తినేందుకే ప్రయత్నించండి.
కొన్నిసార్లు రాత్రిపూట పెరుగు తినే సందర్భాలు రావచ్చు. అలాంటి సమయంలో కొద్దిగా నల్ల మిరియాలు పొడిని పెరుగులో కలిపి తినండి. అప్పుడు నల్లమిరియాలు వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. పెరుగు చల్లని స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల శీతలీకరణ ప్రభావం సమతుల్యం అవుతుంది. కాబట్టి జీర్ణక్రియలు ఎలాంటి హాని కలగదు.