Relationships: బిడ్డ పుట్టక ముందు మహిళల ఆలోచనలు ఒకలా ఉంటాయి. బిడ్డ పుట్టాక వారి ఆలోచనలు ఎంతో మారిపోతాయి. బిడ్డతో వారి భావోద్వేగ బంధం ఎక్కువైపోతుంది. వారికి కొన్ని నెలల వయసు వచ్చేవరకు తల్లీబిడ్డను విడిచిపెట్టి ఏ పనీ చేసేందుకు ఇష్టపడదు. అలాంటి సమయంలో తమ జీవిత భాగస్వామితో కాస్త దూరం పెరిగిపోతుంది. అలాంటప్పుడు మీరు మళ్ళీ మీ భర్తతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించాలి. అతనితో తిరిగి కొత్తగా ప్రేమలో పడాలి.
గర్భం ధరించడం, బిడ్డని ప్రసవించడం… ఈ రెండూ కూడా మహిళ జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. వారిని శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రభావితం చేస్తాయి. అయితే బిడ్డతో పాటు మీ జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారని గుర్తుపెట్టుకోండి. మీ బిడ్డ తండ్రి ఆనందం కూడా మీకు ముఖ్యమే. మీ ఇద్దరూ భావోద్వేగాలపరంగా ఒకటి కావడం కూడా ప్రధానమే. అప్పుడే ఆ బిడ్డ తల్లిదండ్రుల ప్రేమతో పద్ధతిగా ఎదుగుతాడు.
తల్లిదండ్రులుగా మారాక భార్యాభర్తల మధ్య ఏదో మార్పు కనిపిస్తుంది. వారు త్వరగా అలసిపోతారు. పనులు కూడా ఎక్కువైపోతాయి. ఒకరి కోసం ఒకరు సమయాన్ని వెచ్చించుకోలేరు. కానీ వీరిద్దరూ ఎలాగోలా ఒకరితో ఒకరు రోజులో ఎంతో కొంత సమయాన్ని గడపడం చాలా ముఖ్యం. తిరిగి వారు ప్రేమలో పడాలి. తమ లైంగిక జీవితాన్ని, ప్రేమపూర్వక సంభాషణను ప్రారంభించాలి.
మీ బిడ్డ నిద్రపోయే సమయంలో మీకోసం సమయాన్ని కేటాయించుకోండి. భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేసుకోండి. కనీసం ఫోన్‌లోనైనా, వాట్సాప్‌లోనైనా చాటింగ్ చేస్తూ ఉండండి. మీకు నచ్చిన విషయాలను వారితో చర్చించండి. ఆ నెల ఖర్చులు, బిడ్డ అవసరాలు, చేయాల్సిన పనులు, మీ ఆసక్తులు ఇలా అన్నిటి గురించి మాట్లాడుతూనే ఉండండి. ఇది మీలో అతనిలో కూడా సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.
బిడ్డ పుట్టాక భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం తగ్గిపోతుంది. బిడ్డతో పాటు ఉండడం వల్ల తల్లికి నిద్రలేమి, అలసట ఎక్కువైపోతాయి. ప్రసవానంతర సమస్యలు కూడా భాగస్వామితో లైంగిక జీవితానికి అనుకూలంగా ఉండనివ్వవు. అయితే మీ భాగస్వామికి మీపై ప్రేమ, కోరిక కలగవచ్చు. అలాంటి సమయంలో మీరు కొంత ఓపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ప్రేమగా మీ ఇద్దరూ మీ లైంగిక సంబంధాన్ని మొదలుపెట్టాలి. మీ శిశువు నిద్రా షెడ్యూల్ ప్రకారం మీరు ఆ సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. మీ భర్తకు మీరే మద్దతుగా నిలవాలి. మీకు మాతృత్వం ఎంత ముఖ్యమో, భార్య పాత్ర నిర్వర్తించడం కూడా అంతే ముఖ్యం.
భార్యాభర్తలు ఇద్దరికీ కూడా నిద్ర ముఖ్యమైనదే. బిడ్డ వల్ల కొన్ని నెలల పాటు వీరికి నిద్రలేమి సమస్య వస్తుంది. కాబట్టి మరింత నిద్రపోవడానికి మార్గాలను మీ ఇద్దరూ కలిసి వెతుక్కోవాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మరింత శక్తిని అందిస్తుంది. వీలైనప్పుడు మీరు మెలకువగా ఉండి బిడ్డను చూసుకోండి. మీ భాగస్వామిని నిద్ర పొమ్మని చెప్పండి. అలాగే మీరు నిద్రపోయినప్పుడు బిడ్డ బాధ్యతను భాగస్వామికి అప్పజెప్పండి. ఇలా చేయడం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ కూడా కలుగుతుంది. అలాగే నిద్రలేమి సమస్య కూడా రాకుండా ఉంటుంది.
Also Read: ఈ కాలం అమ్మాయిలకు మంచి అబ్బాయిల కన్నా బ్యాడ్ బాయ్స్ ఎందుకు నచ్చుతారు?
మీ బిడ్డకు మీరిద్దరూ మాత్రమే సంరక్షకులు. కాబట్టి బిడ్డ కోసం మీ ఇద్దరూ కష్టపడాల్సిందే. కొన్నిసార్లు ఇతరుల సహాయం కూడా తీసుకోవాల్సి వస్తుంది. మీ తల్లిదండ్రులు మీకు దగ్గరలోనే ఉంటే కనీసం రోజులో రెండు మూడు గంటలు ఆ బిడ్డను చూసుకోమని కోరండి. ఆ మూడు గంటల సమయాన్ని భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గడిపేందుకు ప్రయత్నించండి. డేట్‌కు వెళ్ళండి. ఇష్టమైన భోజనాన్ని తినేందుకు హోటల్‌కు వెళ్ళండి. ఇలా చేయడం వల్ల మీపై మీ ఇద్దరికీ మళ్లీ కొత్తగా ప్రేమలో పడిన అనుభవం వస్తుంది. ఇది మీ ఇద్దరినీ మరింతగా దగ్గర చేస్తుంది.