Migraine Relief:మైగ్రేన్ సమస్య ఉన్న వారు విపరీతమైన తలనొప్పితో ఇబ్బంది పడతారు. సాధారణ తలనొప్పితో పోలిస్తే మైగ్రేన్ తలనొప్పి చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుందనే చెప్పొచ్చు. దీనికి తోడు చాలా మందిలో వికారం, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి ఉన్న వారు చిన్న శబ్దానికి కూడా చాలా డిస్టర్బ్ అయిపోతారు. వెలుతురు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య మరింత పెరిగిపోతుందట. మైగ్రేన్ సమస్య వల్ల వచ్చే తలనొప్పి కొన్ని గంటల నుంచి రోజుల తరబడి కొనసాగే అవకాశం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మైగ్రేన్ ప్రభావాన్ని తగ్గించుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు. మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి, జీవనశైలిలో ఏరకమైన మార్పులు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
మైగ్రేన్‌ను తగ్గించేందుకు ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలు మైగ్రేన్‌ను మరింత పెరిగేలా చేస్తాయట. చీజ్, చాక్లెట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆల్కహాల్ వంటి వాటిని తరచుగా తీసుకోవడం వల్ల మైగ్రేన్ సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు, అందుకే వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వీటితో పాటు కాఫీ లేదా టీ వంటి కెఫీన్ అధికంగా ఉండే ఆహారనికి దూరంగా ఉండడం మంచిది.
మైగ్రేన్ తగ్గాలంటే..
జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మూగ్రేన్ తల నొప్పి నుంచి తప్పించుకోవడం సులభం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ సమయానికి తినడం వల్ల తలనొప్పి రాకుండా ఉంటుందట. రాత్రి వేళల్లో ఆహారం తీసుకోవడం మానేస్తే మైగ్రేన్ ప్రభావం పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలా మందిలో నిద్రలేమి లేదా తక్కువ నిద్ర వల్ల మైగ్రేన్ సమస్యలు వచ్చే అవకాశం ఉందట. అందుకే రోజుకు 7-8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకొని, ఒకే సమయానికి లేవడం మంచిది.
ALSO READ: అంజీర్ తీసుకుంటే శరీరంలో జరిగేది ఇదే
తీవ్రమైన ఒత్తిడి కారణంగా కూడా మైగ్రేన్ సమస్య వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని తగ్గించేందుకు ధ్యానం లేదా యోగా చేయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా పని చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం మంచిది.
మైగ్రేన్ వల్ల బాగా నొప్పిగా అనిపించినప్పుడు తలకు చల్లటి కూల్ ప్యాక్ పెట్టడం మంచిది. దీని వల్ల నొప్పి తగ్గిపోతుందట. లావెండర్ లేదా పిపర్‌మెంట్ ఆయిల్ వాసన మైగ్రేన్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని డాక్టర్లు చెబుతున్నారు. విపరీంతగా తల నొప్పి వచ్చినప్పుడు జింజర్ టీ లేదా తులసి టీ తాగితే మంచి ఫలితం కనిపించే ఛాన్స్ ఉందట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.