Hair loss in Buldhana: మహారాష్ట్రలోని పల్లెల్లో కొత్త కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. మెన్నటి వరకు జుట్టు రాలే సమస్య వెలుగులోకి రాగ.. ఆ సమస్య నుంచి బయట పడేలోపే గోళ్ల సమస్య తీవ్ర దుమారం రేపుతుంది. బుల్ఢాణా జిల్లాలోని కొన్ని గ్రామాల ప్రజలు ఈ సమస్యలతో బాధపడుతున్నట్లు వార్తలు బయటికొచ్చాయి. దీంతో అక్కడి అధికారులు అప్రమత్తమై వైద్య పరీక్షలు నీర్వహించారు. చేతికి, కాళ్లకు ఉన్న గోళ్లు వాటంతట అవే ఊడిపోతున్నట్లు గుర్తించారు. దీంతో ఈ సమస్య దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్, బుల్ఢాణా జిల్లాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు జుట్టు వాటంతట అదే రాలిపోతూ ఉండడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వాటికి పరిష్కార మార్గం చూసే అధికారులకు మరో సమస్య వచ్చి పడింది. తాజాగా షెగావ్ ప్రాంతంలోని నాలుగు గ్రామాల్లో చాలా మంది ప్రజలు గోళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చేతికి, కాళ్లకు ఉన్న గోళ్లు వాటంతట అవే ముడుచుకుపోవడం, ఊడిపోవడం జరుగుతుందని చెబుతున్నారు. కొందరికి కాళ్ల గోళ్లు చర్మం లోపలికి వెళ్లినట్లు గుర్తించారు.
ఇలా గోళ్ల సమస్యలతో బాధపడుతున్న వారని మెరుగైన వైద్య పరీక్షల కోసం షెగావ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారి గోళ్ల శాంపిల్స్ తీసుకున్నారు. వాటిని ల్యాబ్‌కి పంపించి ప్రత్యేక పరీక్షలు జరిపారు. వాటి రిపోర్టు రావాల్సి ఉంది. అయితే సెలీనియం స్థాయి శరీరంలో ఎక్కువగా ఉండడం వల్లే జుట్టు, గోళ్లు రాలిపోతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు డాక్టర్లు. దీనిపై లోతుగా పరీక్షలు.. జరిపి వివరాలు వాటికి పరిష్కార మార్గాలు కనుగొంటామని డాక్టర్ బంకర్ చెబుతున్నారు.
Also Read: సమ్మర్‌లో.. జుట్టుకు కాపాడుకోండిలా ?
ఈ క్రమంలోనే జుట్టు, గోళ్లు రాలిపోవడానికి వారు తింటున్న ఆహారం పదార్థాల లోపం అని కొందరు నిపుణులు అంటున్నారు. గోధుమలతో చేసిన పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఈ రకమైన సమస్య తలెత్తే అవకాశం ఉందని న్యూట్రీషియన్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోధుమలోని సెలీనియం జుట్టు, గోళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు. అయితే దీని పై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని అంటున్నారు స్థానికులు. ఇదిలా ఉంటే ఇది ప్రాణాంతకమైన సమస్య ఏమి కాదని, ప్రజలు భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదని అంటున్నారు డాక్టర్లు.. త్వరలోనే ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు.