Canada Indian Shot Dead| కెనడాలో గత కొంత కాలంగా హిందూ దేవాలయాలు, ప్రార్థనా స్థలాలపై, భారతీయులపై వరుసగా జరుగుతున్న దాడులు అక్కడ నివసించే భారత సంతతి ప్రజలను తీవ్రంగా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవలి కాలంలోనే ఓ భారతీయుడు కత్తితో పొడిచిన ఘటన చోటు చేసుకోగా, తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలో జరిగిన కాల్పుల ఘటనలో ఓ భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం టొరంటోలోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
హమిల్టన్ నగరంలోని ఓ కాలేజీలో చదువుతున్న హర్‌సిమ్రత్ రంధవా అనే విద్యార్థిని బుధవారం బస్సు కోసం స్థానిక బస్టాప్ వద్ద వేచి ఉండగా ఈ ఘటన జరిగింది. అదే సమయంలో కారులో వచ్చిన ఓ దుండగుడు బస్టాప్ వద్ద నిలబడి ఉన్న మరో వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాడు. అయితే దురదృష్టవశాత్తూ ఓ బుల్లెట్ ప్రమాదవ శాత్తు హర్‌సిమ్రత్‌కు తగిలింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా.. హర్‌సిమ్రత్ రక్తపు మడుగులో పడిఉండటాన్ని గమనించారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
పోలీసుల కథనం ప్రకారం.. కాల్పులు జరిపిన ఇరు వర్గాలు ఘటన తరువాత అక్కడి నుంచి పారిపోయాయి. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విషాదకర ఘటనపై భారత కాన్సులేట్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఓ అమాయకురాలు నిర్దాక్షిణ్యంగా జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని పేర్కొంది. మృతురాలి కుటుంబానికి అవసరమైన సాయాన్ని అందించి, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది.
రెండు వారాల క్రితమే ఒక భారతీయుడి హత్య
ఇటీవలే ఒక భారతీయుడు కెనడాలో హత్యకు గురయ్యాడు. కెనడాలోని ఒట్టావా సమీపంలోని రాక్‌లాండ్ ప్రాంతంలో ఓ భారతీయుడు కత్తిపోట్లకు గురై మరణించాడు. అయితే అతడి పేరు, ఇతర వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదు. ఈ ఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
Also Read: మతి స్థితిమితం లేని యువకుడిపై కాల్పులు జరిపిన పోలీసులు.. 10 రోజులుగా కోమాలో..
గత డిసెంబర్ నెలలో ముగ్గరు భారతీయులు మృతి
ఇక గత డిసెంబరులో చోటుచేసుకున్న వరుస ఘటనలు భారతీయులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. డిసెంబర్ 1న పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాకు చెందిన గురాసిస్ సింగ్ అనే విద్యార్థిని ఒంటారియోలోని సర్నియా సిటీలో అద్దెకు ఉంటోన్న ఇంట్లో హత్యకు గురయ్యాడు. నాలుగు నెలల క్రితమే అతను ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లాడు. అతడితో అదే ఇంట్లో నివసిస్తున్న క్రాస్లే హంటర్ అనే వ్యక్తి గురాసిస్‌ను కత్తితో పొడిచి చంపాడు. డిసెంబర్ 6న హర్షదీప్ సింగ్ అనే భారతీయ సంతతికి చెందిన సెక్యూరిటీ గార్డును ఓ గ్యాంగ్ కాల్చి చంపింది. ఇక డిసెంబర్ 7న పంజాబ్‌కు చెందిన రితిక్ రాజ్‌పుత్ అనే వ్యక్తి చెట్టు కూలి మరణించాడు.
అధికారిక గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం కెనడాలో సుమారు నాలుగు లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. అయితే, గతేడాదిన్నర కాలంగా భారత్–కెనడాల మధ్య సంబంధాలు ప్రతిష్ఠంభన పరిస్థితిలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఖలీస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా చేసిన ఆరోపణలు. ఈ హత్యకు భారతదేశం కారణమని కెనడా ప్రభుత్వం వెల్లడించిన దృష్ట్యా ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తత పెరిగింది.