Talawa Gosht Recipe: మాంసాహార ప్రియుల జాబితాలో మటన్ కర్రీ అనగానే ముందుగా గుర్తొచ్చేది రకరకాల గ్రేవీలు. కానీ, గ్రేవీల జోలికి వెళ్లకుండా.. మసాలాలు మాంసానికి పూర్తిగా పట్టి అద్భుతమైన రుచినిచ్చే వెరైటీ వంటకం కావాలనుకుంటే ‘తలావా గోష్త్’ను ట్రై చేయొచ్చు. హైదరాబాద్ నవాబుల వంటకాల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తలావా అంటే ఉర్దూలో వేయించడం అని అర్థం. ఈ వంటకంలో మటన్‌ను ఉడికించి, తర్వాత అల్లం వెల్లుల్లి, ప్రత్యేక మసాలాలతో నూనెలో వేయించి చేస్తారు.
బయట రెస్టారెంట్లలో లభించే ఈ వంటకాన్ని మన ఇంట్లోనే చాలా శుభ్రంగా, రుచికరంగా ఎలా వండుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీని తయారీ విధానం చాలా సులభం. కాకపోతే.. చిన్నచిన్న మెళకువలు పాటిస్తే రెస్టారెంట్ రుచిని మించిన మటన్ వంటకం తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. వీకెండ్‌లో కుటుంబ సభ్యులకు ఈ అద్భుతమైన వంటకాన్ని వడ్డించి ప్రశంసలు పొందండి.
మటన్ – అర కేజీ
ఉల్లిపాయలు – మూడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
పచ్చిమిర్చి – నాలుగు
ధనియాల పొడి – ఒక స్పూన్
జీలకర్ర పొడి – అర స్పూన్
Also Read: మటన్, చికెన్ కూడా వద్దంటారు.. పల్లెటూరి స్టైల్ పనస పొట్టు కూర అంత బాగుంటుంది మరి!
గరం మసాలా – అర స్పూన్
కారం – ఒకటిన్నర స్పూన్లు
పసుపు – అర స్పూన్
నూనె – తగినంత
ఉప్పు – రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నిమ్మరసం – ఒక స్పూన్
పెరుగు – అర కప్పు
మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులో శుభ్రం చేసిన మటన్, కొద్దిగా ఉప్పు, పసుపు, అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక గ్లాసు నీరు పోసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ మెత్తగా ఉడికిన తర్వాత పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో తగినంత నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
తర్వాత అందులో చీల్చిన పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా కొద్దిగా నీళ్లు చల్లుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కలను నీటితో సహా లేదా నీరు వడకట్టి ఈ మసాలా మిశ్రమంలో వేయాలి. మటన్ ముక్కలకు మసాలా బాగా పట్టేలా మధ్యస్థ మంట మీద వేయించుకోవాలి.
ఈ దశలో పెరుగును బాగా గిలకొట్టి మటన్‌లో కలపాలి. నూనె పైకి తేలే వరకు సుమారు 10 – 15 నిమిషాల పాటు సన్నని మంటపై వేయించాలి. చివరగా గరం మసాలా పొడి, నిమ్మరసం, సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. ఎంతో రుచికరమైన తలావా గోష్త్ సిద్ధమైనట్లే. దీనిని వేడి వేడి అన్నంతో లేదా రోటీలతో తింటే ఆ మజానే వేరు.
Also Read: గుత్తి దొండకాయ కూర ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటారు!