Panasa Pottu Kura: పనస పండుతోనే కాదు.. పనస పొట్టుతో కూడా ఎంతో రుచికరమైన వంటకం తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా పల్లెటూళ్లలో పనస పొట్టు కూరను ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. మసాలాలు, ఉల్లిపాయలు, టమోటాలతో కలిపి వండితే ఈ కూర మంచి రుచిని ఇస్తుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కూరను కలుపుకుని తింటే ఆ రుచే మాటల్లో చెప్పలేనిది. చపాతీలు, రొట్టెల్లోకి కూడా ఈ కూర చక్కగా సరిపోతుంది. మరి ఇంట్లోనే ఎంతో రుచిగా పనస పొట్టు కూర ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..
పనస పొట్టు – 2 కప్పులు
ఉల్లిపాయలు – 2
టమోటాలు – 2
పచ్చిమిర్చి – 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
Also Read: గుత్తి దొండకాయ కూర ఇలా చేస్తే ఎవరైనా లొట్టలేసుకుంటూ తింటారు!
పసుపు – పావు టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
జీలకర్ర – అర టీస్పూన్
ఆవాలు – అర టీస్పూన్
ఎండుమిర్చి – 2
కరివేపాకు – 2 రెమ్మలు
నూనె – 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు
పనస పొట్టును శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పనస పొట్టు గట్టిగా ఉంటే ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా నీరు, ఉప్పు, పసుపు వేసి రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మెత్తగా మారి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి.
అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఇప్పుడు తరిగిన టమోటాలు వేసి మెత్తగా ఉడికించాలి. ఇందులో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ కలిసిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పనస పొట్టును వేసి మరోసారి బాగా కలపాలి.
కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కూర అడుగంటకుండా ఉంటుంది. చివరగా గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.
Also Read: కొబ్బరి నూనె, మసాలాలతో కేరళ స్టైల్ పీతల వేపుడు.. తయారీ విధానం ఇదిగో!