Dam Ka Kheema: సండే స్పెషల్ లంచ్ లేదా నైట్ డిన్నర్‌కు ఏదైనా స్పెషల్‌గా, రిచ్‌గా నాన్-వెజ్ వంటకం ట్రై చేయాలనిపిస్తే..దమ్ కా కీమాకు మించిన ఆప్షన్ మరొకటి లేదు. హైదరాబాద్ నవాబుల కాలం నాటి ఈ వంటకం దాని ప్రత్యేకమైన మసాలాలు, సుగంధ ద్రవ్యాల సువాసనతో అందరినీ ఆకట్టుకుంటుంది. వేడి వేడి బగారా అన్నం, పుల్కా లేదా నాన్‌తో.. ఇది అద్భుతమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది. హోటల్స్‌లో మాత్రమే దొరికే ఈ ట్రెండింగ్ రెసిపీని మన వంటింట్లో ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మటన్ కీమా: 500 గ్రాములు
పెరుగు: 1 కప్పు (చిక్కటి గడ్డ పెరుగు)
ఉల్లిపాయలు: 3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి: 4 లేదా 5 (నిలువుగా చీల్చినవి)
కారం: 2 టేబుల్ స్పూన్లు
ధనియాల పొడి: 1.5 టేబుల్ స్పూన్లు
గరం మసాలా పొడి: 1 టీస్పూన్
పసుపు: అర టీస్పూన్
పుదీనా మరియు కొత్తిమీర తరుగు: అర కప్పు
నెయ్యి లేదా నూనె: 4 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం: 1
ఉప్పు: రుచికి సరిపడా
1.ముందుగా ఒక వెడల్పాటి బౌల్‌లో శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కీమాను తీసుకోవాలి. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, తగినంత ఉప్పు, సగం వేయించిన ఉల్లిపాయల ముక్కలు, పుదీనా, కొత్తిమీర, చిక్కటి పెరుగు, 2 స్పూన్ల నూనె వేయాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని చేతితో.. కీమాకు బాగా పట్టించి, కనీసం 2 నుంచి 3 గంటల పాటు ఫ్రిజ్‌లో మ్యారినేట్ చేయాలి. ఎంత ఎక్కువ సేపు నానితే.. రుచి అంత బాగుంటుంది.
2. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి, మిగిలిన నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని అందులో వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత మంటను పూర్తిగా సిమ్ లో ఉంచాలి. గిన్నెపై మూత పెట్టి, ఆవిరి బయటకు పోకుండా.. గోధుమ పిండి ముద్దతో అంచులను సీల్ చేయాలి (దమ్ పద్ధతి).
3. ఈ విధంగా సన్నని మంటపై.. సుమారు 30 నుంచి 40 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యలో అడుగు అంట కుండా ఒక్క సారి చూసుకోవాలి. మటన్ కీమాలో ఉండే నీటితోనే అది మెత్తగా ఉడుకుతుంది. ఒకవేళ అవసరమైతే.. కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు కలుపుకోవచ్చు.
4. కీమా పూర్తిగా ఉడికి నూనె పైకి తేలిన తర్వాత, మూత తీసి గరం మసాలా పొడి, నిమ్మరసం , మిగిలిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. మరో 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. గుమగుమలాడే అచ్చమైన హైదరాబాద్ స్టైల్ ‘దమ్ కా కీమా’ రెడీ!
Also Read: నాన్ వెజ్ లవర్స్ కోసం..స్పెషల్ చికెన్ కారం పొడి రెసిపీ
కీమాను ముందే మ్యారినేట్ చేయడం వల్ల మసాలాలు ముక్కలకు బాగా పట్టి రుచి పెరుగుతుంది.
మంటను ఎప్పుడూ దమ్ సమయంలో సిమ్ లోనే ఉంచాలి, లేదంటే అడుగు మాడిపోయే అవకాశం ఉంది.
సర్వ్ చేసే ముందు పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.