Family values for children| ఈ రోజుల్లో పిల్లలకు కుటుంబ చరిత్ర, పూర్వీకుల జీవితం గురించి తెలుసుకునే అవకాశాలు చాలా తగ్గిపోయాయి. మొబైల్, ఇంటర్నెట్, చదువులు, ఇతర కార్యకలాపాలతో పిల్లలు ఎక్కువ సమయం గడుపుతున్నారు. అందుకే మన కుటుంబ మూలాలు, పాత సంప్రదాయాలు, పూర్వీకుల గురించి వారికి తెలియకపోవచ్చు. ఇలాంటి సమయంలో మీ పూర్వీకుల సాంవత్సరికం సందర్భంగా కుటుంబ కథలను పిల్లలకు పరిచయం చేయడానికి మంచి అవకాశంగా ఉపయోగపడుతుంది. పిల్లలకు మన పూర్వీకుల జీవితాన్ని చెబితే వారిలో కృతజ్ఞత, గౌరవం, బాధ్యత వంటి విలువలు పెరుగుతాయి.
సాంవత్సరికం రోజున కుటుంబ సభ్యులు తమ పితృదేవతలను గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలియజేస్తారు. అయితే ఈ రోజును కేవలం పూజలు, ఆచారాలకే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. పిల్లలకు వారి ముత్తాతలు, తాతలు, నానమ్మలు, ఇతర పూర్వీకుల గురించి చెప్పవచ్చు. వారు జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి పిల్లలకు వివరించండి. కుటుంబాన్ని నిలబెట్టేందుకు వారు ఎంత కష్టపడ్డారో చెప్పాలి. వారి నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే తత్వం, ఇతరులకు సహాయం చేసే గుణాల గురించి చెప్పండి. ఇలాంటి నిజ జీవిత కథలు పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపుతాయి.
పూర్వీకులను గుర్తు చేసుకోవడం కేవలం ఒక సంప్రదాయం కాదని పిల్లలకు చెప్పాలి. మన కుటుంబం ఈరోజు ఉన్న స్థితికి గత తరాల కృషి కూడా కారణమని వివరించాలి. వారు ఎన్నో కష్టాలను ఎదుర్కొని తరువాతి తరాలకు మంచి జీవితాన్ని అందించేందుకు ప్రయత్నించారు.
అందుకే వారిని గుర్తు చేసుకోవడం ద్వారా పిల్లల్లో కృతజ్ఞత, గౌరవ భావాలు పెరుగుతాయి.
చదువు మాత్రమే పిల్లల భవిష్యత్తును నిర్ణయించదు. మంచి వ్యక్తిత్వం, విలువలు, క్రమశిక్షణ కూడా వారి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంట్లో పెద్దలు ఎలా ప్రవర్తిస్తారో పిల్లలు ఎక్కువగా గమనిస్తారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం వంటి విషయాలను తల్లిదండ్రులు ఆచరణలో చూపాలి. అప్పుడు పిల్లలు వాటిని సహజంగానే నేర్చుకుంటారు.
పిల్లల వయసును బట్టి వారిని సాంవత్సరికం కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయవచ్చు. అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు చేస్తున్నాం? దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో వారికి సులభంగా వివరించాలి. వారు ప్రశ్నలు అడిగితే కోప్పడకుండా ఓపికగా సమాధానం చెప్పాలి. సంప్రదాయాల అర్థం తెలిసినప్పుడు పిల్లలు వాటిని మరింత ఆసక్తిగా అర్థం చేసుకుంటారు. పాత ఫొటోలు, కుటుంబ కథలు, జ్ఞాపకాలను కూడా పిల్లలతో పంచుకోండి. ఇవి కుటుంబ చరిత్రను వారికి మరింత దగ్గర చేస్తాయి.
Also Read: వయసు 21 ఏళ్లు.. ఒక్క నెలలో రూ.2.6 కోట్లు సంపాదన.. యువకుడి బిజినెస్ ఐడియా అదుర్స్
సాంవత్సరికం సందర్భంగా సేవా కార్యక్రమాలతో అనుసంధానం చేయడం కూడా మంచి పద్ధతి. అవసరంలో ఉన్నవారికి భోజనం పెట్టడం, వృద్ధులకు సహాయం చేయడం వంటి పనుల్లో పిల్లలను భాగస్వాములను చేయవచ్చు. పక్షులకు నీరు, ఆహారం అందించడం లేదా మొక్కలు నాటడం కూడా వారికి మంచి పాఠాలు నేర్పుతుంది. ఇలాంటి పనులు పిల్లల్లో దయ, సేవాభావం, బాధ్యత, సానుభూతిని పెంచుతాయి. డబ్బు, ఆస్తి కంటే మంచి ఆలోచనలు, మంచి సంస్కారాలు పిల్లలకు అందించే గొప్ప వారసత్వంగా నిలుస్తాయి. అందుకే సాంవత్సరికం రోజున పూర్వీకులను గుర్తు చేసుకుంటూ పిల్లలకు కుటుంబ విలువలను కూడా పరిచయం చేయాలి.
Also Read: స్కూల్ నుంచి రాగానే పిల్లలను ఈ ప్రశ్నలు అడగకండి.. ప్రశాంతంగా ఇలా చేయండి