జీవితం ఎంతో మారిపోయింది. ఆధునిక కాలంలో వాచీలోని ముల్లుతో పాటు మనిషి కూడా పరిగెత్తాల్సి వస్తోంది. ప్రపంచంలో ఒత్తిడితో కూడిన జీవితంలో విశ్రాంతి దొరకడమే లేదు. దీనివల్లే ఎంతో మంది ఆందోళన, డిప్రెషన్ వంటి బారిన పడుతున్నారు. యూరోపియన్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ సైకియాట్రీ జనరల్ చెప్పిన ప్రకారం ఆధునిక కాలంలో యువకులు, టీనేజీ అబ్బాయిలు ఎక్కువగా మానసిక సమస్యల బారిన పడుతున్నారు. వీరిలోని ఆత్మహత్య రేటు కూడా అధికంగా ఉంది.
పదేళ్ల వయసు నుంచే
2024లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన పరిశోధన ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పదేళ్ల నుండి 19 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి ఏడుగురు అబ్బాయిలలో ఒకరు మానసిక సమస్యతో బాధపడుతున్నారు. బిహేవియరల్ సమస్యలు వీరిలో అధికంగా ఉన్నాయి. ఇక 15 ఏళ్ల నుంచి 29 సంవత్సరాల మధ్య గల అబ్బాయిల్లో ఎక్కువమంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
బాధను చెప్పుకోలేక
కెనడాలోని బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న మానసిక శాస్త్రవేత్తలు మాట్లాడుతూ చాలామంది అబ్బాయిలు ఇప్పటికీ మానసిక ఆరోగ్యం కోసం ఇతరులను సహాయం కోరలేకపోతున్నారని వివరిస్తున్నారు. పురుషులు తమ భావాలను వ్యక్తపరచడం బలహీనతగా భావించి తమ బాధను చెప్పుకోవడం లేదని.. దీనివల్లే వారి మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని వివరిస్తున్నారు. ఇలా ఎంతోమంది మానసికంగా కుంగిపోయి చివరకు ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఇలా చేయండి
చదువుకున్న అబ్బాయిలు, చదువులేని అబ్బాయిలు… ఇద్దరిలో కూడా ఇప్పటికీ డిప్రెషన్ లక్షణాలను గుర్తించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్టు వివరిస్తున్నారు. సోషల్ మీడియా నిజానికి యువతకి ఈ విషయంలో ఎంతో సహాయపడుతుంది. కానీ సోషల్ మీడియాను హానికరమైన పద్ధతిలోనే వినియోగిస్తున్నారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అబ్బాయిలు తాము ఎదుర్కొనే సమస్యల గురించి ఒకసారి గూగుల్ లో వెతకడం ద్వారా కొంతవరకు మంచి పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. గూగుల్లో మీకున్న సమస్య లక్షణాలను చెబితే అది ఆ సమస్యను గుర్తించి చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా కూడా మనిషి సహాయాన్ని ఒక యంత్రం ఇవ్వలేదు. కాబట్టి సానుభూతి కోసం చూసేవారు కచ్చితంగా తమ ప్రియమైన వారి దగ్గర తమ బాధను చెప్పుకోవాలి. అప్పుడే వారిలోని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది.
ప్రపంచంలో చిన్న వయసులోనే పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడం అనేది కలవరం కలిగిస్తున్న అంశం. చదువు, పోటీ ప్రపంచం… ఇవన్నీ వారిలో ఒత్తిడిని విపరీతంగా కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. విద్య కారణంగా ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పిల్లలను తల్లిదండ్రులు గుర్తించి చేరదీసి ప్రేమగా మాట్లాడాలి. వారిలో ఉన్న ఒత్తిడిని తొలగించేందుకు ప్రయత్నించాలి.
చదువు విషయంలో వారు అతి ఒత్తిడికి గురవుతూ ఉంటే వారికి మద్దతునివ్వాల్సింది తల్లిదండ్రులే. కాబట్టి పదేళ్ల నుంచి 20 ఏళ్ల లోపు ఉన్న చదువుకుంటున్న అబ్బాయిల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధను చూపించాలి. వారిలో ఉన్న తీవ్ర మానసిక వేదనను, ఒత్తిడిని గుర్తించడానికి ప్రయత్నించాలి. వారికి ప్రతి నిమిషం అండగా ఉండాలి. అప్పుడే వారిలో ఆత్మహత్య ఆలోచనలు రాకుండా ఉంటాయి.