భారతదేశంలో ప్రజలు ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నారో తెలుసుకునేందుకు అధ్యయనాలు జరిగాయి. అందులో ఆశ్చర్యకరంగా మన జనాభాలో అధిక శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. దీనికి కారణం వారి ఆహార ఎంపికలు, జీవనశైలి, పర్యావరణం అలవాట్లు వంటివే. ముఖ్యంగా ఎండలోకి రాకుండా ఇంటిపట్టును ఉండడం, ఏసీలలో గడిపేందుకు ఇష్టపడడం వంటివన్నీ వారిలో విపరీతంగా విటమిన్ డి లోపాన్ని పెంచాయి.
విటమిన్ డి ని ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి చాలా అవసరం. కానీ చర్మానికి ఎండ తగలకుండానే ఎక్కువమంది గడిపేస్తున్నారు. బలమైన ఎముకల కోసం కచ్చితంగా మనం రోజులో అరగంట సేపైనా ఎండలో నడవాలి. ఇది మొత్తం ఆరోగ్యానికి అవసరమైనది. బలమైన రోగనిరోధక శక్తికి, బలమైన ఎముకలకు, చర్మ ఆరోగ్యానికి విటమిన్ డి అత్యవసర పోషకం. కాబట్టి ఉదయం పూట ఎండలో లేదా సాయంత్రం పూట ఎండలో కాసేపు అలా వాకింగ్ కు వెళ్ళాలి. ఆ ఎండ నుంచి మనకు పుష్కలంగా విటమిన్ డి శరీరానికి అందుతుంది.
కాసేపు ఎండలో గడపడం వల్ల కేవలం విటమిన్ డి ఉత్పత్తి కావడమే కాదు, మన శరీరం నుంచి సెరొటోనిన్ కూడా విడుదలవుతుంది. ఇది మన మానసిక ఆరోగ్యానికి అత్యవసరమైన హార్మోను. దీన్ని ఆనంద హార్మోన్ గా చెప్పుకుంటారు. మన మానసిక స్థితిని ఇది మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా డిప్రెషన్ తో బాధపడే వారికి సెరొటోనిన్ హార్మోన్ ఉత్పత్తి కావడం చాలా అవసరం. ఇది నిద్ర నాణ్యతను కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజు అరగంట పాటు ఎండలో తిరిగేందుకు ప్రయత్నించండి.
సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం దక్షిణ భారతదేశంలోని పట్టణాల్లో ఉన్న పెద్దలలో విటమిన్ డి అత్యధికంగా లోపించినట్టు తెలిసింది. యాభై ఏళ్లు నిండిన వారిలోనే అధికంగా విటమిన్ డి లోపం బయటపడింది. కాబట్టి ఆ వయసులో ఉన్నవారు కచ్చితంగా ఎండలో కాసేపు గడపాల్సిన అవసరం ఉంది.
ముప్పై ఏళ్ల వారిలో కూడా విటమిన్ డి లోపం ఎక్కువగానే కనిపించింది. వీరిలో వెన్ను నొప్పి వంటి సమస్యలు బయటపడ్డాయి. తగినంత సూర్య రశ్మిని తగిలేలా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. ఇండోర్ జీవనశైలికి అలవాటు పడి ఇప్పుడు ఎంతోమంది ఆ లోపంతో బాధపడుతున్నారు. ఇల్లు, కార్యాలయం లేదా స్కూలు ఇలా ఇండోర్ లోనే గడిపేందుకు ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీనివల్లే వారిలో విటమిన్ డి లోపం అధికంగా వస్తోంది.
ఆహార లోపం వల్ల కూడా
సాంప్రదాయ భారతీయ ఆహారంలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం కూడా ఎక్కువగా లేదు. కొవ్వు పట్టిన చేపలు, గుడ్డు సొనలు వంటివి వారు తక్కువగా తింటారు. అందుకే భారతీయులకు విటమిన్-డి లోపం వచ్చిందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మతపరమైన కారణాలు, పండుగలు వేళలో భారత దేశంలోని హిందువులు చేపలు, గుడ్లు వంటి వాటికీ దూరంగా ఉంటారు. అందుకే వారికి విటమిన్ డి తగినంత అందడం లేదు.
భారతీయ నగరాల్లో వాయు కాలుష్యం కూడా అధికంగానే ఉంటుంది. ఈ వాయు కాలుష్యం సూర్యరశ్మిని అడ్డుకుంటుంది. గాలిలోని అధిక స్థాయి దుమ్ము ధూళి కూడా సూర్యరశ్మి మన వరకు చేరకుండా అడ్డుకుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read: మీకు చేపలంటే ఇష్టమా? జాగ్రత్త, ఈ చేపల్లో విష పదార్థాలు ఉంటాయ్
విటమిన్ డి కోసం ప్రతి రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అరగంట పాటు ఎండలో తిరగాలి. అలాగే సాయంత్రం మూడు తర్వాత ఎండలో తిరగాల్సిన అవసరం ఉంది. ఆ ఎండలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.