డయాబెటిస్ చాప కింద నీరులా ప్రజల జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు యువతను కూడా ఈ వ్యాధి పట్టిపీడిస్తోంది. టీనేజర్లలో కూడా ఎంతోమంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ చూపించే లక్షణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు అవి మారుతూ ఉంటాయి.
ప్రస్తుతం యువతలో డయాబెటిస్ కొత్త లక్షణాలను చూపిస్తోంది. కానీ ఈ లక్షణాలు గురించి తెలియక ఎంతో మంది యువతీ యువకులు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యాధి ముదిరిపోయేదాకా పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ కొత్త లక్షణాలు గురించి తెలుసుకొని జాగ్రత్త పడడం ఎంతో మంచిది.
నల్లటి మచ్చలు
మెడ, చంకలు లేదా శరీరంపై నల్లటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అది మురికి అనుకుని రుద్దుతూ ఉంటారు.. కానీ పోదు. దీనికి కారణం డయాబెటిసే. ఇన్సులిన్ నిరోధకతకు సంకేతంగా ఇలా నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్ కు ప్రారంభ లక్షణంగా చెప్పుకోవచ్చు.
కోపం, చిరాకు
టీనేజర్లు లేదా అంతకన్నా పెద్దవారు ఇంట్లో చిన్న చిన్న విషయాలకే కోపం పడటం, చిరాకు పడడం, వారిలో మూడ్ స్వింగ్స్ అధికంగా ఉండడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి కావడం వంటివి కూడా డయాబెటిస్ లక్షణాలగానే చెప్పుకోవాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు కారణంగా వారి మానసిక స్థితి ఇలా మారిపోతూ ఉంటుంది. కాబట్టి మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.
స్వీట్లు తినాలనిపించినా
ఆహారం తిన్న తర్వాత కూడా పదే పదే తీయని పదార్థాలు తినాలన్న కోరిక పెరుగుతూ ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇన్సులిన్ నిరోధకత సరిగ్గా లేకపోయినా లేదా శరీరం దాన్ని వినియోగించకపోయినా… ఇలా తీపి తినాలన్న కోరిక పెరిగిపోతుంది. అంటే డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఇలాంటి వారికి అధికంగా ఉంటుంది.
చర్మ సమస్యలు
చర్మం పై పదేపదే దద్దుర్లు రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కావడం కూడా డయాబెటిస్ కు సంకేతమే. ముఖ్యంగా చంకల కింద, వేళ్ళ మధ్యన, శరీరంలో తడిగా ఉన్న ప్రదేశాలలో తరచూ దురద పెడుతున్నా, ఎరుపు రంగులోకి చర్మం మారుతున్నా… అది చక్కెర వ్యాధికి సంకేతంగా భావించాలి. రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నప్పుడే ఇలా చర్మ సమస్యలు వస్తాయి. దీన్ని సాధారణ చర్మ సమస్యగా భావించకండి. ఒకసారి డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం అన్నిటికన్నా ఉత్తమం.
బరువు తగ్గడం
డయాబెటిస్ కారణంగా ఆకస్మికంగా బరువు తగ్గిపోతారు. మీరు ఆహారం చక్కగా తింటున్నా, వ్యాయామం చేయకుండా ఇంట్లోనే నిశ్చలంగా ఉంటున్నా.. మీరు బరువు తగ్గిపోతున్నారంటే మీకు డయాబెటిస్ ఉందేమో చెక్ చేయించుకోవాలి. శరీరం గ్లూకోజ్ ను జీర్ణం చేసుకోలేనప్పుడు కూడా ఇలా ఆకస్మికంగా బరువు తగ్గే అవకాశం ఏర్పడుతుంది. ఇది డయాబెటిస్ కి సంకేతం గానే చెప్పుకోవాలి.
దృష్టి అస్పష్టంగా మారుతున్నా కూడా తేలికగా తీసుకోకూడదు. అప్పుడప్పుడు చూపు మసకగా మరి మళ్లీ సాధారణ స్థాయికి వస్తుంటే ఒకసారి డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారికి దృష్టిలోపాలు వచ్చే అవకాశం ఎక్కువ.
మధుమేహం వల్ల నోరు ఎల్లప్పుడూ పొడిగా మారిపోతుంది. ఇలా పొడిగా మారడం అనేది తేలికగా తీసుకోకూడదు. ఇది మధుమేహానికి సంకేతం. శరీరంలోని రక్తంలో చక్కెర అధికంగా ఉన్నప్పుడు ఇలా నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రతిరోజు తగినంత ఆహారం తీసుకుంటున్నా, కంటి నిండా నిద్రపోతున్నా కూడా మీకు అలసటగా అనిపిస్తూ ఉంటే ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే మధుమేహం వల్ల తీవ్రంగా నీరసంగా అనిపిస్తుంది. అలసటగా అనిపిస్తుంది. శక్తి హీనంగా కూడా అనిపిస్తుంది. కాబట్టి ఈ లక్షణాలను మీరు తేలికగా తీసుకోకుండా ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్నిటికన్నా ఉత్తమం.