Pawan Kalyan : ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పవర్ స్టార్ కాస్త డిప్యూటీ సీఎం అయిపోయారు. ఇలాంటి టైంలో ఆయనతో సినిమా అంటే చాలా కష్టమైన పని. ఒకటి డేట్స్ దొరకవు. ఒక వేళ పవనేశ్వరుడు కరుణించి డేట్స్ ఇచ్చినా… షూటింగ్ స్పార్ట్‌కి వచ్చినా.. నిర్మాతకు చుక్కలే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ సెట్స్‌లోకి రావడం లేదు అని టెన్షన్ పడ్డ నిర్మాతలు ఇప్పుడు.. ఇప్పుడు షూటింగ్ సెట్స్‌కి వచ్చిన తర్వాత కూడా టెన్షన్ పడుతున్నారట. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం…
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే హరి హర వీరమల్లు, ఓజీ సినిమాల షూటింగ్‌ను కంప్లీట్ చేశాడు. ఇప్పుడు హరీష్ శంకర్‌తో చేయాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఈ నెల 30 వరకు డేట్స్ ఇచ్చాడట. అంతే కాదు, ఆగష్టు, సెప్టెంబర్ వరకు షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయాలని కూడా డైరెక్టర్ హరీష్ శంకర్‌కు పవన్ కళ్యాణ్ చెప్పాడట. దీంతో డైరెక్టర్ కూడా వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారట.
పవన్ వస్తే, రోజుకు 2 కోట్లు ఖర్చు..?
అయితే, పవన్ కళ్యాణ్ షూటింగ్స్‌కి వస్తే నిర్మాతలకు వణుకు పుడుతుందట. ఎందుకంటే, రోజు వారి ఖర్చు భారీగా పెరిగిపోతుందట. పవన్ కళ్యాణ్ షూటింగ్స్ సెట్స్ కి వస్తే, ఆయన ప్రయివేట్ బౌన్సర్లు ఉంటారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కాబట్టి… ప్రభుత్వం నుంచి వస్తున్న సెక్యూరిటీ ఉంటుంది. వీరితో పాటు పవన్ కళ్యాణ్‌ను చూడటానికి వచ్చే వాళ్లు… ఇలా అందరూ కలిసి ప్రతి రోజూ దాదాపు 400 మందికి పైగా సెట్స్ లో ఉంటున్నారట.
400 మందికి మంచి నీళ్ల బాటిల్స్ నుంచి ఫుడ్ అంటూ ఇలా ప్రతి దానికి చూసుకుంటే భారీగా ఖర్చు అవుతుందట. ముఖ్యంగా పవన్ ప్రయివేట్ బౌన్సర్లు, ప్రభుత్వం నుంచి వచ్చే సెక్యూరిటీకే భారీగా ఖర్చు అవుతుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అలా మొత్తంగా ప్రతి రోజూ 1.50 కోట్ల నుంచి 2 కోట్ల వరకు నిర్మాతకు అదనంగా ఖర్చు అవుతుందని సమాచారం.
దీనికి తోడు పవన్ షూటింగ్‌కి వస్తే ఎక్స్‌ట్రా కెమెరాలు కూడా వాడాల్సి వస్తుందట. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి దాదాపు 4 నుంచి 6 కెమెరాలు వాడుతున్నారట. వీటితో పాటు సెక్యూరిటీ కెమెరాలు కూడా ఎక్కువగానే వాడుతున్నారట. వీటి ఖర్చు కూడా నిర్మాతలే భరించాలి.
కాగా, ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మైత్రీ వరుస సక్సెస్‌లో ఉంది. ముఖ్యంగా పుష్ప 2 మూవీ మైత్రీ మూవీ మేకర్స్ ను మొత్తం మార్చేసింది. ఆ ఒక్క సినిమాతోనే నేషనల్ వైడ్ గుర్తింపు వచ్చింది.