రాత్రి భోజనం తేలికగా ఉండాలి. ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. కానీ ఎంతోమంది రాత్రి మాత్రమే భారీ భోజనాలను చేస్తారు. అలాగే పడుకునే ముందే కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. ఆ విషయం తెలిసి కొంతమంది, తెలియక మరి కొంతమంది తిని నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
రాత్రి 7 దాటిందంటే భారీ భోజనాలు జోలికి వెళ్ళకూడదు. కొవ్వు నిండిన, నూనెలో వేయించిన పదార్థాలు తినకూడదు. స్పైసి ఫుడ్ కూడా దూరంగా ఉండాలి. అలాగే అర్ధరాత్రి లేచి తినడం వంటివి చేయకూడదు. ఇవన్నీ కూడా ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. మనం తినే ఆహారాన్ని బట్టి నిద్ర ఎలా పట్టాలన్నది నిర్ణయించి ఉంటుంది. మీరు తేలికపాటి ఆహారం తింటే హాయిగా నిద్రపోతారు. భారీ భోజనాలు తింటే నిద్ర మగతగా ఉంటుంది. ప్రతి గంటకు మెలకువ వచ్చేస్తుంది. అలాగే కొన్ని ఆహారాలు పీడకలలను కూడా కలిగిస్తాయని వాదన ఉంది.
రాత్రి పడుకోబోయే ముందు ఎలాంటి ఆహారాలను తినకూడదు తెలుసుకుందాం
ఉల్లిపాయలు
ఉల్లిపాయలు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. కానీ రాత్రిపూట మాత్రం ఉల్లిపాయలు తిన్నాక వెంటనే పడుకోకూడదు. ఇది యాసిడ్ రిఫ్లెక్షకు కారణం అవుతాయి. పొట్టను ఉబ్బరంగా మార్చేస్తాయి. అసౌకర్యానికి గురిచేస్తాయి.
ప్రోటీన్ షేక్స్
పడుకునే ముందు ప్రోటీన్ షేక్స్ ఎప్పుడూ మంచి ఎంపిక కాదు. నిద్ర వేళకు ముందు ప్రోటీన్ షేకులు తీసుకోవడం వల్ల మీ కండరాల పునరుద్ధరణకు సహాయపడవచ్చు. కానీ ఇది జీవక్రియ కార్యకలాపాలను నిద్రలో వేగవంతం చేస్తుంది. ఇది ఏ మాత్రం మంచిది కాదు.
పులియబెట్టిన ఆహారం
పులియబెట్టి చేసే ఆహారాలను రాత్రి పూట తినడం అంత మంచి పద్ధతి కాదు. పుల్లని పెరుగు, పుల్లని మజ్జిగ లేదా పుల్లని నిల్వ పచ్చళ్ళు వంటివి తినకూడదు. ఇవి ఉబ్బరానికి, జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి. అధిక ప్రోబయోటిక్స్ కలిగి ఉండి ఆమ్లత స్థాయిలను పెంచేస్తాయి.
డార్క్ చాక్లెట్
ప్రతిరోజు ఒక డార్క్ చాక్లెట్ ముక్క తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. డార్క్ చాక్లెట్ లో మెగ్నీషియం, ట్రిప్టోఫాన్, కోకో ఫ్లేవర్ వంటివి ఎన్నో ఉంటాయి. ఇవి నిద్ర పట్టడానికి సహాయపడతాయి. కానీ అధికంగా తింటే మాత్రం సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ను రాత్రి పూట తినకూడదు. ఉదయం పూట ప్రతిరోజూ చిన్న డార్క్ చాక్లెట్ ముక్క తినండి. అది రాత్రి వేళలో మీకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది. కానీ రాత్రి 7 దాటిన తర్వాత డార్క్ చాక్లెట్లను తినకపోవడమే ఉత్తమం.
పైన చెప్పిన ఆహారాలన్నీ ఉదయం పూట తింటే మంచిదే. కానీ సాయంత్రం అవుతున్న కొద్దీ మాత్రం వీటిని తినకూడదు. నిజానికి సాయంత్రం ఆరు దాటిన తరువాత మీరు తినే ఆహారం శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలకు కూడా కారణం అవుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకున్నా, నిద్ర చక్కగా పట్టాలన్నా, జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలన్నా రాత్రి పూట మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.