Divorce Reasons: చాలామంది భార్యాభర్తలు విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వారి మధ్య అవగాహన లేకపోవడం వల్లే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి. అయితే ముఖ్యంగా విడాకులకు కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. కొంతమంది భార్యాభర్తలు తమ ఆలోచనలకే విలువనిస్తారు, మరి కొందరు సమాజం కోసం నచ్చకపోయినా జీవిత భాగస్వామితో కలిసి ఉండేందుకు ఇష్టపడతారు. అయితే ఆధునిక కాలంలో విడాకుల కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది పెళ్లి చేసుకునే వారి సంఖ్యతో పాటు విడాకుల తీసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తోందని అధ్యయనం చెబుతోంది. అయితే భార్యాభర్తలు ఎక్కువగా విడిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.
వేరొకరితో సంబంధం పెట్టుకోవడం
భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంతో ముఖ్యం. వారి శారీరక, మానసిక అవసరాలకు జీవిత భాగస్వామి పైనే ఆధారపడాలి. కానీ కొంతమంది శారీరక అవసరాల కోసం ఇతర వ్యక్తులతో సంబంధాల్ని ఏర్పరచుకుంటున్నారు. ఈ విషయం తెలిసి జీవిత భాగస్వాములు మనసు విరిగి విడాకులకు వెళుతున్నారు. కాబట్టి మీ శారీరక అవసరాల కోసం జీవిత భాగస్వామి పైనే ఆధారపడితే మీ జీవితంలో విడాకులు అనే పదానికి తావుండదు.
గౌరవం లోపించడం
భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒకరి ఇష్టాన్ని మరొకరు అంగీకరించాలి. కానీ వివాహం తర్వాత ఎక్కువ మంది తమ కోసమే తాము జీవించేందుకు ఇష్టపడుతుంటారు. తమతో పాటు జీవించే వ్యక్తి ఇష్టానికి విలువనివ్వరు. ఇది ఎన్నో ఇబ్బందులకు కారణమవుతుంది. ఇలా తమను చిన్నచూపు చూడడం, గౌరవించకపోవడం వల్ల కొంతమంది జీవిత భాగస్వామితో విడిపోయేందుకు ఇష్టపడుతున్నారు.
Also Read: జిమ్‌లో ఆంటీతో ప్రేమ.. ఆమె భర్త కిల్లర్ అని తెలిస్తే? మరి.. ఆ రిలేషన్ నుంచి అతడు ఎలా భయటపడ్డాడు?
అర్థం చేసుకోలేక
వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను కష్టసుఖాల్లో తోడుగా ఉండేందుకు కలిపే ప్రక్రియ. కానీ ఆ భార్యాభర్తల మధ్య అవగాహన లోపిస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇద్దరూ కలిసి ఉండటం అంటే ఒకే ఇంటిలో ఉండడం అనుకుంటున్నారు, కానీ ఒకరి కష్ట సుఖాలను మరొకరు అర్థం చేసుకోవడం అని తెలియడం లేదు. దీని వల్ల వారికి ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ, నమ్మకం అనేది తగ్గిపోతున్నాయి. భాగస్వామిని అర్థం చేసుకోలేక, దూషించడం, అవమానించడం వంటివి జరుగుతున్నాయి. వీటివల్లే భార్యాభర్తలు విడాకులు తీసుకునేందుకు ముందుకెళుతున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ప్రేమ లోపించడం
వైవాహిక జీవితంలో ప్రేమ ఎంతో ముఖ్యం. ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ వారిని జీవితాంతం కలిపి ఉంచుతుంది. అయితే భార్యాభర్తల బంధంతో కొన్ని రకాల బాధ్యతలు కూడా వస్తాయి. కొంతమంది ఆ బాధ్యతను నిర్వర్తించలేకపోతున్నారు. ఆర్థిక సమస్యలు, ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడు జీవిత భాగస్వామి పైనే బరువును పడేస్తున్నారు. ఒత్తిడికి లోనవుతుంటారు. వీటన్నిటి మధ్య వారిలో ప్రేమ లోపిస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకోవాలని విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. ఇన్ని బాధ్యతలు ఉన్నా… ఎన్ని సమస్యలు ఉన్నా భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటే ఎలాంటి సమస్యా రాదు. ప్రేమ ముందు ఎంతటి సమస్య అయినా దూది పింజలా ఎగిరిపోతుంది.
లైంగిక సంతృప్తి
వివాహంలో లైంగిక జీవితం కూడా చాలా ముఖ్యం. ఇద్దరి మధ్య లైంగిక అవగాహన తగ్గిపోతే వారిద్దరూ దూరం అయిపోతారు. భాగస్వామిని లైంగికంగా వేధించడం, లైంగికంగా సంతృప్తి పరచలేకపోవడం ఈ రెండూ కూడా విడాకులకు దారితీస్తున్నాయి. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం విడాకుల ప్రమాదాన్ని పెంచుతున్నాయి. మీరు మీ జీవిత భాగస్వామి అవసరాలను గుర్తించి వారికి తగ్గట్టు మెలగవలసిన అవసరం ఉంది. జీవిత భాగస్వామిని లైంగికంగా సంతృప్తి పరచడం అనేది ముఖ్యమైన ప్రక్రియ అని న్యాయస్థానాలు కూడా చెబుతున్నాయి. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్య లైంగికంగా దూరం పెరుగుతుందో వారిలో ప్రేమ కూడా తగ్గిపోతుంది. నమ్మకం సడలుతుంది. కాబట్టి భార్యాభర్తలు లైంగిక అవసరాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే వారి పెళ్లి పెటాకులే అవుతుంది.