BigTV English

Donald Trump-Elon Musk: ట్రంప్ విజయానికి.. మస్క్ వాడిన మంత్రం ఇదే

Donald Trump-Elon Musk: ట్రంప్ విజయానికి.. మస్క్ వాడిన మంత్రం ఇదే

Donald Trump-Elon Musk: ముందస్తు సర్వేలు తారుమారయ్యాయి.. టైట్ ఫైట్ కాస్తా ఒన్ సైడ్ అయ్యింది. కేసులు, ఆరోపణలు, వెక్కిరింతలు గాలిలో కొట్టుకుపోయాయి.. రెండు హత్యాయత్నాల తర్వాత కూడా ఫైటింగ్ స్పిరిట్ స్పష్టంగా కనిపించింది. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ పనిచేసింది. ప్రపంచ పెద్దన్నగా డోనాల్డ్ ట్రంప్‌కు గెలుపొచ్చింది. అయితే, ఈ అనూహ్యమైన విక్టరీ అంత సులువుగా రాలేదు. ప్రపంచ కుబేరుడు స్టార్ క్యాంపైనర్ అయ్యాడు. ఫలితం దక్కింది. ట్రంప్ 2.0 మొదలయ్యింది. మాజీ అధ్యక్షుడు మరోసారి అధ్యక్షుడయ్యారు. అసలు ఇది ఎలా..


ఏడాదిగా నడుస్తున్న యుద్ధం.. నెలల ముందే మారిన పోటీ. ఇద్దరు ప్రత్యర్ధుల మారినా.. రెండు సార్లు హత్యాయత్నాలు జరిగినా చెక్కుచెదరని ఫైటింగ్ స్పిరిట్.. అన్నీ కలిసి, కీలకమైన స్వింగ్ స్టేట్స్‌లో మెజారిటీ ట్రంప్‌నే కావాలంది. ఫలితం వెరీ క్లియర్ కట్.. కౌంటింగ్ మొదలైనప్పటి నుండీ ఆధిక్యంతోనే అల్లుకుపోయిన ట్రంప్.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 47వ నయా ప్రెసిడెంట్‌గా తిరుగులేని విజయాన్ని దక్కించుకున్నారు. రెండో పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎప్పుడూ లేనంత ఉత్కంఠత మధ్య కొనసాగిన ఈ ఎన్నికల్లో ట్రంప్ విజయం చాలా ప్రత్యేకమనే చెప్పాలి.

ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడౌతాడనుకున్న కాలం నుండీ పోరాడి, పోరాడి, మరోసారి ఘన విజయం సాధించి, అమెరికా ప్రజాస్వామ్యంలో కొత్త చరిత్రను సృష్టించారు. అయితే, విక్టరీ దొరికినంత సులువుగా ఎన్నికల పోరు సాగలేదు. నెక్ అండ్ నెక్ ఫైట్‌లో నెగ్గుకొచ్చారు ట్రంప్. సర్వేలన్నీ ఫేట్ టైట్‌గా ఉందని చెప్పినా విజయం తనదే అనే ధీమాను మొఖంపైన పులుముకొని ప్రచారం చేశారు. “అమెరికా తనను ఎన్నుకోకుండా ఉండలేదంటూ” జబ్బ చరిచిమరీ చెప్పాడు. మొత్తానికి, విజయం వరించింది. అయితే, దీనికి కారణం ఉంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ బ్యాక్ అప్ నుండీ.. అమెరికా ఆర్థిక పరిస్థితి.. వలసల వివాదాలు.. విదేశీ వ్యవహారాలు.. గ్రామీణ ఓటర్ల, గ్లోబల్ కంపెనీలు ఇలా ట్రంప్‌ గెలుపు వెనుక చాలా అంశాలు కీలక పాత్ర పోషించాయి.


ఓట్ల లెక్క పూర్తి కాకముందే ట్రంప్ గెలుపు ఖాయమయ్యింది. ప్రధాన యుద్దభూమి రాష్ట్రాల్లో ట్రెండ్‌లన్నీ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ చుట్టూనే తిరిగాయి. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రత్యర్థి డెమొక్రాట్‌ పార్టీ పరపతి పెంచుకున్న శివారు ప్రాంతాలను కూడా ట్రంప్ తిరిగి పొందారు. ముఖ్యంగా, ఈసారి ఎన్నికల్లో కీలకమైన లాటినో ఓటర్లు ఫ్లాట్ ఆఫర్ ఇచ్చారు. గంప గుత్తుగా ట్రంప్‌కి ఓటేసి పెద్ద విజయాన్ని కట్టబెట్టారు. అప్పటి వరకూ సస్పెన్స్ పెంచిన ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల వ్యాఖ్యాతలు, పొలిటికల్ జర్నలిస్టుల పోకడలన్నీ పటాపంచలయ్యి, గెలుపు లెక్కలు స్పష్టంగా కనిపించాయి.

మొదటి నుండీ అనుకున్నట్లే గ్రామీణ ప్రాంతాల్లో ట్రంప్ ఆధిపత్యం చెలాయించారు. చివరికి, ప్రెసిడెంట్ జో బైడెన్ స్వస్థలమైన లాక్‌వన్నా కౌంటీలో కూడా డొనాల్డ్ ట్రంప్ పాగా వేశారు. ఎప్పటి నుండో డెమోక్రాట్లకు అండగా ఉన్న శ్వేతజాతి గ్రామీణ అమెరికన్లు ఈసారి ట్రంప్‌కు టర్న్ అయ్యారు. జాత్యహంకార, జెనోఫోబిక్, వలస వ్యతిరేక, స్వలింగ సంపర్కుల వ్యతిరేకులనే ముద్ర ఉన్న గ్రామీణ ఓటర్లు, వారి ఆలోచనలకు సరిపోయే హామీలిచ్చిన ట్రంప్‌కి సై అన్నారు. దేశవ్యాప్తంగా 43 శాతం అమెరికన్లు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 20 శాతానికి పైగా ఉన్న వీళ్ల నిరుద్యోగిత రేటు ఓటును మార్చింది. కట్ చేస్తే… ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ పీఠం ఏక్కారు.

Also Read: ట్రంప్ – ఎలాన్ మస్క్.. వీరి స్నేహం వెనుక ఓ స్టోరీ..

ఇక, ఈ ఎన్నికల్లో ఇమ్మిగ్రేషన్ ఎఫెక్ట్ మైండ్ బ్లాక్ చేసింది. ఉత్తర అమెరికా, ఐరోపాలో పెరుగుతున్న అక్రమ వలసల ఆందోళనలు సగటు అమెరికన్‌ను తట్టి లేపాయి. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ చేపట్టిన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక వాగ్థానాలకు వాళ్లంతా ముగ్థులయ్యారు. వలసలు తగ్గించే అధ్యక్షుడే మాకు కావాలంటూ ఓటు గుద్దారు. జార్జియాలో తన చివరి ర్యాలీ చేపట్టిన ట్రంప్… 1798 నాటి ఏలియన్ ఎనిమీస్ యాక్ట్‌ను అమలు చేస్తే బాగుంటుందని ప్రకటించారు. ఈ చట్టం ఎంత కఠినమంటే… రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపనీస్, ఇటాలియన్, జర్మన్ అమెరికన్లను ఇంటర్న్ చేయడానికి ఉపయోగించింది. సరైన అధికారిక పత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించి, అమెరికన్ల మరణానికి కారణమయ్యే వలసదారులకు మరణశిక్ష విధించేంత తీవ్రమైంది. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఉందని తన ప్రచారంలో మోత మోగించిన ట్రంప్.. ప్రస్తుతం, “యునైటెడ్ స్టేట్స్ ఆక్రమిత దేశం” అంటూ సగటు అమెరికన్‌ను రెచ్చగొట్టారు. “అమెరికా పట్టణాలు, నగరాలు వేలాది మంది వలసదారులతో నిండిపోయింది” అంటూ లెక్కలు చెప్పారు.

ఇటీవలి కాలంలో, అక్రమ వలసల సమస్య పాశ్చాత్య ప్రపంచం అంతటా వార్తల్లో ప్రముఖంగా వినిపింది. అక్రమ వలసదారుల కారణంగా తమ దేశాల్లో శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడిందంటూ చాలా మంది వాదించారు. వలసలు ఎక్కువ కావడం వల్ల ఆ దేశంలో సివిల్ సౌకర్యాలు, సేవలపై ఒత్తిడి పెరుగుతుందని మొత్తుకున్నారు. సరిగ్గా, ఈ వలస కార్డునే ఉపయోగించిన ట్రంప్ ఫేట్ టర్న్ అయ్యింది. ప్రజలలో లోతైన విభజన బయటపడింది. ఈ అక్రమ వలసదారులను జో బైడెన్-కమలా హ్యారిస్‌లే దగ్గరుండి మరీ ఆహ్వానిస్తున్నారు అన్నంత స్థాయిలో ట్రంప్ ప్రచారం హోరెత్తింది. అలా, ఈ సమస్యను ఎంత ఎక్కువగా వాడుకోవాలో అంత ఎక్కువగా వాడేశారు ట్రంప్. ఇది ఎంతగా ఓటర్లలో చొచ్చుకుపోయిందంటే.. అక్రమ వలసదారులను ఆమోదించని చట్టబద్ద వలస జనాభా కూడా ట్రంప్‌కు ఓటేసేటట్లు చేశాయి. ఇమ్మిగ్రేషన్, సరిహద్దు భద్రతపై ట్రంప్ చేసిన ప్రసంగాలు అమెరికా ఎన్నికల యుద్ధంలో అత్యంత బలమైన ఆయుధాలుగా పనికొచ్చాయి.

ఇక, ట్రంప్ విదేశాంగ విధానం కూడా అమెరికన్లను ఆవాహన చేసుకుంది. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు డెమొక్రాటిక్ ప్రభుత్వాన్ని నిందించారు ట్రంప్. జో బైడెన్ విదేశీ వ్యవహారాల్లో వైఫల్యమే దీనికి కారణమని బల్ల గుద్ది మరీ చెప్పారు. విదేశీ సంఘర్షణలలో యూఎస్ డబ్బును నీళ్లులా ఖర్చు పెడుతున్నారంటూ ట్రంప్ పెట్టిన మంట డెమోక్రాట్ల గెలుపును కాల్చి బూడిద చేసింది. “నాకు అధికారం ఇస్తే నిమిషాల్లో యుద్ధాలను ముగిస్తాను” అని చెప్పిన ట్రంప్ కాన్ఫిడెన్స్ ఓట్లను రాల్చింది.

ఉక్రెయిన్ యుద్ధం కోసం అమెరికా పోసిన డాలర్ల గుట్టలను.. మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అందించిన డబ్బుల మేటలను గుర్తు చేస్తూ ట్రంప్ ఎలక్షన్‌ని తన వైపు తిప్పేసుకున్నారు. విదేశీ యుద్ధాలకు వ్యతిరేకంగా ట్రంప్ వాక్చాతుర్యం ఓటర్లను ఆకర్షించింది. ఆ మధ్య, వాల్ స్ట్రీట్ జర్నల్.. స్వింగ్ స్టేట్స్‌లో చేసిన అభిప్రాయ సేకరణ ప్రకారం.. ఉక్రెయిన్, మధ్యప్రాచ్య యుద్ధాల మధ్య అమెరికాని ఎవరు మెరుగ్గా నడిపిస్తారు అనే ప్రశ్నకు దాదాపు అందరికి ట్రంప్ మొహమే కనిపించింది. గతంలో, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ట్రంప్ కౌగిలించుకున్న దృశ్యాలు… చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌తో ట్రంప్ చేసిన బాసలు.. నార్త్ కొరియా లీడర్ కిమ్ జోంగ్‌తో చేయి చేయి పట్టుకు నడిచిన ట్రంప్ మాత్రమే కళ్ల ముందు కదిలారు. వెరసి ఓటింగ్ ట్రంప్‌కు విక్టరీ ఇచ్చింది.

ఇక, ఈ ఎన్నికల్లో అత్యంత భారీ ఎఫెక్ట్ చూపించింది అమెరికా ఆర్థిక వ్యవస్థ. ఇటీవలి న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, 2024 అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత ఎక్కువ ప్రభావం చూపిన నంబర్ 1 అంశం ‘ఆర్థిక వ్యవస్థ’. అస్తవ్యస్తంగా ఉన్న అమెరికా ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో బైడెన్ ప్రభుత్వం విఫలం అయ్యిందనీ.. మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రమే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలరని అమెరికాలో మెజారిటీ వర్గం అభిప్రాయపడింది.

ఇక, సెప్టెంబర్‌లో నిర్వహించిన, టైమ్స్/సియెనా పోల్‌లో కూడా ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఆర్థిక వ్యవస్థను ట్రంప్ సమర్థవంతంగా నిర్వహించగలరని అన్నారు. అయితే, ప్రజల్లో ట్రంప్ పట్ల ఇంత నమ్మకం రాడానికి, ట్రంప్ చెప్పిన రీజినింగ్‌తో పాటు ట్రంప్ వెనుకున్న బిజినెస్ టైకూన్‌లు కూడా కారణమయ్యారన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. అందులో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఉన్నారు. అందుకే, తాజాగా తన విక్టోరియస్ స్పీచ్‌లో ట్రంప్, ఎలన్ మస్క్‌ను ఆకాశానికి ఎత్తేశారు. తన విజయంతో… అమెరికాలో ‘న్యూ స్టార్ ఈజ్ బోర్న్’ అంటూ ఎలన్ మస్క్‌ను విక్టరీ స్టార్‌గా మార్చారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×