సరస్వతీ నది భారత దేశంలో ప్రాచీన కాలంలో ప్రవహించిన ఒక దేవ నదిగా చెప్పుకుంటారు. ఇది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించేదని.. చివరికి అరేబియా సముద్రంలో కలిసిపోయేదని అంటారు. అయితే ప్రస్తుతం భూమిపై సరస్వతి నది లేదని అది భూగర్భంలో ప్రవహిస్తోందని చెబుతున్నారు.
తెలంగాణలోని కాళేశ్వరం ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత నదులు కలిసే చోట సరస్వతీ నది సంగమం కూడా అంతర్వాహికంగా జరుగుతుందని నమ్ముతారు. వేద కాలంలోనే సరస్వతీ నదికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు సరస్వతీ నదిపైనే ఆధారపడి జీవించేవారని అంటారు.
మానా గ్రామం
అలాంటి సరస్వతి నదిని మీరు చూడాలనుకుంటే మన దేశంలోని ఉత్తరాఖండ్ ప్రాంతానికి వెళ్ళండి. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్ సమీపంలో ఒక చిన్న గ్రామం ఉంది. అదే మానా గ్రామం. ఇది చారిత్రాత్మకంగా ఎంతో చరిత్ర కలిగినది. పాండవుల స్వర్గారోహణ చేసేటప్పుడు ఈ గ్రామం గుండానే ప్రయాణించారని చెప్పుకుంటారు. ఉత్తరాఖండ్ వెళ్తే ఈ మానా గ్రామాన్ని చూడకుండా వెనక్కి రాకండి.
మానా గ్రామం ఎంతో ప్రత్యేకమైనది. ఇది అందంగా ఉండటమే కాదు అక్కడకు వెళితే ఒక చారిత్రాత్మక ప్రదేశానికి వెళ్ళినంత అనుభూతి కలుగుతుంది. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఈ మానా గ్రామం ఉంది.టిబెట్ సరిహద్దుకు చాలా దగ్గరగా ఉన్న గ్రామం ఇది. బద్రీనాథ్ ధామ్ నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇక్కడ సరస్వతి నదిని చూడవచ్చు.
పాండవులు నడిచిన దారి
మణిభద్ర దేవ్ అనే దేవుడి పేరుమీద ఈ గ్రామానికి మానా అనే పేరు పెట్టారు. ఈ గ్రామం శాపాలు, పాపాల నుండి విముక్తి పొందిన ప్రదేశంగా చెప్పుకుంటారు. పాండవులు స్వర్గం వైపు నడుచుకొని వెళుతూ గ్రామం గుండా నడుచుకుని వెళ్లారని ఒక నమ్మకం. ఇక్కడ భీమ వంతెన కూడా ఉంది. భీముడు ఈ దారిలో వెళ్తూ ఒక జలపాతాన్ని దాటేందుకు పెద్ద రాయిని విసిరి దాన్ని వంతెనగా నిర్మించాడని అంటారు.
సరస్వతి నది కనిపించే ప్రాంతం
మానా గ్రామానికి వెళితే మీరు ఎన్నో ప్రకృతి అందాలను అనుభూతి చెందవచ్చు. ఇక్కడ ఉన్న వసుంధర జలపాతం, వ్యాసుడి గుహ, తప్త కుండ్ వంటివన్నీ చూడవచ్చు. ఇక ప్రముఖమైనది సరస్వతీ నది. సరస్వతీ నది కూడా ఇక్కడి నుంచే పుట్టి అన్ని ప్రాంతాలకు ప్రవహించేదని చెప్పుకుంటారు. సరస్వతీ నదిని అక్కడ మీరు చూడవచ్చని అంటారు. మన గ్రామం దగ్గర ఉపరితలంపైనే సరస్వతీ నది చిన్నగా ప్రవహిస్తూ కేశవ ప్రయాగ వద్ద అలకనంద నదిలో కలుస్తుంది. ఇది ఆధునికంగా బయటపడిన విషయం. కాబట్టి మీరు దైవ నది అయిన సరస్వతీ నదిని దర్శించాలనుకుంటే మానా గ్రామానికి వెళ్ళండి.
పురాతన కథల ప్రకారం సరస్వతి నది బ్రహ్మ దేవుని కమండలం నుంచి ఉద్భవించింది. అక్కడ నుంచి హిమాలయాల్లోని వృక్షం నుంచి బయటకు వచ్చింది. అక్కడి నుంచి ప్రవహిస్తూ చివరికి అంతర్వాహినిగా మారి కనుమరుగయింది. అదే శాస్త్రీయపరంగా చూస్తే సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్ లోని శివాలిక్ కొండల్లోని గ్లేసియర్ అంటే హిమానీ నదాల నుంచి ఉద్భవించిందని అంటారు.
తర్వాత ఏర్పడిన భూకంపాల వల్ల సరస్వతీ నది మార్గం మారిపోయిందనీ, పూర్తిగా భూగర్భంలోకి చేరిపోయిందని అంటారు. ఇప్పుడు మానా గ్రామంలోనే సరస్వతి దేవి కనిపిస్తోంది. దీంతో దానినే ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు.
సరస్వతీదేవి భూమిపై కనిపించకపోయినా మిగతా నదుల్లాగే ప్రతి 12 నెలలకు ఒకసారి సరస్వతీ నదీ పుష్కరాలను చేస్తారు. బృహస్పతి అంటే గురు గ్రహం మిధున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఇది జరుగుతుంది. ఈసారి 2025లో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ నదీ పుష్కరాలు జరిగాయి.