Hanamkonda Shocking Incident: ఏపీలో అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన మరువక ముందే తెలంగాణలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హనుమకొండ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా దారుణం జరిగింది. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో వివాహేతర సంబంధం పెట్టుకుందని గ్రామస్థులంతా కలిసి ఓ మహిళను వివస్త్రను చేశారు. తర్వాత చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. వివాహేతర బంధం కొనసాగిస్తున్న ఆ ఇద్దరికీ అరగుండు కొట్టించారు. కేసును సుమోటగా స్వీకరించిన ధర్మసాగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గంగా కుటుంబ సభ్యులు పోలీసుల అదుపులో ఉన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ సమీపంలోని ఓ గ్రామంలో నివసించే మహిళపై ఓ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్రమ సంబంధం ఉందని ఆరోపించారు. దీని తాలుకూ ఆమెను గ్రామ పెద్దల ముందుకు తీసుకువచ్చి నిలబెట్టారు. ఆమె చెబుతున్న వినకుండా.. కొందరు ఆమెను చెట్టుకు చేతులు కట్టేసి, అవమానంగా నిలబెట్టారు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న కొంతమంది.. మొబైల్ ఫోన్ లలో చిత్రీకరించడంతో, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ హింసాత్మక చర్యపై.. మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో, “నేను ఏ తప్పూ చేయలేదు. నాకు ఎవరితోనూ సంబంధం లేదని చెప్పినా.. వినకుండా చెట్టుకు కట్టేసి దౌర్జన్యానికి పాల్పడ్డారు. శారీరకంగా, మానసికంగా హింసించారని ఆమె ఫిర్యాదులో తెలిపింది.
స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ ప్రారంభించారు. బాధితురాలిని చెట్టుకు కట్టిన ఘటనపై సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరూ న్యాయ వ్యవస్థకు భిన్నంగా.. సొంతంగా తీర్పు చెప్పేందుకు ప్రయత్నించరాదని, ఈ దేశంలో చట్టం ఉన్నదని పోలీసు వారికి హెచ్చరించారు.
Also Read: అమ్మ నాతో చివరిగా చెప్పింది ఇదే.. కన్నీళ్లు పెట్టిస్తున్నస్వేచ్ఛ కూతురి మాటలు
ఈ సంఘటనను రాష్ట్ర మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. “ఇది మానవ హక్కుల ఉల్లంఘన. మహిళపై వచ్చిన అనుమానంతో ఇలాంటివి చేయడం అమానుషం. ఇది శరీరాన్ని కాదు, మనసుని హింసించే చర్య” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.