ప్రతి వ్యక్తి జీవితంలో ప్రత్యేకమైన అనుబంధాలు ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరి జీవితంలోనైనా ప్రధానమైన అనుబంధం ఏదో? మానసిక శాస్త్రవేత్తలు ఆ అనుబంధం గురించి ఇక్కడ వివరించారు. నిజానికి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన అనుబంధం మీలో ఉన్న మీరే. మీలో ఉన్న మనసుతో మీరు మాట్లాడుకొని సంతోషంగా జీవించడమే. మీతో మీరు ఆనందంగా ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, మనుషులతో కూడా మీరు ప్రశాంతంగా జీవించగలుస్తారు. గౌతమ బుద్ధుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు. ‘మనం ఏమనుకుంటామో.. చివరికి మనం అదే అవుతాము’ అని.
మీతో మీరు కనెక్ట్ అవ్వండి
ఇతరులతో సంబంధాలకే మీరు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అయితే మీరు తిరిగి వెనక్కి అంతే ప్రాధాన్యతను పొందకపోవచ్చు. ఇది మిమ్మల్ని మానసికంగా కుంగతీస్తుంది. మీరు ఇతరులకు ఇచ్చే అధిక ప్రాధాన్యతను ముందు మీకు మీరు ఇచ్చుకోండి. ఇది మానసికంగా అంతర్గతంగా బలాన్ని ఇస్తుంది. మీతో మీరు కనెక్ట్ కావడం ఎంతో ముఖ్యం. మీలో మీరు మాట్లాడుకోవడం, మీకు కావాల్సిన పనులు చేసుకోవడం, మీకు సంతోషాన్ని ఇచ్చే పనులను పూర్తి చేయడం వంటివి చేయండి. మీరు ఎంతో సంతోషంగా జీవించగలుగుతారు.
మీ అంతరంగంతో మీరు కనెక్ట్ అయితే మీ భావోద్వాగాలు, భావాలు, ఆలోచనలు మీకు మరింతగా తెలుస్తాయి. అలాగే మీ లోపాలు కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి ప్రతిరోజూ ఒక గంట పాటు మీకోసం మీరు కేటాయించుకోండి. మీ గురించి మీరు ఆలోచించండి. మీరు సంతృప్తికరమైన జీవితాన్ని మీకు నచ్చిన జీవితాన్ని గడపగలుస్తున్నారో లేదో ఆలోచించండి. ఇతరులకు ఇచ్చే ప్రాధాన్యతలో మీకు కూడా కొంత భాగాన్ని ఇచ్చుకుంటే మీరు ఆనందంగా జీవించగలుగుతారు.
ఆత్మ గౌరవం
ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం ముఖ్యం. అది లేని చోట ఏ వ్యక్తి జీవించలేడు. కాబట్టి మీ ఆత్మ గౌరవానికి భంగం కలిగే చోట మీరు నివసించకండి. ఆత్మగౌరవం లేని ఆరోగ్యం కూడా దక్కదు. మీ నుంచి ఒక అనుబంధం వారి కోరికలు, అవసరాలు మాత్రమే డిమాండ్ చేస్తే ఆ అనుబంధం మీకు అవసరం లేదు. అది మీకు బాధను తప్ప ఎలాంటి ఆనందాన్ని ఇవ్వదు.
జీవితం అనూహ్యమైనది. సవాళ్లతో నిండి ఉంటుంది. మీతో మీరు బలమైన అనుబంధాన్ని కలిగి ఉంటే ఏ సవాలునైనా ఎదుర్కొనే శక్తి మనసుకు వస్తుంది. దీన్నే మనోబలం అంటారు. మన భావాలను, భావోద్వేగాలను ప్రాసెస్ చేసి మన అనుభవాల నుండి నేర్చుకొని జీవితంలో ముందుకు సాగడానికి మనస్సు సహాయపడుతుంది. దీనికి అంతర్గతంగా బలమైన పునాది అవసరం.
Also Read: మీపై అసూయ పడేవారిలో కనిపించే లక్షణాలు ఇవే.. వారితో జర భద్రం!
మనం మన అంతరంగానికి లోతుగా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీ మనసు, మెదడు కలిపే పని చేయాలి. బాహ్య ఒత్తిడికి అంతర్గతంగా ఇబ్బందులు ఏర్పడకుండా చూసుకోండి. మీతో మీరు మంచి సంబంధాన్ని కలిగి ఉండడానికి ప్రయత్నించండి. ఇందుకోసం యోగా, ధ్యానం వంటివి చేయండి. మీ ఆలోచనలను ఒక చోట రాసి పెడుతూ ఉండండి. మీతో మీరు ఎక్కువ సమయం గడపండి. మీకు నచ్చిన పుస్తకాలను చదవండి. నచ్చిన వంట చేయండి. ఇవన్నీ మీలో ఎన్నో పాజిటివ్ మార్పులను తీసుకొస్తాయి.